టాంటెక్స్ 99వ ‘నెలనెలా తెలుగు వెన్నెల’లో రసవత్తరంగా సాగిన కృష్ణశాస్త్రి లాలిత్యం

1204

అక్టోబర్ 18, 2015, డాలస్,టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 99 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

చిన్నారి ఉపాధ్యాయుల స్మృతి రమ్యంగా ఆలపించిన ‘దేవ దేవం భజే’ భక్తి గీతం తో సభ ప్రారంభమయింది. పోతన భాగవతం రెండవ స్కంధం నుండి శుకుడు పరీక్షితునకు బోధించిన ముక్తి మార్గము మరియు ప్రకృతి అంశంబున ఏర్పడిన విరాడ్రూపముల గురించి వివరించే పద్యాలను దొడ్ల రమణ భావయుక్తంగా పాడి, అర్ధాలను కూడా సందర్భోచితంగా వివరించారు. శ్రీమతి బల్లూరి ఉమాదేవి స్వీయ కవిత ఆహూతుల మన్ననలు పొందింది. డా. వాసుదేవ సింగ్ రచించిన ‘కంగుంది కుప్పం వీధి నాటకాలు – శాస్త్రీయ పరిశీలనం’ పుస్తకాన్ని డా. కలవగుంట సుధ సభకు పరిచయం చేసి, పంజాబి అయినప్పటికి తెలుగు లో రచన చేయడం రచయిత కు తెలుగు భాష ఫై పట్టుకు నిదర్శనం అని కొనియాడారు. శ్రీమతి అట్లూరి స్వర్ణ “సరదాగా కాసేపు” క్విజ్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగి, ఆహూతులకు భాష, సాహిత్యం ఫై ఉన్న మక్కువను తెలియచేసింది.

TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (1) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (2) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (3) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (4) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (10) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (11)

ముఖ్య అతిధి శ్రీమతి స్వాతి శ్రీపాద గారు చిన్నతనంలోనే సాహిత్యాభిరుచి అలవరచుకొని, పువ్వు పుట్టగానే పరిమళించు అనే నానుడిని నిజం చేస్తూ తొమ్మిది సంవత్సరాలకే కథ, కవిత, పాట రచన చేసి, ప్రతి క్షణాన్నీ సాహితీ సేవకే అంకితం చేయాలనే దృఢ సంకల్పంతో తెలుగు సాహిత్య అకాడమీ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆకాశవాణి, వివిధ పత్రికలకు రచనలు అందిస్తూనే కేంద్రీయ విద్యాలయం స్నాతకోత్తర విభాగంలో ఆంగ్ల అధ్యాపకురాలిగా అత్యున్నతమైన సేవలందించారు. నలభై ఐదు సంవత్సరాలుగా “ఇందూరు భారతి” సభ్యురాలిగా, సంయుక్త కార్యదర్శిగా సేవలందించడంతో పాటు, ఆ సంస్థ ప్రార్ధనా గీతాన్ని రచించారు. తెలుగు-ఆంగ్లం మరియు ఆంగ్లం-తెలుగు అనువాదం ద్వారా ఉత్తమమైన రచనలను పాఠకులకు చేరువచేసి, సాహితీ సంపదను భాసిల్లజేసి, తెలుగు విశ్వవిద్యాలయం “ఉత్తమ మహిళా రచయిత్రి” కీర్తి పురస్కారము పొందారు. స్వాతి శ్రీపాద గారు ప్రధాన ప్రసంగం చేస్తూ, కృష్ణశాస్త్రి పంచ భూతాలను ఆయన ప్రాణం గా వ్రాసుకున్నారని, గాలి, నీరు, నిప్పు గురించి వర్ణిచే తీరులో తనదైన శైలిని చూపించారని వివరించారు. సోదహరణగా, గాలి వీచింది అని కాకుండా చల్లగాలి ఊయలూగినట్లు, నీటిని కన్నీరుగానూ, కొలను నీరు ఉలికి పడుతుంది అని, నిప్పు ని కసిరే ఎండగా వర్ణించి, ఆయన సొంత బాణీని అందరి మనసులో ఎల్లకాలం నిలిచేలా చెరగని ముద్రవేసిన తీరును ఆసక్తికరంగా చెప్పారు. కృష్ణశాస్త్రి వాడిన సరళమైన భాష వల్ల, ఒకే హల్లుని మరల మరల వాక్యంలో వాడటం వల్ల, ఆయన కవిత్వంలో లాలిత్యం, లయ మరింతగా ఒదిగిపోయినట్లు అనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదని, ఒక్క “ర” కారం తప్ప సమ్యుక్తాక్షరాలు లేకుండా ద్విత్త్వాక్షరాలతో సరళమైన పదాలతో రచన ఆయనకు భాష పై ఉన్న పట్టుని తెలియజేస్తుందన్నారు. ఆంగ్ల తెలుగు భాషలపై అంత పట్టు ఉంది గనుకనే షెల్లీ, కీట్స్ వంటి కవుల ప్రభావం ఆయనపై ఎంతో ఉన్నప్పటికీ, ఏ ఒక్క రచన కూడా, వారి భావానికి అనువాదం అని చెప్పలేము, కానీ కవిత్వం లో ఆయన పాటించిన మర్యాద, వినయం ఆంగ్ల సాహిత్య ప్రభావమే అని విశదీకరించారు. ఉదాహరణకి, ఆకులో ఆకునై పాటలో నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉంది అని కోరికలా కాకుండా, ఒక విన్నపం లేదా అభ్యర్థన లా “ఎటులైనా ఇచటనే ఆగిపోనా” అనడం లో కనిపిస్తుందని, కృష్ణశాస్త్రి మంచి బాష కవి మాత్రమే కాదు, ఒక సంఘసంస్కర్త కూడా అని తెలియచేసారు.
కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు శ్రీ శ్రీ “భారతదేశపు నిలువుటద్దం బ్రద్దలయ్యింది. వసంతం మళ్ళీ వాడిపోయింది” అని భావోద్వేగాన్ని వ్యక్తీకరించారని గుర్తు చేసారు.

 

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ దీపావళి వేడుకలు నవంబరు 14న ఇర్వింగ్ హై స్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు”100వ నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 21న ఘనంగా జరుపడానికి ప్రణాళిక సిద్ధమయిందని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు. విచ్చేసిన సాహితీ ప్రియులు డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, వేముల లెనిన్ బాబు కృష్ణశాస్త్రి రచించిన “జయ జయహే”, “ఆకులో ఆకునై” మున్నగు గీతాలను శ్రావ్యంగా ఆలపించి అందరి మన్ననలు పొందారు. సాహిత్యవేదిక ప్రారంభానికి ముందు, ఆట్లాంటా నుండి విచ్చేసిన సాహితీవేత్త, రచయిత, కవి, దర్శకుడు డొక్కా ఫణి నిర్మించి, దర్శకత్వం వహించిన “పల్లకి” అను లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మరుగైపోతున్న పల్లకి వంటి సాంప్రదాయల్ని కళ్ళు చెమర్చేలా చూపించారు అని ప్రేక్షకులు కొనియాడారు.

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, పాలకమండలి ఉపాధిపతి చాగర్లమూడి సుగన్, పాలకమండలి సభ్యులు రొడ్డ రామకృష్ణా రెడ్డి, పుట్లూరు రమణారెడ్డి, సమన్వయకర్త దండ వెంకట్, సాహిత్య వేదిక సభ్యులు ముఖ్య అతిథి శ్రీమతి స్వాతి శ్రీపాద గారిని శాలువా మరియు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. దండ వెంకట్ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ,6టీవీలకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.