వినాయక చవితి – నా అనుభవాలు

2396

శ్రీ రాములోరి గుడి దగ్గరొకటి, మా గొంది చివరొక ట్రాక్టర్ ట్రక్కులు ఆపి, దాని చుట్టూ చాలా మంది పెద్దోళ్ళు నుంచుని మాట్లాడుకుంటున్నారు. మాకేమో ఇంకా ఏమి తెలీదు, ట్రక్కు చుట్టూ పరదా కట్టేసారు దగ్గరికి కూడా రానీయట్లా. మీ కెందుకురా అటెళ్ళి ఆడుకోండి , పొండి – అని కసురుకుంటున్నారు …

విలువైన జ్ఞాపకాలు, ఆ నాటి స్నేహితులతో పెంచుకుని ఈనాటి స్నేహితులతో పంచుకుంటున్న స్వీయానుభవాలు

నాలాంటి పిల్లలు, పెద్దలు, ఊళ్ళోని వాళ్ళందరూ అక్కడక్కడ కలసి, అన్ని తోటలను, గుళ్ళను, చెట్లను కలుపుకుని, నదులను, కాలువలను, చెరువులను కలుపుకుని జరుపుకున్న పండుగలు

యథా రాజా తధా ప్రజా – అన్నట్లు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు నేర్చుకునే రోజులవి …. తెలిసిన వాళ్ళు చేస్తుంటే చిన్న పిల్లలం మేము కూడా నేర్చుకుని అనుకరించేవాళ్ళం

కథలోకి వస్తానిక –

మట్టి తెచ్చి బొమ్మ చేసి

పత్రి తెచ్చి అలంకరించి

పూజ చేసి ప్రాణం పోసి

ప్రతి రోజు ఊరేగించి

నదికెల్లి  నిమజ్జనం చేసి

నిండా తడిసి నాట్యం చేసి

చేసుకున్న వినాయక చవితి

 

1980, 1990 లలో జరుపుకున్న వినాయక చవితి పండుగను అందరితో పంచుకోవాలనే కోరికతో చేస్తున్న చిన్న ప్రయత్నం

vinayaka-chavithi-telugu-community-news-special (2)

మట్టి తెచ్చి బొమ్మ చేసి

 

చవితి పక్షం  రోజులుందనగానే ‘రాజెక్కెడి యేనుఁగు’ లాంటి ట్రాక్టర్ ట్రక్కులు కడిగి, శ్రీకారం, స్వస్తిక్ వేసి ‘మాంచి’ బంక మట్టి తెచ్చి (చెరువుల దగ్గర దొరుకుతుంది, ఇంకా కొన్ని నేలలు అచ్చంగా బంక మట్టి నేలలు వుంటాయి – ఇటుకల తయారికి కూడా వాడతారు), చుట్టూ పరదా కడతారు, స్వామిని చేసేప్పుడు అందరి కళ్ళు పడకుండా.

 

వివిధ వీధుల్లో వేరు వేరు రంగులు, అలంకారాలు, వేరు వేరు పరిమాణాలతో, కన్నుల విందుగా విగ్రహాలను తయారుచేస్తారు. చుట్టూ పరదా కట్టడం వలన ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నారో ‘బొమ్మలను’ అని ఊరంతా మాట్లాడుకునేవారు. సరిగ్గా ఇక్కడే పోటీ తత్వం మొదలయ్యేది – ఆ వీధి వాళ్ళు 5 అడుగుల బొమ్మ చేస్తున్నారంట అంటే ఈ వీధి వాళ్ళు 5.5 అనాల్సిందే, ఆ పోటీ మంచిగా, ఆరోగ్యంగా వుండేది. తర్వాతర్వాత వీధులు పోయి పార్టీలు వచ్చాయి, ఆ పార్టీ వాళ్ళు ఇంత ఈ పార్టీ వాళ్ళు ఇంత – కానీ ఎందుకో ఇంకా ఆరోగ్యంగానే జరిగేవి పోటీలు.

 

తిండితిప్పలు లేకుండా, రాత్రిపూట కూడా పనిచేసేవారు ‘బొమ్మల్ని’ చేసేప్పుడు. నిలువుగా, అడ్డంగా సర్వి కర్రలు కట్టి, పెన్సిల్ తో పేపర్ పైన గీసినట్లుగా బొమ్మను చేసేవారు. ఎక్కువ పనిముట్లు కూడా వాడేవాళ్ళు కాదు. ఈ రంగులు వెయ్యాలి అని దేవుడి బొమ్మల క్యాలెండర్ లు చూసి నచ్చినవి తెచ్చి వేసేవాళ్ళు. బొమ్మని ఎంత గట్టిగా చెయ్యాలంటే ఊరేగింపులో బొమ్మకు ఏమీ కాకూడదు. అదే మట్టితో ఎలుక వాహనం కూడా చేసేవారు. మిగిలిన మట్టితో చుట్టుపక్కనోళ్ళు ఇంట్లోకి చిన్న బొమ్మలు చేసుకునేవారు, కొందరు  మట్టి ప్రతిమల్ని కొనేవారు. మహా అయితే 2 రూపాయల నుండి 10 రూపాయల వరకు వుండేది ప్రతిమ పరిమాణాన్ని బట్టి.  వీటికి రంగులు తక్కువ, ఇంట్లో దొరికే ముగ్గు, పొలంలో పండించిన పసుపు, కుంకుమ తోనే అలంకారం చేసుకునేవాళ్ళం.

 

పత్రి తెచ్చి అలంకరించి

పండుగ మొత్తం లో పిల్లలందరూ ఉల్లాసంగా చేసేది దేవుడికి పత్రి కోసుకురావడం. దేవుడికి ఈ ఆకులంటే ఇష్టం – ఈ ఆకులు ఎక్కడ దొరుకుతాయి, ఈ పత్రి తప్పక వుండాలి – ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని గంటలకు నిద్ర లేచి ఎవరెవరు కలిసి వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళు ఎంత మందికి పత్రి తేవాలి (పక్కింటి వాళ్ళకి కూడా వేరే సంచుల్లో తెచ్చేవాళ్ళం) అని అంతా ఒక లెక్క ప్రకారం జరిగేవి – ఈ లెక్కలో సైకిల్ వున్నవాడు చెప్పాలి లేనివాడు వినాలి 🙂

 

పొద్దున్నే 4:30 గం 5:00 గం లేచి బయలుదేరి గుడికెళ్ళి మారేడు దళాలు, మారేడు కాయలు, జమ్మి ఆకులు, రావి ఆకులూ కోసి (ఇవన్నీ గుళ్ళోనే వుంటాయి, పొద్దున్నే వెళ్ళకపోతే తర్వాత దొరకవు), పొలానికి వెళ్లి చక్కటి అరటి పిలకలు, అరటి ఆకులూ, కండెలు (మొక్కజొన్న పొత్తులు), గరిక గడ్డి, ఉమ్మెత ఆకులు, రేగి కొమ్మలు, తులసి ఆకులు, ఉత్తరేణి ఆకులు (దీనితో చాలా జాగ్రత్తగా వుండాలి, చెట్టుకి పైన ఒక కాడ వచ్చి దాని నిండా ముల్లులు వుంటాయి. ఎప్పుడైనా దెబ్బ తగిలితే, ఈ ఆకులు నాలుగు కోసి, నలిపి, ఆ రసం గాయం పైన వేస్తే అది మటుమాయం), గన్నేరు పూలు, మరువం (ఎక్కువ కోయనివ్వరు, కొంచెమైనా మంచి వాసన వస్తుంది. నిద్ర పట్టని  వారు కొంచెం మరువం వాసన చూస్తే మనసు కుదుటపడి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువ), దానిమ్మ కాయలు, పూలు, జిల్లేడు ఆకులు, తమలపాకులు, తామర పువ్వులు, కలువ పువ్వులు, జిల్లేడు ఆకులు (జిల్లేడు పాలు పడితే కళ్ళు కనపడకుండా పోతాయి అనేవాళ్ళు, కళ్ళు మూసుకుని కోసేవాళ్ళం), ఇంకా అందంగా వుండే ఆకులన్నింటిని తెచ్చి , స్నానం చేసి పత్రి తో దేవుణ్ణి అలంకరించేవాళ్ళం.

 

ఈ పత్రితో ఎన్నో రోగాలు నయం చెయ్యొచ్చు. ఇప్పుడు కొన్ని మొక్కలు కనపడవు, కొన్ని మొక్కల పేర్లు తెలియవు, కొన్నింటిని పట్టించుకోము. పైన చెప్పిన పత్రిలో ఎన్ని మంచి గుణాలు వున్నాయో చెప్పే వాళ్ళు వినేవాళ్ళం. ఇప్పటి తరం వాళ్ళకి ఇవన్ని తెలియకపోతే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు చెప్పని మనది తప్పు.

 

పూజ చేసి ప్రాణం పోసి

 

పండుగ రానే వస్తుంది, ఎంతో భక్తితో పూజించి ప్రాణః ప్రతిష్ట చేసి ‘బొమ్మ’ ని ‘దేవుణ్ణి’ చేస్తారు. చుట్టూ పరదా తీసేసి, అందరికి గర్వంగా ‘మా దేవుణ్ణి’ చూపించి మురిసిపోతూ అందరి హావభావాలను చూసేవాళ్ళు బొమ్మని చేసినోళ్ళు ‘అందరు ఎలా చూస్తున్నారో’ అని. ఈ పాటికే వార్తలు  వీధులు దాటతాయి. ఇంటర్నెట్ లేదు, వాట్స్ ఆప్ లేదు, సెల్ ఫోన్ లు లేవు, సేల్ఫీ లు అసలే లేవు కనుక వార్తలు సైకిల్ లో ప్రయానించేవి. ఇక కళ్ళకు కట్టినట్లు చెప్పాలి దేవుళ్ళు ఎక్కడెక్కడ ఎలా వున్నారో, వింటూనే ఆనందం ఆ దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామో అని. ఆగలేని మాలాంటి పిల్లలు పరుగెత్తుకెళ్ళి చూసేవాళ్ళం.

 

పుస్తకాలన్నీ తెచ్చి పసుపు రాసి, బొట్టు పెట్టి దేవుడి ముందు వరుసగా చక్కగా సర్దుకునేవాళ్ళం. ఇంత కథ చెప్పి తినుబండారాలు లేకపోతే వినాయక చవితి ఎలా అవుతుంది. అన్ని రకాల పదార్ధాలు చేసి పెట్టేవాళ్ళు ఇంట్లో, తినటానికి అది లేదు ఇది లేదు అనకుండా ఉండేవి. కాలోరీస్ లెక్క తెలీదు ‘పంచదార చిలుకలు’ తినేవాళ్ళం, నేతి మిఠాయిలు తినేవాళ్ళం, పొలాల్లో పనిచేసి ఆరోగ్యంగా వుండేవాళ్ళం. ఎంత ఆనందం అంటే దాని గురించి మళ్లీ ఇంకో కథ రాయాలి.  నిజంగా చెప్పాలంటే నాకంటే నా స్నేహితులు బాగా కష్టపడి పని చేసేవారు పొలాల్లో.

 

అసలు, పత్రితో పూజ చేసిన ఇంట్లో రాత్రికి పడుకుంటే మంచి సువాసన వస్తుంది. నాకైతే మారేడు కాయలు, ఆకుల నుండి వచ్చే వాసన బాగా నచ్చుతుంది.

 

ప్రతి రోజు ఊరేగించి

 

ఇంట్లో పూజలు అయ్యాక దగ్గరలో వున్న ‘పెద్ద దేవుడి’ దగ్గరకు వెళ్ళే వాళ్ళం. మద్యాహ్నానికి పూజలు చేసుకుని ఊరేగింపు మొదలయ్యేది. ముందు మేళం, పెద్ద వాళ్ళు వెనుక దేవుడు బండి, దాని వెనుక చిన్న బండిలో ఒక జనరేటర్‌ (విద్యుజ్జనక యంత్రము; దేవుడికి అలంకరించిన రంగుల విద్యుత్ దీపాలకోసం), వెనుక పెద్దవాళ్ళు వస్తారు. దేవుడి ఊరేగింపుకి ముందు, వెనుక పెద్దోళ్ళు నడవాలి.

 

దేవుడు వస్తుంటే ఆ ఆ ఇళ్ళల్లో వాళ్ళు బయటకు వచ్చి బిందెలతో రోడ్లు కడిగి, దేవునికి హారతి ఇచ్చి, పండ్లు, పూలు ఇచ్చి దణ్ణం పెట్టుకునేవాళ్ళం. దేవుడి బండి వచ్చి ఆగితే ఇంట్లో కాళ్ళు పైకెత్తి కూచ్చుని రిమోట్ తో ఛానల్ మార్చటానికి ఇప్పుడున్న కేబుల్ టీవీలు అప్పుడు లేవు. ఒక బండి తర్వాత ఒక బండి వచ్చేవి, అన్ని దేవుళ్ళకి మళ్లీ హారతులు, పూలు, పండ్లు, పూజలు, దండాలు. చివరికి ఈ దేవుడి అలంకారం అలా వుంది, ఈ దేవుడి రంగులు ఇలా వున్నాయి అని మాట్లాడుకునేవాళ్ళు. బండి బండి కి కొంత తేడాతో అన్ని దేవుళ్ళకు ఊరేగింపులు జరిగేవి.

 

ఊరేగింపులో చెప్పుకోవలసింది ‘డాన్సు బండులు’ – ఇందాక చెప్పినట్లు కేబుల్ టీవీలు, ఇంటర్నెట్లు లేవు. ఊళ్ళో పని చేసుకునేవారికి సినిమా హాల్స్ కి వెళ్ళే తీరిక దొరకదు. దొరికినా ఖర్చుకు సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ సంవత్సరానికి ఒక సారి ఊళ్ళో డాన్సులు – అంతే కానీ పండుగ ఏంటి ఈ డాన్సులు ఏంటి అని అవహేళన చేయొద్దు. అప్పటి పరిస్థుతులకు అది బాగానే వుంది. తర్వాతర్వాత డాన్సులు హద్దులు మీరడంతో డాన్సులు ఆపేసారు.

 

నదికెల్లి  నిమజ్జనం చేసి

 

ఇలా 3 రోజులు, వారం రోజులు లేదా 9 రోజులు పూజ చేశాక దగ్గరలో ఉన్న నదికి (మాకు కృష్ణానది  చాలా దగ్గర), కాలువలో నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్ళేవి ఊళ్ళోని విగ్రహాలన్నీ. పిల్లల్ని అంతగా రానిచ్చే వాళ్ళు కాదు, వస్తే నీటి దగ్గర వాళ్ళకేమన్నా ఆపద వస్తుందేమో అని. అందుకని పిల్లలందరూ కలసి చందాలు వేసి చిన్న బొమ్మల్ని బేరింగు బండ్లపై పెట్టి చిన్న కాలువల దగ్గరకి వెళ్ళే వాళ్ళం. దేవుడితో పాటు అందరు వెళ్లి నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళం.

 

ఇళ్ళల్లో చేసుకుని పూజించిన బొమ్మల్ని కొంతమంది ఆఖరి రోజు ఊరేగింపులో పెద్ద దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు నిమజ్జనానికి; కొంతమంది పొలాల్లోని బావుల్లో కలిపేవారు పూజించిన పత్రితో సహా. దీనివల్ల బావి నీరు కలుషితం కాకుండా, పంటలు బాగా పండుతాయని, అందరు ఆరోగ్యంగా వుండాలని.

 

చిన్ని చిన్ని చేతులతో చేసుకున్న బుజ్జి బుజ్జి వినాయకుణ్ణి నిమజ్జనం చెయ్యటానికి మనసు వచ్చేది కాదు. ఏదీ శాశ్వతం కాదు అనే తత్వం మాకు అప్పుడే అలవాటు అయ్యిందేమో? ఏమో?

vinayaka-chavithi-telugu-community-news-special (1)

నిండా తడిసి నాట్యం చేసి

 

నదికెల్లి నిమజ్జనం చేసి, చక్కగా నదీ స్నానం చేసి, ట్రాక్టర్ ట్రక్కులను కడిగి అలసిపోయి ఇంటికొచ్చేవాళ్ళం. నేను ఒకటి రెండు సార్లు మాత్రమే వెళ్ళాను నిమజ్జనానికి, అంటే ఒకటి రెండు సార్లే రానిచ్చారు. నిమజ్జనం అయ్యాక అంతా ఎలా జరిగింది అని మాట్లాడుకునేవారు. కొంతమంది ఇలా కాదు ఈసారి మనం ఇంకా బాగా చెయ్యాలి అని పోటీలు మొదలయ్యేవి. అసలు పండుగ కోసమే కొత్త ట్రక్కులు కొనేవారు తెలుసా?

 

చేసుకున్న వినాయక చవితి

ఇంత హడావిడితో, ఆనందంగా, ఉల్లాసంగా, కలసి మెలసి పండుగ చేసుకునేవాళ్ళం. పసుపు రాసుకున్న పుస్తకాలతో, వండిన వంటకాలతో బడికెళ్ళి అక్కడ ఎవరెవరు ఎలా పత్రి తెచ్చామో, ఎలా ప్రతిమల్ని అలంకరించామో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. ఫొటోస్ లేవు, లైకులు లేవు, ట్విట్టర్లు లేవు కనుక ఎవడెవడికి ఎంత గుర్తుందో, ఎవడెవడు ఎంత బాగా చెప్పగలడో చెప్పేవాళ్ళు.

 

“తెలుగు కమ్యూనిటీ న్యూస్ ” పాఠకులకు, స్నేహితులకు ఒక చిన్న విన్నపం

 

దయచేసి మట్టితో విగ్రహాల్ని చేద్దాం – పర్యావరణాన్ని కాపాడదాం

ప్లాస్టర్ అఫ్ పారిస్ బొమ్మలు కొనకండి – మట్టి లేక పోతే పసుపుతో చెయ్యొచ్చు

 

దేవుడు వస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టండి

వెనుకకు తిరికి సేల్ఫీ లు తీయకండి, పిల్లలకి కూడా చెప్పండి

 

అందుబాటులో ఉన్న పత్రితో పూజించి ఆరోగ్యాన్ని పంచండి

తులసి, మరువం, గరిక, ఉత్తరేణి, నేరేడు లాంటివి

 

మీ మీ అనుభవాలను కామెంట్స్ తో పంచుకుంటారని

మీకు మీ కుటుంబాలకు వినాయక చవితి శుభాకాంక్షలు

 

… మీ ఓం ప్రకాష్