డాలస్ లో శోభాయమానంగా జరిగిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

1133

షడ్రుచుల సమ్మేళనంతో కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని ప్రతి  తెలుగు వారు కోరుకుంటారు. మరి డాలస్ ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల నివసించే తెలుగు బంధువుల ఆనందం కోసం 31 సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు అందించే ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు,   ఈ సంవత్సరo శ్రీ హేవళంబి నామ ఉగాది ఉత్సవాలు మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది,  స్థానిక మెక్ఆర్థర్  హై స్కూల్ లో  అత్యద్భుతంగా నిర్వహించారు.సంస్థ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త శ్రీమతి పాలేటి లక్ష్మి ఆధ్వర్యంలో మరియు సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి తోట పద్మశ్రీ పర్యవేక్షణలో ఈ ఉగాది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనంద పారవశ్యంతో ఓలలాడించాయి.

ఉగాది పచ్చడి, ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక బావర్చి రెస్టారెంట్ వారు అందించి అందరిని సంతృప్తి పరిచారు. ఈ ఉగాది ఉత్సవాలకు సుమారు 1100 మందికి పైగా  తెలుగువారు హాజరు కాగా సుమారు 250 మంది పిల్లలు మరియు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సందడి చేసారు.

అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, ‘ఏకదంతాయ వక్రతుండాయ” అంటూ ఫ్యూజన్ నృత్యంతో  సాగి, వివిధ సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు  సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కొనసాగాయి. భారత దేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోమలి సోదరీమణులు  కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ, చక్కటి మాటలతో , మిమిక్రీ ప్రదర్శనలతో ప్రేక్షకులందరిని ఎంతో ఆనందపరిచారు.  సంప్రదాయమైన నృత్యాలతో పాటు, సినిమా పాటల సమాహారం వంటి చక్కని డాన్సు మెడ్లీ లు, జానపద గీతాలు,  స్థానిక కళాకారుల అద్వితీయ ప్రతిభతో ఎంతో ఆకట్టు కొన్నాయి. “రామాయణం” నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మనసును దోచుకున్నది.  ఉగాది సందర్భంగా శ్రీ కంటంరాజు సాయికృష్ణ గారు పంచాంగ శ్రవణం గావించారు .

_SAM8741-L _SAM8875-L _SAM8935-L _SAM8961-L _SAM9048-L

ఇదంతా ఒక ఎత్తయితే, భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మెజీషియన్ వసంత్ తన ప్రతిభావంతమైన ప్రదర్శనలతో విచ్చేసిన వారందరిని ఆకట్టుకున్నారు.  ‘పాడుతా తీయగా’ ద్వారా సుపరిచతమైన యువ గాయకుడు శ్రీ కూరపాటి సందీప్ ఉత్సాహం నింపుతూ పాడిన పాటలు ప్రేక్షకులను పరవశింపచేసాయి.

కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉగాది శుభాకాంక్షలతో విచ్చేసిన వారందిని ఉద్దేశిస్తూ తన సందేశంలో ఈ సంవత్సరం చేయబోతున్న కార్యక్రమాల వివరణతో పాటు, సుమారు దశాబ్దం పైన డాలస్ లో వున్న తెలుగు వారందరికీ సుపరిచితమైన గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” ఫన్ ఏషియా 1110 AM లో పునః ప్రారంభమైన రేడియో ప్రసారo, సభ్యులకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన విషయాలు తెలిపారు. మన తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, సంగీత, లలిత కళల ప్రాధాన్యంతో “తెలుగు వైభవం” అనే ప్రత్యేక కార్యక్రమం కోసం సన్నాహాలు జరుగుతున్నవని తెలిపారు.

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2017ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం వైద్య , తెలుగు భాషాభివృద్ది, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. వైద్యరంగంలో డా.గునుకుల శ్రీనివాస్ గారికి, తెలుగు భాషాభివృద్ది రంగంలో శ్రీ  కే.సి. చేకూరి గారికి , విద్యా రంగంలో  డా. పుప్పాల ఆనంద్ గారికి  ఈ పురస్కారాలను అందచేశారు. అదే విధంగా సంస్థ వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న  శ్రీ దివాకర్ల మల్లిక్, డా. కలవగుంట సుధ, కుమారి మార్పాక పరిమళ, కుమారి తుమ్మల జస్మిత, శ్రీ నిడిగంటి ఉదయ్ లను  ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) పురస్కారంతో సత్కరించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిధి కళాకారులైన మెజీషియన్ వసంత్, గాయకుడు కూరపాటి సందీప్, కోమలి సోదరీమణులను టాంటెక్స్ కార్యవర్గ బృందం జ్ఞాపికలతో సత్కరించారు. సంస్థ రేడియో కార్యక్రమాలకు 2016 సంవత్సరంలో వ్యాఖ్యాతలగా స్వచ్ఛందoగా సేవలందించిన కార్యకర్తలను జ్ఞాపికలతో గుర్తించడం జరిగినది.

ఈ ఉగాది కార్యక్రమ ప్రెజెంటింగ్ పోషకులు NSI సంస్థకు,  శ్రీ రాం కొనార గారికి, శ్రీ  పోలవరపు శ్రీకాంత్ గారికి మరియు కార్యక్రమ పోషకులైన రిచ్మండ్ హిల్ మోంటెస్సోరి సంస్థకు, ప్రాడిజీ టెక్నాలజీస్ సంస్థకు, శ్రీ వీర్నపు చినసత్యం గారికి జ్ఞాపికలు ప్రధానం చేసి టాంటెక్స్ సంస్థ తమ కృతఙ్ఞతలు తెలియచేసారు.

_SAM9123-L _SAM9245-L _SAM9293-L _SAM9302-L _SAM9382-L

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయకర్త  శ్రీమతి పాలేటి లక్ష్మి, డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్రెజెంటింగ్ మరియు ఈవెంట్  పోషక దాతలకి, ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన  ఫన్ ఏషియా వారికి మరియు ప్రసారమాధ్యమాలైన టోరి, TNI, TV5, TV9,  ఏక్ నజర్ లకు  కృతఙ్ఞతలు తెలియచేసారు.

ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

ఉగాది ఉత్సవాల కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Ugaadi-Utsavaalu-2017/