TANTEX UGADI UTSAVALU 28th MARCH, 2015

1395

శ్రీ మన్మధనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్)’ తరపున అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు!

తెలుగు వారి తొలి పండుగ “ఉగాది ఉత్సవాలు” యూలెస్ లోని ట్రినిటీ హైస్కూల్ లో శనివారం, మార్చి 28, 2015 మధ్యహ్నం 3 గంటల 30 నిముషాలకు అంగరంగ వైభవంగా జరుపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. టాంటెక్స్ కార్యవర్గ మరియు స్వచ్చంద సేవకుల బృందం తెలుగింటి పండుగ సందడులను, కళకళలను మన వేడుకలో కురిపించడానికి శ్రమిస్తున్నారు. ఈ సంవత్సరం, కార్యక్రమాల నాణ్యత పెంచడం ముఖ్యొద్దేశ్యంగా “ఉగాది ఉత్సవాలు” కార్యక్రమాలు వినూత్నంగా ప్రజారంజకంగా రూపొందించాము. టాంటెక్స్ వేదికపై మొట్టమొదటి సారిగా 400 మంది స్థానిక చిన్నారులు, కళాకారులతో జరుగబోయే ఈ కార్యక్రమానికి టాంటెక్స్అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ బృందం ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకోండి. ఆడ పిల్లలు, మగ పిల్లలు, స్రీలు, పురుషులు మరియు దంపతులు విభాగాలలో మొత్తం ఐదు బహుమతులు కేటాయించబడినవి. స్థానిక కళాకారుల శాస్త్రీయ, సినీ మరియు జానపద నృత్య ప్రదర్శన తరువాత, సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, మీ కోరిక మేరకు  ఒక గంటన్నర “అచ్చట్లు ముచ్చట్లు” చెప్పుకుంటూ గడిపేందుకు వీలుగా ఉగాది పచ్చడితో మొదలు పెట్టి, “బావర్చి – ప్లేనో” వారి కమ్మని పండుగ భోజనము తో పాటు తేనీరు, అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నాము.

భోజనానంతరం మనల్ని ఉర్రూతలూగించే కార్యక్రమంతో ముందుకు నడిపించడానికి, తన మాటలతో సందడి చేయడానికి ప్రముఖ వ్యాఖ్యాత శ్రీలక్ష్మి విచ్చేస్తున్నారు. ముందుగా త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పంచాంగ శ్రవణంలో మీ రాశి ఫలాలు. తరువాత దాదాపు రెండుగంటల పాటు మిమ్మల్ని సంగీత విభావరితో శ్రవణానందంలో ముంచెత్తడానికి ప్రముఖ నేపథ్య గాయకుడు కారుణ్య, నేపథ్య గాయని ఆదర్షిణి మరియు హనిష్క పొలిమెర విచ్చేస్తున్నారు.
“ఉగాది ఉత్సవాలు ” కార్యక్రమం లో శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, తెలుగు భాష వంటి రంగాలలో విశిష్ఠ సేవలందించిన ప్రతిభావంతులకు ఉగాది పురస్కారంతో సన్మానించడం, అలాగే ఎటువంటి లాభాపేక్ష లేని అత్యుత్తమ స్వచ్చంద సేవకులను గుర్తించి, గౌరవించడం మన సంస్థ ఆనవాయితీ. ఉగాది ఉత్సవాలు కార్యక్రమానికి పెద్దల టికెట్ రాయితీతో tantex.org మరియు mydealshub.com లో మార్చి 22 వరకు లభ్యమవుతాయి. ముందుగా కొనడానికి వీలుకుదరని పక్షంలో కార్యక్రమ వేదిక వద్ద రాయితీ లేకుండా కొనుగోలు చేయవచ్చు. సమయాభావం వల్ల ఇటువంటి ఇబ్బందులు పడకుండా, ఈ సంవత్సరం కొత్తగా అటు సభ్యులకు, ఇటు సంస్థకు అనుకూలంగా ఉండేలా “టాంటెక్స్ సీజన్ పాస్” ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకు ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక సగటు కుటుంబం ఈ సీజన్ పాస్ కొనడం వల్ల ప్రత్యేకంగా సీటింగ్ తో పాటు కనీసం 60% పొదుపు చేసుకోవచ్చు.
షడ్రుచుల కలబోతలా కమ్మగా అన్ని రుచులతో నిత్యనూతనంగా మీ సంవత్సరం సాగాలి అని ఆకాంక్షిస్తూ, షడ్రుచుల సమాహారంతో మొదలయ్యే ఈ ఉత్సవాలకు తెలుగు వారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.

UGAADI UTSAVAALU_FLYER_03_17_2017_V1