UK (యునైటెడ్ కింగ్డమ్) లో ఘనంగా జరిగిన ‘తారా’ ఉగాది ఉత్సవాల్లో ‘పద్మశ్రీ’ చింతకింది మల్లేశం గారికి సన్మానం

2568

ఏప్రిల్ 1, 2017 తారా (Telugu Association of Reading and Around U.K.) ప్రస్థానంలో ఒక మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తూ చరిత్రలో నిలిచిపోయే రోజు.  శ్రీ హేవిళంబి యుగాది 2017 ఉత్సవాలు తారా ఆధ్వర్యంలో రెడింగ్ తెలుగువాసులు ఘనంగా జరుపుకున్నారు.  సుమారు 600 మంది ఈ ఉత్సవాలకు హాజరై “ఏ దేశమేగినా ఎందు కాలిడినా” అన్న రాయప్రోలు మాటలను నిజం చేసారు.

ఈ ఉగాది ఉత్సవాలలో ‘తారా’ ఆహ్వానాన్ని మన్నించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, “లక్ష్మి ఆసు”  యంత్ర నిర్మాత శ్రీ చింతకింది మల్లేశం గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు.  శ్రీ మల్లేశంగారిని  భారతదేశానికి వెలుపల జరిగిన పెద్ద కార్యక్రమంలో మొట్ట మొదట సత్కరించిన ఘనత తారా యు.కె. కు దక్కింది.

తారా అధ్యక్షులు శ్రీ సూర్యప్రకాష్ భళ్ళమూడి మల్లేశంగారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ వేదికపైకి తీసుకొని వచ్చారు.  తారా కార్యదర్శి శ్రీ సంతోష్ బచ్చు మల్లేశంగారిని రెడింగ్ తెలుగువారికి పరిచయం చేస్తూ, వారు పడ్డ శ్రమను,నిస్వార్ధంగా వారు చేస్తున్న పనిని కొనియాడారు. ‘తారా’ కోశాధికారి శ్రీ రవికాంత్ వాకాడ మాట్లాడుతూ శ్రీ మల్లేశంగారు “రోల్ మోడల్” అని, కృషి వుంటె మనుషులు ఋషులవుతారు అన్న మాటకి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రశంసించారు.
Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (1) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (2) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (3) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (4) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (5) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (6) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (7) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (8)
శ్రీ మల్లేశంగారికి తర్వాత సన్మాన కార్యక్రమం జరిగింది. ‘తారా’ స్థాపక అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి మాటూరు, మహిళా కార్యదర్శి శ్రీమతి మధురిమ రంగా పుష్పగుఛ్చం అందజేసారు.  సూర్యప్రకాష్, సంతోష్ శాలువాతో సత్కరించారు.  రవికాంత్, బాలా కాకర్ల తారా మొమెంటొను అందజేసారు.  ఈ సందర్భంగా తారా తొలిసారిగా ప్రచురించిన తెలుగు కేలండరును తారా ట్రస్టీలు నవీన్ గుర్రం, గోపికిషన్ నేరెళ్లకుంట, రాంబాబు బూరుగు శ్రీ మల్లేశంగారిచే ఆవిష్కరింపజేసారు. తారా తెలుగు పత్రిక “తోరణం” మొదటి సంచికను ‘తారా’ ట్రస్టీలు వెంకట్ పారాగారు  మల్లేశంగారికి అందజేసారు.
తరువాత శ్రీ మల్లేశంగారు మాట్లాడుతూ ‘తారా’ యు.కె. తెలుగు ప్రజలకి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, తమ అనుభవాలని సోదాహరణంగా ఫొటోలు, వీడియోల సహాయంతో వివరించారు.  “లక్ష్మి ఆశు” నిర్మాణంలో వారు పడ్డ కష్టాలను, వారి తల్లిగారి కష్టం యే విధంగా పురికొల్పింది, చేనేత కార్మికులకు ఈ యంత్రం యే విధంగా ఉపయోగ పడుతున్నది తెలిపారు.  శ్రీ మల్లేశంగారు తల్లిగారి కష్టాన్ని చెప్తున్నప్పుడు హాజరైన అందరూ చలించిపోయారు. లక్ష్మి ఆసు యంత్ర నిర్మాణం యే విధంగా ఆ కష్టాన్ని దూరం చేసినది తెలియగానే కరతాళ ధ్వనులతో సభ మార్మోగిప్రోయింది.  ఉపన్యాసం ముగిసినప్పుడు అందరూ లేచి నిలబడి శ్రీ మల్లేశంగారికి తమ హర్షోల్లాసాలను వ్యక్తపరిచారు.  కార్యక్రమానికి హాజరైన తెలంగాణా ప్రవాస సంఘం (TenF ) యు.కె. అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు తారా చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సంఘం చేనేత కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.  శ్రీ మల్లేశంగారు భావి తరాలకు మార్గదర్శకం అని అన్నారు.
హాజరైన అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కార్యక్రమం “స్వరలహరి”.  నేపధ్య గానంతో పాటు, సంగీత దర్శకత్వం, అనేక టివీ పాటల కార్యక్రమాలలో యాంకరుగా, మెంటరుగా అలరిస్తున్న బహుముఖ ప్రతిభావంతుడు హేమచంద్ర వేదుల, బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు పాటతో తనదైన ముద్ర వేసిన దామిని భట్ల తమ గానంతో, మాటల పాటలతో ఉఱ్ఱూతలూగించారు.   సభ్యుల ఈలలతో, డేన్సులతో సభ మార్మోగింది.
తారా సభ్యులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు విచ్చేసిన అందరినీ విశేషంగా అలరించాయి.  చిన్న పిల్లలు చేసిన నాటకాలు, నృత్యాలు, పాటలు, పెద్దలు ప్రదర్శించిన వెరైటీ డేన్సులు, నాటకాలకి చప్పట్లతో సభికులు తమ హర్షాన్ని తెలియజేసారు.
చివరిగా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి తోడ్పడిన వలంటీర్ల సేవలను సంతోష్, రవికాంత్ పేరు పేరున స్మరించి వారికి తారా తరపున ధన్యవాదాలు తెలియజేసారు.  తెలుగువారికి సేవ చెయ్యడంలో తారా ఎప్పుడూ ముందు వుంటుందని, సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయం, సమాజం తారా ప్రధాన లక్ష్యాలని అందుకు మునుముందు మరిన్ని కార్యక్రమాలతో వస్తామని చెప్పి వందన సమర్పణ చేసారు.