విశ్వనాథ సత్యనారాయణగారు – సామ్రాట్టు సమీక్ష

1459

రెండేళ్ళ క్రిందట హ్యూష్టను నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు కీర్తిశేషులు విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చివుంటే, వారు సమీక్ష రాసివుంటే, ఇలా వుండేదేమో..

 

సామ్రాట్టు సమీక్ష

శ్రీనివాస ఫణికుమార్ డొక్కా

telugu community news - viswanatha-satyanarayana-garu

శ్రీమద్రామాయణ కల్పవృక్ష కర్త సమీక్షల నేల వ్రాయవలెను? అందునా అమెరికా దేశమున జరిగిన ఒకానొక తెలుగుల సభగూర్చి వ్రాయవలెనా? వ్రాసినాడు. అనుగుల సహితముగా ధర్మజుడు విరటుని గొల్వబోలేదో? విష్ణు పాదోద్భవయైనను తుదకు అర్ణవమున గలియుట లేదో? గాన ఇది వైపరీత్యముగాదు. నేను సమీక్ష జేయుట వారి యదృష్టమనవలెను. వారు చేసుకున్న పున్నెములు ఊరకెబోవునా ?

 

తొల్దొల్త, అసలు రానని దలచియే ఆహ్వానమంపినారు వారు. ప్రపంచమున ప్రచారముజరిగినది గదా, ఛాందసుడననియు, ముక్కోపిననియు. అందువలన రాననుకొనినారు. సంద్రములు దాటుటకు వెరచి, ఆహ్వానమును తిరస్కరింతురని వారు భావించి యుండవచ్చును.

 

ప్రపంచమున కూటములు గట్టుచున్న గొందరు కుహనా హేతువాదులు ఛాందసులు కారో? నిర్ధారించిన పిదుపనే నమ్మెదమన్న, అది నమ్మకమెట్లగును?అది ఛాందసముకాదో? తమ తమ తల్లి దండ్రుల జన్యు పరీక్షలు జరిపించిన పిమ్మటనే “అమ్మా”, “అయ్యా” అని పిలిచినారో? ఏమో, యా ఛాందసులే జెప్పవలెను. అది ఒక చిత్రము.

 

ఏమైననూ, ఈ సంఘము వారు అట్టివారు కారు. వీరిలో మంచివారు లేకపోలేదు. అయిననూ వీరి నిబద్ధతను బరీక్షింపదలచి విమానమున మొదటి తరగతి టిక్కెట్టు అడిగినాను. పైకమంపినారు. నేను సాధారణ తరగతి టికెట్టుననే బ్రయాణించి హ్యూష్టను బట్టణము జేరినాను. అచట విమానాశ్రయమునందు ఒకబీద అంతేవాసి తారసపడినాడు. వైద్య విద్యాభ్యాసము జేయుచున్నాడు. చేత రూకలు లేవు. లక్ష్మీ సరస్వతుల దోబూచులు మనమెరిగియే యుంటిమి. గాన,మిగిలిన రెండువేల డాలర్లు, కుఱ్ఱవాని చేతిలో పెట్టినాను. వేయి పడగల సహితముగా నిచ్చినాను. పిల్లవానిది బందరు. అట్లుండనిండు.

 

సంస్థ ప్రతినిధులు, సంఘ ప్రతినిధులు వచ్చినారు, సాష్టాంగపడినారు, సంబరమున నన్ను పడవకారున గూర్చుండబెట్టి వేడుకగా వేదికకు తోడ్కొనిబోయినారు. వారి సంస్కారమట్టిది. పుణ్య వంశంబుల బుట్టిన ఫలమనవలెను. స్వాగత వచనములతో, పిల్లల ప్రార్థనతో కార్యక్రమము మొదలయినది. వేదికపైనను, ఎదురుగనూ, లెక్కకు మిక్కిలిగా ఖర్వాటులే గాన్ పడినారు.  తత్కారణముననే నన్ను బిలిచినారో? అయిననూ సాపత్యమెక్కడున్నది. అల నన్నయకు, తిక్కనకూ, ఇల విశ్వనాథునకు గల ఖర్వాటత ఒక యలంకారము. పాండితీ ప్రతిభకు చిహ్నము. మిగిలినవన్నియూ గాకున్న, కొన్ని సారహీన సాలెగ్రామములే గాబోలును. చూడవచ్చినదెవరు?

 

పిమ్మట ఎవరినో వేదికనెక్కించినారు. వారియందొకనికి బుఱ్ఱమీసములున్నవి. ఆదిభట్ల నారాయణదాసు జ్ఞప్తికి వచ్చినాడు. కృష్ణశాస్త్రి మేనగోడలు వచ్చినది. జంట యవధానులు వచ్చినారు. తిరుపతి వేంకట కవులు మా గురువులు. తత్కారణమున ధన్యులు. మరి వీరి గురువులెవ్వరో. ఒకనికి మరియొకరు గురువని జెప్పగా వింటిని. తరచి జూడగా, ఏ జన్మంబున ఎవరు ఎవరికి గురువో గదా. అజ్ఞాన జీమూతంబులు ఛిద్రుపలైన వేళ, అతనే గురువు, అతనే అంతేవాసి, నిరంతర చైతన్య ప్రభా రాశి. అది తత్వము.  ఆశువుగ పద్యములల్లు నేర్పు గలవారని వినియుంటిని. ఆనందించితిని. మరికొంతమంది ఉపన్యాసకులు, అధ్యాపకులు వచ్చినారు. పిమ్మట తెలుగు నేర్పెడి గొంతమందికి సన్మానము జరిగినది. విధి ఎంత చిత్రమోగదా. మా చెళ్ళపిళ్ళ వారు సన్మానంబుల బ్రోత్సహింపలేదు. తాను జేసికొనలేదు, భవదీయునకు జేయుటకిష్టబడలేదు. అది విషయాంతరము. దేనికైనను బట్టు విడుపులుండవలెను.   ఇంకను గొంతమంది రచయిత్రులు వచ్చినారు. సభ పరిచయోపన్యాసము స్వపరిచయోపన్యాసముగా సాగినదన్న యపవాదు వినియున్నాను. నేను నిద్ర లేమివలన గొంత గునుకు చుండుట చేత యా వాక్యములు వినియుండలేదు. గాన నిర్ధారింపబూనను.

 

 

పిమ్మట ఉత్తమ కథలకూ, కవితలకూ పురస్కారములీయబడినవి. ఒకతను రెండు సార్లు పుచ్చుకొనినాడు. ఈతను నిర్వాహకుల బంధువై యుండవచ్చునని సందేహపడ్డమాట వాస్తవము. ఏమైననూ, అతను రాసినది చదివి నిర్ధారింపవలసి యున్నది. తదనంతరము పుస్తకావిష్కరణలు జరిగినవి.  పిమ్మట బుఱ్ఱ మీసాల వ్యక్తి మాట్లాడినాడు. సినిమా పాటల రచయితనని చెప్పుకొనినాడు. “ఏకవీర” నాటికి ఏ ఐదేండ్ల పిల్లవాడో అయి ఉండవలె. “గువ్వ గోరింకతో ఆడినది బొమ్మలాట” అనే గేయాన్ని రచించెనట. బొమ్మలాటలు ఆడునది శిశువులు గాని పశువులు గాదు, పక్షులు ఎంతమాత్రమూ గాదు. పక్షులు ఆడునది “కొమ్మలాట” గావలె. మరి ఈ గేయము ఎందులకు ప్రాచుర్యము పొందినదో తెలియదు. అది ఒక చిత్రము.

 

నా హాహాహూహూ యందు ఉటంకించిన లండను మహానగర పరిసరములనుండి ఒక భిషక్కు వచ్చినాడు. తినుబండారములపై కవితలల్లి అందరనూ నవ్వించినాడు. మరియొక వక్త హాస్య కవితలపై ప్రసంగము చేయుట గమనించినాను. మధ్యాహ్న భోజనానంతరము మరికొన్ని ప్రసంగములు జరిగినవి. స్వీయరచనలలో నవలల వంటి కవితలు, కవితల వంటి కథలు, మాటల వంటి రాతలు విని యున్నాను. తమ వంశ ప్రముఖులపై ఒక కవి కవితలల్లినాడు. వాడుకలోనున్న ఛందస్సులు వాడినాడు. మధ్యాక్కరలో రాసియున్న మరింత అందముగా వుండునని భావించితిని.

 

 

సభ రెండవనాటికి సహనము సగమైనది. సమయపాలన కరువైనది. గొందరు వక్తలు తీరు తెన్నులు లేని ప్రసంగములు చేయుచుంటిరని విరామ సమయమున వినియుంటిని. నా నిద్రలేమి, గునికిపాట్లే నాకు శ్రీరామ రక్ష అయినవి.  నాలుగు పొడవైన వాక్యముల మధ్య విరామ చిహ్నములు దొలగించిన, యది కవిత గాదు. స్వానుభవమ్మును స్వానుభవమ్ముగానే చెప్పిన అది డైరీ అగును, పరానుభవమును జూచి, ఉన్నది యున్నట్లు రాసిన అది, పత్రికా వార్తా వ్యాసంగ మగును. కథ గాదు. కథ రాయుట ఒక విలక్షణమైన ప్రక్రియ. దాని సుళువు బళువులు దానికున్నవి.

 

 

మధ్యాహ్నము గొంత చర్చ జరిగినది. వాగ్ధోరణులు, ఉచ్చారణలు, ఆశావహ దృక్పథములు, ప్రబోధ వ్యాసములు, ఒకటిగాదు, సకలాంశ సంహితయైనది.  మధ్య ప్రాచ్య దేశమునుండి వచ్చిన వనిత మా గురువుగారి రాయబార పద్యములు పాడినది. గౌరవ సూచకముగా లేచి నిలబడి వింటిని. ఆమె భర్త మనుచరిత్ర పై పరిచయవాక్యముల జెప్ప నుత్సాహించెనుగాని, సమయము లేదని ఆగినాడట. మంచి విషయములు వినుటకు ఎవ్వరకునూ సమయములేదు.

ఎట్టకేలకు సభలు ముగిసినవి. కార్యకర్తలందరూ నూతనోత్సాహముతో గానిపించినారు. గొన్ని సంస్థల అధిపతులు రానున్న గాలములో ఇటువంటి కార్యక్రమములను అందలమెక్కించెదమని ప్రతిజ్ఞ చేయుట ముదావహము.