టాంటెక్స్ 90వ నెల నెలా తెలుగు వెన్నెలలో సౌగంధ కుసుమాలు పంచిన కృష్ణదేవరాయల పద్యం

1594

జనవరి 18, 2015, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్ :
సాహిత్య సేవలో భాగంగా టాంటెక్స్ నిర్వహించే “తెలుగు సాహిత్య వేదిక” విభాగం ఆధ్వర్యంలో 90 వ “నెల నెలా తెలుగు వెన్నెల” కార్యక్రమం  డాల్లస్ నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం , స్థానిక నందిని  రెస్టారెంటు లో ఆదిభట్ల మహేష్ అధ్యక్షతన  మనసుకు వాకిళ్ళలో సాహిత్యపు రస రమ్య  దీపాలను వెలిగించిది. కార్యక్రమ ప్రారంభంలో  బసాబత్తిన శ్రీనివాసులు,  రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రచించిన ” అల్పజీవి ” అనే నవలను పరిచయం  చేసారు. అలాగే ‘మాసానికి ఒక మహనీయుడు’ శీర్షిక లో జనవరి మాసంలో జన్మించిన మరియు పరమపదించిన సాహితీ మూర్తుల గురించి చక్కగా వివరించారు . ఆ తరువాత డా.కోరాడ రామకృష్ణ గారు తన తండ్రి ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర ఆంగ్ల బాషా నిపుణులని , తెలుగు వ్యాకరణం పైన వున్న వైదుష్యం గణనీయమని తెలుపుతూ ఆయన వ్రాసిన గ్రంధాలనుంచి కొన్ని విశేషాలు సభకు తెలిపారు.

 

2015 సంవత్సరానికి తెలుగు సాహిత్యవేదిక నూతన సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించిన దండ వెంకట్ ను ఆదిభట్ల మహేష్ ఆదిత్య సభకు పరిచయం చేసారు. దండ వెంకట్ గారి సారధ్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలు కొత్త శోభ సంతరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు.  దండ వెంకట్ స్పందిస్తూ, భాషా సాహిత్యాలకు పెద్దపీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను మరియు స్థానిక సాహిత్యాభిమానులను అభినందిస్తూ, 2015 సంవత్సరంలో సేవలందించడానికి ఆసక్తి ఉన్న స్వచ్చంద సేవకులను ఆహ్వానించారు. అటు పిమ్మట, ఈనాటి ముఖ్య అతిథి ఘట్టి కృష్ణ మూర్తి గారు తెలుగు భాషకు, చిన్న పిల్లలకు పద్య పఠనం లో చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయమని అందుకు సంబందించిన వివరాలు తెలుపుతూ సభకు పరిచయం చేస్తూ వేదిక పైకి ఆహ్వానించగా , చిన్నారి సంహిత పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 90 మాసాలుగా ప్రవాసంలో నిరాటంకంగా నిర్వహిస్తున్న మన “నెల నెలా తెలుగు వెన్నెల 100వ సదస్సు ఈ సంవత్సరం అక్టోబరు మాసంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేసారు.. కొత్తగా హాజరయిన సాహితీ ప్రియులకు స్వాగతం పలుకుతూ 2015లొ కార్యక్రమాల నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ సాహిత్యానికి ఎప్పటిలాగే అగ్రతాంబూలం అందించనున్నట్లు తెలిపారు.

TANTEX_90th NNTV_01182015_Ghatti Krishna Murthy_Gnaapika Pradhaanam TANTEX_90th NNTV_01182015_Ghatti Krishna Murthy_Group Photo TANTEX_90th NNTV_01182015_Ghatti Krishna Murthy_Pushpa Guchham TANTEX_90th NNTV_01182015_Ghatti Krishna Murthy_Sadassu Aahvaanithulu TANTEX_90th NNTV_01182015_Ghatti Krishna Murthy_Shaluva Sanmaanam TANTEX_90th NNTV_01182015_Mukhya Athithi_Ghatti Krishna Murthy TANTEX_90th NNTV_01182015_Mukhya Athithi_Ghatti Krishna Murthy_2

పద్య ప్రసూన – ఆముక్త మాల్యద” అంశాలపైన ప్రధాన వక్త శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారు వెయ్యేళ్ళ నాటి నన్నయ  పద్యం , పోతన భాగవతం నుండి పద్యాలు , ఉమర్ ఖయ్యాం గారి పద్యాలు , ఆధునిక కవులు రచించిన పద్యాలు ఇలా వివిధ కాల మాన పరిస్థితులలో పద్యం ఎంత మార్పులు  చెందిందో బహు రమ్యంగా తనదైన శైలిలో పద్యదారణ చేస్తూ వివరించారు.   తదుపరి  శ్రీ కృష్ణదేవరాయల వారి స్వీయ రచన , తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి అయిన ఆముక్తమాల్యద కావ్యాన్ని – అందులో ఇమిడి ఉన్న ఉపకథలను మనసుకు హత్తుకొనే రీతిలో పద్యగానం , వచనం చేసారు.  శ్రీ కమనీయ హారమణి .. “, తెలుగదేల అనిన ..” లాంటి పద్యాలు పదుల సంఖ్యలో గానం చేసారు.

 

ఘట్టి కృష్ణ మూర్తి గారు చేసిన ప్రసంగం చివరి వరకూ కరతాళ ధ్వనులతో సాగింది. సంగీత సాహిత్యాలు అంటే ఆరో ప్రాణాలుగా భావించే డల్లాస్ ప్రజలు, తమకెంతో ఇష్టమైన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నా,  2015 మొట్టమొదటి సాహిత్య కార్యక్రమం కావడంతో రెట్టింపు రీతిలో హాజరయి తమ అభిమానాన్ని చాటుకొన్నారు .

 

టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి, ఉత్తరాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధి ఘట్టి కృష్ణ మూర్తి గారికి దుశ్శాలువతో మరియు సాహిత్య వేదిక బృందం జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త దండ వెంకట్ తెలుగు భాష మీద అభిమానంతో ఇంత దూరం వచ్చిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నందిని రెస్టారెంట్ యాజమాన్యానికి , ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ,టోరి లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. సంస్థ పాలక మండలి సభ్యుడు రొడ్డ రామకృష్ణా రెడ్డి, సంయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు, సాహిత్య వేదిక బృంద సభ్యులు పున్నం సతీష్, దామిరెడ్డి సుబ్బు, జలసూత్రం చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.