తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడిఫ్) ఆధ్వర్యములో డల్లాస్ లో వైభవంగా జరిగిన బతుకమ్మ మరియు దసరా సంబరాలు

1184

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ సౌజన్యంతో శనివారం  అక్టోబర్  1 ,2016 న  బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఆలయ ప్రాంగణములో  పాశ్చాత్య నాగరికతకు మారుపేరైన అమెరికాలో అంబరాన్ని అంటేలా జరిగాయి.

ఎప్పుడూ లేనంతగా కనీ వినీ ఎరగని రీతిలో ప్రవాస తెలంగాణ  ప్రజలంతా కలిసివచ్చి , తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయినా బతుకమ్మ మరియు దసరా పండగను ఎంతో వైభవంగా జరుపుకోవడం ఒక గొప్పవిశేషం. ఈ కార్యక్రమములో ముందుగా డాలస్ చిన్నారులందరూ దేవతల, జానపద, చారిత్రాత్మక దుస్తులు ధరించి “దసరా వేషాల” పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొని అందరిని మురిపించారు .  ఈ కార్యక్రమానికి యుగంధర్ మరిన్ గంటి స్వామి మరియు మంజురెడ్డి ముప్పిడి న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించారు.  తరువాత స్త్రీ లందరూ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాల నృత్యాలతో, ఢోల్ భాజాలతో చప్పట్లు కలుపుతూ వేడుకలకి కొత్త అందాలను తెచ్చారు. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఏమేమి పువ్వొప్పునే అనే పాటలు వేల గొంతులు ఏకమై పాడుతూ గొప్ప ఊరేగింపుతో బతుకమ్మల  నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపారు. టీడీఫ్ సంస్థ వనితలందరికీ  పసుపు,కుంకుమ గాజులు బ్యాగులలో పెట్టి కానుకలుగా యిచ్చారు.

tdf-bathukamma-kolatam tdf-bathukamma-kolatam2 tdf-bathukamma-nimajjanam2 tdf-bathukamma1 tdf-bhatukamma3 tdf-dasara-veshalu1 tdf-gouramma-puja-1

సాయి నృత్య అకాడమీ నుండి  శ్రీదేవి ఎడ్లపాటి గారి శిష్యులు జమ్మి పూజ ప్రారంభించే ముందు ‘హైగిరి నందిని’ అనే  పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు. పురుషులందరూ జమ్మి ఉత్సవంలో పాల్గొని , జమ్మి ఆకులూ పంచుకుంటూ డల్లాస్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహ మాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారు. అయిదు వేల మందితో ఆలయ ప్రాంగణమంతా పండగ సంబరాలతో కిక్కిరిసి పోయింది. ‘బీచ్ బీట్స్’  అనే అకాడమీ నుండి ఆదిత్య గంగసాని మరియు అతని బృందం డోల్ వాయిద్యాలతో పండగకి మరింత వన్నె తెచ్చి,  తెలంగాణ పల్లెల ఆట పాటలతో డల్లాస్ నగర వాసులంతా ఆనందించేలా చేసారు.  పులిహోర, దద్ధోజనం, రవ్వకేసరి, సత్తుపిండి ప్రసాదాలతో చక్కటి విందుని టీడీఫ్ ఫుడ్ కమిటీ వారు హాజరైన వారికి వడ్డించారు.