సాహోరే “తెలుగు వైభవం”: టాంటెక్స్ వారి ప్రత్యేక సదస్సు

1692

జులై 8th 2017 డాలస్, టెక్సస్

31 సంవత్సరాల ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు వైభవం  మరియు  ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమం  “నెల నెలా తెలుగు వెన్నెల” తెలుగు సాహిత్య వేదిక 10వ వార్షికోత్సవం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ   ప్రత్యేక సదస్సు “తెలుగు వైభవం”  విశిష్ట అతిధుల సమక్షంలో అశేష అభిమానుల మధ్య  స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ ఆడిటోరియం లో,  అధిక సంఖ్యలో పాల్గొన్న డాలస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానుల ఆదరాభిమానాలు చూరగొంటూ, అత్యంత వైభవంగా జరిగాయి.  ప్రవాసంలో నిరాటంకంగా 120 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. మధ్యాహ్నం ప్రారంభమైన సాహిత్య వేదిక వార్షికోత్సవం ఉప్పలపాటి కృష్ణా రెడ్డి అధ్యక్షతన మరియు సమన్వయకర్త సింగిరెడ్డి శారద ఆధ్వర్యంలో నిర్వహించబడినది. భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథులు, డాలస్ లోని తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది

కార్యక్రమంలో ముందుగా సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద 2017 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి మాట్లాడారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ  ఉపకులపతి ప్రొఫెసర్ వి.దుర్గాభవాని గారు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడారు. విమర్శకుడు, కథ, యాత్రా రచయిత దాసరి అమరేంద్ర గారు “తెలుగు యాత్రా సాహిత్యం” అంశం మీద చక్కగా ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా. కాత్యాయని విద్మహే గారు “తెలుగు సాహిత్య విమర్శ” అంశం మీద ప్రధాన ప్రసంగం గావించారు. సంపాదకులు,విమర్శకులు వాసిరెడ్డి నవీన్ గారు “తెలుగు కథ – మారుతున్న స్వరం” అంశం మీద ప్రసంగించారు. నాటక రచయిత డా. కందిమళ్ళ సాంబశివరావు గారు “తెలుగు నాటకం – సామాజిక చైతన్యం” అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ కధా రచయిత గొర్తి బ్రహ్మానందం గారు తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష సాహితీవేత్తల నడుమ చర్చ నిర్వహించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చర్చించి,  విచ్చేసిన వారందరినీ ఆనందపరిచారు. విచ్చేసిన సాహితీ ప్రముఖులందరిని సంస్థ కార్యవర్గ మరియు సాహిత్య వేదిక బృందం పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటో కవితల పోటీకి ఆశేష ఆదరణ లభించింది. ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారు ఫోటో కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డాలస్ కి చెందిన నశీం షేక్ రాసిన “పునాదులు-సమాధులు” కవితకి మొదటి బహుమతి లభించగా. రావెల పురుషోత్తమరావు గారి “ఆదరాబాదరాగా” కవితకి రెండవ బహుమతి లభించింది. చిలుకూరి  వెంకటశాస్త్రి గారి “జయహో” కవితకి మూడవ బహుమతి లభించింది.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని కూచిపూడి కళకే అంకితం చేసి, దేశ విదేశాల్లో వందలాది నృత్య ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ వాటికి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించిన  నాట్యాచార్యులు, చలన చిత్ర నృత్య దర్శకులు శ్రీ కేవీ సత్యనారాయణ గారు డాలస్ కి చెందిన నాట్య కళాకారులతో కలిసి “జయహో శ్రీ కృష్ణదేవరాయ” కూచిపూడి నృత్య రూపకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఎంతో ఆసక్తితో అష్ట దిగ్గజాలుగా పాల్గొన్న స్థానిక భాషాబిమానుల వేష ధారణ మరియు వారి ఆసక్తి ఈ నృత్య రూపకానికి నూతన శోభ, ఉత్సాహం తెచ్చిపెట్టాయి.

భోజనానంతర విరామం తరువాత, ఈ ప్రత్యేక సదస్సు సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆహ్వాన పలుకులతో, సాయంకాల వినోద కార్యక్రమాల వివరాలు అందిస్తూ,  ప్రేక్షకులకు పునస్వాగతం తెలిపారు.  ఈ సందర్భంగా , ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి తమ సందేశంలో “31 సంవత్సరాల టాంటెక్స్ తెలుగు వైభవం మనమందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న సంస్థ గామొదలైన టాంటెక్స్  ఈ నాడు అమెరికా లో ఉన్న జాతీయ తెలుగు సంస్థలతో ధీటుగా ఇటు అమెరికాలో అటు ఇండియా లో కూడా గుర్తింపుతెచ్చుకుంది అన్నారు డల్లాస్ నగరంలో లభించే ఆదరాభిమానాల గురించి అమెరికాలోనే కాకుండా , మన భారతదేశంలోను మనకు అభినందనలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి”  అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.  

భారతదేశం నుంచి అమెరికాలో పర్యటన చేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన  కోడంగల్ ఎం.ఎల్.ఎ. శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ,  సంస్థ కార్యవర్గ, పాలక మండలి బృందం సన్మానం చేశారు. అటు తరువాత , కార్యక్రమానికి తనవంతు ఆర్ధిక సహాయం చేస్తూ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస భారతీయుల ఐ.టి. ప్రత్యేక ప్రతినిధి మనోహర్ రెడ్డి గారిని టాంటెక్స్ కార్యవర్గ బృందం సన్మానం చేయడం జరిగినది.  అటు పిమ్మట, ప్రెసిడెన్సియల్   స్పాన్సర్ : NATS సంస్థను,  లోన్ స్టార్ స్పాన్సర్స్: డా. పైల మళ్ళా రెడ్డి, డా. ప్రేమ్ రెడ్డి లను , NATA, TPAD సంస్థలను , ప్రీమియర్ స్పాన్సర్స్ : TANA సంస్థను , క్వాంట్ సిస్టమ్స్ ను, గోల్డ్ స్పాన్సర్: రాం కోనార, సౌత్ ఫోర్క్ డెంటల్ లను సభా వేదిక మీద సన్మానించారు.

సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ , విచ్చేసిన గాయక బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయగా , ప్రత్యేక కార్యక్రమం మొదలు పెడుతూ తమ మృదుమైన పలుకులతో వ్యాఖ్యాతగ వ్యవహరిస్తూ , మధురమైన , అందరికి ఇష్టమైన పాటలతో ప్రముఖ గాయని సునీత గారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో  , సంగీత దర్శకుడు , గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయకులు భార్గవి పిళ్ళై, దినకర్, యాసిన్ నజీర్ , సమీర భరద్వాజ్ లు, ఈ ప్రత్యేక సదస్సుకు విచ్చేసి కదలకుండా వింటున్న  వారందరినీ ఆద్యంతం ఆకట్టుకుని సంగీత ప్రవాహంలో  ముంచెత్తారు. ప్రేక్షకుల కోరికపై ఎన్నో ఉత్సాహ పరిచే పాటలు వినిపించారు.

1986, సంస్థ ప్రారంభింప బడిన సంవత్సరం నుంచి 2017 వరకు , ఆయా సంవత్సరాలలో అత్యుతమ పాటలుగా గుర్తింపబడిన  పాటల సమాహారాన్ని , తమ నృత్య నైపుణ్యాన్ని జోడించి “టాంటెక్స్-చిత్రలహరి” అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని, శాంతి నూతి మరియు  రవి తేజ ఆధ్వర్యంలో మొదటి భాగాన్ని, కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన టాలీవుడ్ నటి స్నేహ నామనంది మరియు గోమతి సుందరబాబు ఆధ్వర్యంలో రెండవ భాగాన్ని, స్థానిక కళాకారులు  ప్రదర్శించారు.  ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారుల నృత్య నైపుణ్యo, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది.

అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం మరియు కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

ఏ కార్యక్రమానికైనా మనల్ని ప్రోత్సహించిచేయూతనిచ్చే పోషక దాతలు లేకుంటే కార్యక్రమం చేయడం సాధ్యపడదు. ప్రత్యేక అతిథులు,  పోషకదాతల గౌరవార్ధం ముందు రోజు  టాంటెక్స్ వారు ఏర్పాటు చేసిన విందులో పోషకదాతలు ప్రతి ఒక్కరిని పేరు పేరునా గుర్తించి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయo ఉప కులపతి డా. వి. దుర్గా భవాని , సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా. కాత్యాయని విద్మహే గార్ల, ఇతర తెలుగు సాహిత్య ప్రముఖులు మరియు  ప్రముఖ గాయని సునీత మరియు వారి గాయక బృందం ఙ్ఞాపికలు అందచేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమ పోషకుల వదాన్యతను అభినందించారు.  

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన యువ రేడియో, టీవీ5, టి.ఎన్.ఐ,  టీవీ9 లకు  కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

పైన వివరించిన కార్యక్రమాల ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/Sahitya-Vedika10h-Anniversary-120th-NNTV-July-8th2017/

https://tantex.smugmug.com/2017-Events/Telugu-Vaibhavam-Musical-Extravaganza-July-8th-2017/