యునైటెడ్ కింగ్డం (UK)లో ‘తారా’ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దీపావళి వేడుకలు!

1526

నవంబర్ 16వ తేది 2014 ‘తారా’ (తెలుగు అసోసియేషన్ అఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) వారి జాబితాల్లో ఒక అద్భుతమైన, గర్వకారణమైన మైలు రాయిలా నిలిచిపోతుంది. వివిధ కళల్లో ప్రపంచ ఖ్యాతి పొందిన సంగీత, నాట్య, గాన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చివరి వరకు ప్రేక్షకులని మంత్ర ముగ్ధ్లుల్ని చేసారు. విచ్చేసిన పాత్రికేయులకి ఒకే వేదికపై దక్షిణ భారతంలో గల కన్నడ, మళయాళ, తమిళ, తెలుగు కు సంబంధించిన కళల ప్రదర్శనలు ఒక విన్నూత్నఆకర్షణగా నిలచింది. వేదికను ఎంతో శోభాయమానంగ దీపాలతో, పూలతో అలంకరించారు.

 

మొదట ‘తారా’ కమిటీ మెంబర్, వెంకట్ పారా గారు వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించారు. ఆపై దీపా ష్యామ్ గారు కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మొదలుపెట్టారు.

 

పిల్లలు ఆలపించిన కీర్తనలు, భక్తి పాటలు, ప్రదర్శించిన అష్టలక్ష్మి, మహిషాసుర మర్దిని నృత్యాలు చూపరులని ఆకట్టుకున్నాయి. మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని రాబోయే తరాలకు నేర్పిస్తున్నందుకు అటు గురువులను, ప్రోత్సహిస్తున్న ఇటు తల్లితండ్రులను అందరూ కొనియాడారు. తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందచేసారు.

TARA Diwali Celebrations - Fusion-Mixed Musical & Classical Dance Concert (1) TARA Diwali Celebrations - Fusion-Mixed Musical & Classical Dance Concert (8) TARA Diwali Celebrations - Fusion-Mixed Musical & Classical Dance Concert (11) TARA Diwali Celebrations - Fusion-Mixed Musical & Classical Dance Concert (17)

జాతీయ ‘బాల శ్రీ’ అవార్డుతో పాటు, ‘బాల రత్న’, ‘నాట్య మయూరి’, ‘నృత్య శోభిత’ లాంటి  ఎన్నో అవార్డ్లను అందుకున్న, వివిధ దేశాల్లో 1200కి పైగా ప్రదర్శనలు ఇచ్చి , తన 16వ ఏటనే ‘ది ఫాసెట్ట్స్అఫ్ ఇండియన్ డాన్స్’ అనే పుస్తకాన్ని రచించిన కుమారి సంతోష్ జి నాయర్, మరియు భరతనాట్యంలో నిష్ణాతులైన సత్య వాణి నుతి, అనన్య చట్టర్జీ, శ్యామా శశిదరన్  ప్రేక్షకులని రంజింపజేయగా, రంజిత చోవల్లూర్ మొహినిఅట్టం నృత్యంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

 

కుమారి.సంతోష్ జి నాయర్ గారు డా.జ్యోత్స్న శ్రీకాంత్ గారి గురించి, వారి వయోలిన్ విద్య నుంచి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక చోటును ఏర్పరుచుకున్న ఆవిడ సంగీత జీవిత ప్రయాణాన్ని  క్లుప్తంగా తెలియచేసారు. తరువాత ఈ కార్యక్రమానికి ముఖ్య ఘట్టం డా.జ్యోత్స్న శ్రీకాంత్ వయోలిన్, మంజునాథ్ డ్రమ్స్ మరియు సోలమన్ కీబోర్డ్ తో వేదికను హోరెత్తించారు. జ్యోత్స్నగారి వయోలిన్ వాయిద్యానికి ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలు, డాన్సులు వేస్తూ ఆనందించారు. ఉషారైన పాటల్ని, పాత పాటల్ని, ఇటాలియన్ ఫోక్ పాటల్ని మరియు ఎన్నో సినిమా పాటల్ని ఆవిడ ఎంతో అలవోకగా వాయించి ప్రేక్షకులని మంత్ర ముగ్ధ్లుల్ని చేసారు. సంగీత సాగరంలో ప్రేక్షకులంతా మునిగి తేలారు, సంగీతంలో ఉన్న తీయదనాన్ని ఆస్వాదించారు. ‘హాట్స్-ఆఫ్’ అంటూ ఆవిడ్ని అందరూ అభినందించారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల నుంచి మంచి పాటల్ని సాహిత్య హరి మరియు శ్రీ కృష్ణన్ ఆలపించారు.

 

తమ కళని, విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికోసం కేటాయించిన కళాకారులను ‘తారా’ తరఫున ప్రెసిడెంట్ లక్ష్మిమాటురు మరియు సెక్రటరీ రవికాంత్ వాకాడ పుష్పగుచ్చాలతో, ప్రశంసా పత్రాలతో గౌరవించారు. అలాగే, తమ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న సంగీత గురువులను (అరవిందా రాజీవ్, శ్రీ విద్య, అనన్య చట్టర్జీ మరియు జ్యోత్స్నా ప్రకాష్ గార్లకు) కూడా పుష్పగుచ్చాలతో, ప్రశంసా పత్రాలతో గౌరవించారు.

 

మన సంస్కృతిని, తెలుగు భాషను కాపాడుకునే విధంగా పిల్లలకు ‘మన మాట’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, దీని ద్వారా 20మంది చిన్నారులు తెలుగుని నేర్చుకుంటున్నారని, వారికి తెలుగు మీద ఆసక్తి పెరగడాన్ని చూసామని ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్న సూర్య ప్రకాష్ భల్లముడి, రవికాంత్ వివరించారు. పిల్లల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఇంతక ముందు మన దేశంలో వున్న అమ్మమ్మ, నానమ్మ, తాతలతో మాట్లాడాలంటే తాము పిల్లలకు మధ్యవర్తిగా వుంటూ తెలుగులో చెప్పినదాన్ని ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ ‘మన మాట’ కోర్స్ పుణ్యమా అని తాము లేకుండానే చక్కగా ఇండియా వాళ్ళతో పిల్లలు మాట్లడగలుగుతున్నారని, ఈ కోర్సుని నిర్వహిస్తున్న ‘తారా’ కి ధన్యవాదాలు తెలిపారు – ‘ది బెస్ట్’ అని కితాబునిచ్చారు.

 

చివరగా ‘తారా’ ట్రెజరీ నవీన్ గుర్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్స్ కి, సభ్యుల కి, ముఖ్యంగా స్పాన్సర్స్ కి కృతజ్ఞతలు తెలిపుతూ కార్యక్రమాన్ని ముగించారు.
మరిన్ని వివరాలకు, విచ్చేయండి www.tarauk.org, లేదా  https://www.facebook.com/telugu.sanghamu.reading లేదా రాయండి  [email protected] ఇమెయిల్ కి.