టాంటెక్స్ వేదికపై అన్నమయ్య పద సంకీర్తనా పూలజల్లు: పద్మశ్రీ డా. శోభారాజు సంగీత విభావరి

1251

ఆగస్ట్ 30, 2014, డాల్లస్ / ఫోర్టువర్త్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సమర్పించిన పద్మశ్రీ డా. శోభారాజు గారి అన్నమాచార్య “పద సంకీర్తనా పూలజల్లు” శనివారం, ఆగష్టు 30 వ తేది స్థానిక సెయింట్ మేరీస్ మలంకార ఆర్థొడాక్స్ చర్చ్ లో సాంస్కృతిక వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ముఖ్య అతిథి పద్మశ్రీ డా. శోభారాజు గారు, టాంటెక్స్ పాలక మండలి మరియు కార్యవర్గ బృందం, జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టాంటెక్స్ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. శోభా రాజు గారు నిర్వహించిన ‘వేసవివెన్నెల’ శిక్షణా శిబిరంలో పాల్గొన్న చిన్నారులు ‘అన్నమ గాయత్రి’ తో మొదలిడి, ‘తిరుమల గిరిరాయ’, ‘నువ్వంటే ఇష్టం హనుమ’ మరియు ‘వేడు కొందామ వేంకటగిరి’ వంటి కీర్తనలను చక్కగా ఆలపించి ‘భళిరా’ అనిపించారు. tantex-sangeetha-vibhavari 1 tantex-sangeetha-vibhavari 2 tantex-sangeetha-vibhavari 3

సాంస్కృతిక వేదిక సమన్వయకర్త స్వాగతోపన్యాసంలో పద్మశ్రీ డా. శోభా రాజు గారిని కొనియాడుతూ, ఆమె చాలా మందికి ఒక గాయనీమణిగానే తెలుసు గాని, చక్కని కవయిత్రి కూడా అనేది చాల మందికి తెలియని విషయం అని తెలుపుతూ, వేదిక పైకి సగౌరవంగా అహ్వానించారు. టాంటెక్స్ కార్యవర్గ బృందం మహిళాసభ్యులు శీలం కృష్ణవేణి, వనం జ్యోతి, మండిగ శ్రీ లక్ష్మి ముఖ్య అతిథిని వేదికపైకి తోడ్కొని రాగా,కార్యక్రమ పోషకదాతలు నూతి శాంతి మరియు ముప్పిడి మంజు రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. శోభా రాజు గారికి శ్రీ జయకుమార్ గారు తబల మరియు శ్రీ అయ్యప్ప గారు కీబోర్డ్ సహకారం అందించారు. సూరిభొట్ల రాజశేఖర్, నూతి శాంతి, బండ రూప, చావలి హేమమాలిని , చిన్నారులుధర్మాపురం నేహ, జంగేటి మహిత, ఏలేశ్వరపు స్నిగ్ధ, బండ అనీశ, వాస్కర్ల శ్రియ సహాయకులుగా వ్యవహరించారు.

‘అన్నమ గాయత్రి’ ప్రార్థనతో పద్మశ్రీ డా. శోభారాజు గారు తమ సంగీత విభావరిని ప్రారంభించారు. తదుపరి వినాయక ప్రార్థన, ‘నారాయణాయ సగుణ బ్రహ్మం’, ‘నేను లేకుంటే స్వామి ఏడీ’, ‘కొండలలో నెలకొన్న’, ‘బ్రహ్మమొక్కటే’, ఊంజల సేవ’ మొదలైన సంకీర్తనలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారు. అన్నమాచార్య కీర్తనలతో తన జీవితం ఎంత ముడిపడి ఉన్నదీ, తిరుమల తిరుపతి దేవస్థానంతో తన అనుబంధం, తాను ఏర్పాటు చేసిన కళావేదిక ‘అన్నమయ్య భావ వాహిని’, అన్నమయ్యపురం మొదలైన వివరాలు తెలుపుతూ కార్యక్రమాన్ని వీనులవిందుగా కొనసాగించారు. ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనకి నటరాజ్ ఒడిస్సి కళామందిర్ నృత్య దర్శకురాలు శ్రీమతి పుట్రేవు కృష్ణవేణి ‘ చేసిన నృత్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది.

టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) చిన్నారుల కోసం ఇటువంటి ఉత్తమమైన శిక్షణాశిభిరాన్ని నిర్వహించి ఇంతటి మహాగాయని వద్ద నేర్చుకునే అవకాశాన్ని కల్పించటమే కాక, ఈరోజు పద్మశ్రీ డా. శొభారాజు గారి సంగీత విభావరిలో మన చిన్నారులకు పాడే అవకాశం కల్పించడం మనమంతా గర్వించదగ్గ విషయం అన్నారు. తెలుగు భాష, సాహిత్యం,సంస్కృతి,విద్య,ఆరోగ్యం,క్రీడలు,వ్యాపారం,వనితల కార్యక్రమాలు, మైత్రి వంటి కార్య క్రమాలను చేపట్టడంలో టాంటెక్స్ సంస్థ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని అన్నారు.

టాంటెక్స్ పూర్వాధ్యక్షురాలు డా. గవ్వ సంధ్య మరియు కార్యవర్గ బృందంముఖ్య అతిథిని శాలువతో సత్కరించారు. కార్యక్రమ పోషకదాతలు నూతి శాంతి మరియు ముప్పిడి మంజు రెడ్డి లను , సాంస్కృతిక వేదిక బృందం సభ్యులు పుష్పగుచ్చం తో సత్కరించారు. డా.సుదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు ముఖ్యఅతిథి కోరిక మేరకు వైద్య మరియు ఆధ్యాత్మిక రంగాల అనుబంధాన్ని వివరించారు.

టాంటెక్స్ పూర్వా ధ్యక్షులు మండువ సురేష్, తోటకూర ప్రసాద్, పాలక మండలి సభ్యులు చాగర్లమూడి సుగన్, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, కోశాధికారి వీర్ణపు చినసత్యం, సంయుక్త కోశాధికారి శీలం కృష్ణ వేణి మరియు కార్యవర్గ సభ్యులు గజ్జల రఘు,చామ్కుర బాల్కి, దేవిరెడ్డి సునిల్, దండ వెంకట్, వనం జ్యోతి, మండిగ శ్రీ లక్ష్మి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాంస్కృతిక వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం “పద సంకీర్తనా పూల జల్లు” సంగీత విభావరికార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన సంగీత ప్రియులకు, ఆడియో సహకారం మరియు వేదిక కల్పించిన స్థానిక సెయింట్ మేరీస్ మలంకార ఆర్థొడాక్స్ చర్చ్ యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి , ప్రసార మాధ్యమాలైన టీవీ5, 6టీవీ, టీవీ9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.