తెలంగాణా పల్లెల్లో జీరాడు పట్టు కుచ్చిళ్లతొ తిరుగాడే ఆడపడుచు బతుకుమ్మ

2068

మనం దేవుడిని పూలతో పూజిస్తాం. మరి ఆ పూలనే దెవుడిగా పూజిస్తే? అందమైన రంగు రంగుల పూలని ఏరీ కోరి తెచ్చి పళ్ళెంలో ఒక రాశిగా పేర్చి ఆ పై భాగంలో అమ్మవారిని ప్రతిష్టించి పసుపు కుంకాలతో ఆర్చించి అలరించే అపూర్వమైన ఉత్సవ విశేషం తెలంగాణా బతుకుమ్మ పండగ.
ముగ్ధ మనోహరం గా అలంకరించుకున్న స్త్రీలంతా తమ ఇళ్ళూ వాకిళ్ళూ అలికి ముగ్గులు తీర్చి దిద్డి అందులో బతుకమ్మని ప్రతిష్టించి లయబద్ధంగా “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో “అని పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఆట పాటల తరువాత బతుకమ్మలని తీసుకుని నది వొడ్డున అంతా తాము తెచ్చిన ప్రసాదాలు పంచుకుని అక్కడి జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.


ప్రకృతిని ప్రజలతో మమేకం చేసిన అమ్మ తల్లి మన బతుకమ్మ. బతుకమ్మ అంటే మన బతుకుకే ఒక అమ్మ, బ్రతుకుని కాపాడే అమ్మ. సమస్త ప్రాణి కోటికి జీవనాధారం. తెలంగాణా ప్రజలకి ఇలవేల్పుగా, ప్రకృతి స్వరూపిణీ గా విలసిల్లుతోంది. అసలు ఈ బతుకమ్మ తల్లి కోసం సాక్షాత్తూ సూర్య భగవానుడు ఎర్ర మందారం గా, దేవతలు అంతా తలొక పువ్వు అయ్యీ ఆమెని పూజించారు అంటే అతిశయోక్తి కాదేమో.  బతుకమ్మ రైతు నుండి రాజు వరకు, పండితుడి నుండి పామరుడి కి తెలిసిన దేవత. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు దసరా నవరాత్రులలో చేసే అద్భుత పండగ.


వ్యవసాయ ప్రధానమైన మన దేశం లో బతుకమ్మని పూజించటం కోసం సుగంధ పుష్పాలతో పాటు రైతులు తమ ఇళ్లల్లో సొర, బీర, కాకర, దోస, గుమ్మడి పాదులు పెంచుతారు, దానితో వారికి ఆహారం సమకూరుతుంది. కలువలు, తామరలు చెరువుల్లో పెంచటం వల్ల వాటి పరిరక్షణ కలుగుతుంది. వ్యవసాయానికి కూడా ఉపయోగం. అలాగే పిల్లలు పెద్దలు పూలు ఏరీ కోరీ తేవటం వల్ల చెట్ల గురించిన విజ్ఞానం కలుగుతుంది.

ప్రముఖ తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ఏకం గా ” బతుకమ్మ శతకం” రచించి తెలంగాణా పల్లెల్లో జీరాడు పట్టు కుచ్చిళ్లతొ తిరుగాడే ఆడపడుచుని ఒక సాంస్కృతిక కధానాయికగా ఆవిష్కరించారు. ఆయన రచించిన శతకం లో ఒక పద్య కుసుమం.
Praising you honestly- thousands of good flowers, their worship is reasonless blossomness, how generous? please give them all batukamma

వేల రకాల పూలు ఉన్నత భక్తి తో నిన్ను కీర్తిస్తున్నాయి, వాటి భక్తి కి కారణం , కోరికా లేదు వాటికి సౌందర్యం ఇచ్చావు అని కృతజ్ఞతగా నీకు సర్వ సమర్పణ చేసుకుంటున్నాయి ఆ పూలని దగ్గర చేర్చుకుని అనుగ్రహించు తల్లి అంటూ అద్భుతం గా రాశారు.

ప్రకృతి ని పరిరక్షించండి, ప్రేమించండి అన్న అద్భుత సందేశం ఉన్న బతుకమ్మ పండగ తెలంగాణా రాష్ట్రానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆదర్శ ప్రాయమే.

మన అందరి తెలుగు మిత్రులందరికీ శరన్నవరాత్రి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

– సువర్ష , లాస్ ఏంజెల్స్