“సాహిత్యంలో భవిష్యత్ ధృక్పదం”– అద్బుత ప్రసంగంతో ముగిసిన టాంటెక్స్ 87 వ నెలనెలా తెలుగువెన్నెల

1880

అక్టోబర్ 18, 2014, డాలస్ ఫోర్టువర్త్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ప్రవాసంలో నిరాటంకంగా 87వ నెల సమర్పించిన “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు డాలస్ లో స్థానిక నందిని రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించబడినది. సమన్వయకర్త స్వాగాతోపన్యాసంలో కార్యక్రమానికి అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో విచ్చేసిన డాలస్ ప్రాంతపు తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు స్వాగతం పలికారు. సాహిత్యవేదిక మొదటి భాగంలో తెలుగు భాష గొప్పదనం, పుస్తక సమీక్ష, రెండవ భాగంలో తెలుగు, సంస్కృత భాషా ప్రవీణులు శ్రీ తిరునగరి లక్ష్మణ  స్వామి గారి  ప్రసంగంతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది.TANTEX_87th NNTV_10182014_Thirunagari Lakshmana Swamy_Shaluva Sanmaanam TANTEX_87th NNTV_10182014_Thirunagari Lakshmana Swamy_Pushpa Guchham TANTEX_87th NNTV_10182014_Thirunagari Lakshmana Swamy_Group Photo TANTEX_87th NNTV_10182014_Thirunagari Lakshmana Swamy_Gnaapika Pradhaanam TANTEX_87th NNTV_10182014_Thirunagari Lakshmana Swamy_Audience TANTEX_87th NNTV_10182014_Mukhya Athithi_Thirunagari Lakshmana Swamy

శ్రీమతి అపర్ణ గారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుగు భాష  పై రచించిన “చక్కర కలిపిన కమ్మని తెలుగు , నన్నయ తిక్కన ఎఱ్ఱన పొదిగిన ఆవుపాల పొదుగు” గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి పుస్తక పరిచయ కార్యక్రమంలో మహీధర రామ మోహన రావు గారు రచించిన “కొల్లాయి గట్టితే నేమి”  అనే  నవలను బసాబత్తిన శ్రీనివాసులు పరిచయం చేసారు . ఈ నవల 1920 వ సంవత్సరం నుండి రెండు సంవత్సరాల కాలంలో జరిగినట్లు, జాతీయోద్యమం, గాంధేయ వాదం , ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయని చెప్పారు. అలాగే 1968 వ సంవత్సరంలో ‘ఆంధ్ర సాహిత్య అకాడమి’ పురస్కారం లభించింది అని చెప్పారు.   తదుపరి  పున్నం సతీష్  మాట్లాడుతూ “ఇస్మాయల్ నత్త ప్రణయ యాత్ర ” అనే హైకూలు పరిచయం చేసారు. హైకూలు అంటే ముచ్చటగా మూడు వరుసల చిన్ని కవిత అని పుస్తకంలో కొన్ని పేజీలు  చదివి సందడి చేసారు. తరువాత జలసూత్రం చంద్రశేఖర్ “తెలుగు భాష గొప్పదనం ” అన్న అంశం పై ప్రసంగించారు.  తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఇటలీ యాత్రికుడు  “నికోలే కాంటే ” ప్రస్తావించారని,  శ్రీ కృష్ణ దేవరాయల వారు తమ స్వహస్తాలతో రచించిన పంచ మహా కావ్యాలలో ఒకటైన “ఆముక్త మాల్యద” అనే గ్రంధంలో పొందుపరిచిన , తెలుగు భాష గొప్పదనాన్ని ఎవ్వరూ చేరుకోలేని ఎత్తులో , శిఖరాగ్రం పై నిలబెట్టిన చరిత్రాత్రకమైన మాట కలిగి ఉన్న  “తెలుగదేల యనిన దేశంబు తెలుగు …. దేశ భాష లందు తెలుగు లెస్స ” అనే పద్యాన్ని పాడారు.  అలాగే తెలుగులో ఒక్క అక్షరం మాత్రమే వాడి పదాలు , వాక్యాలు రాసే వీలుందని , ఉదాహరణగా  “కాకీక కాకికి కాక కేకికా ” అని చిన్నప్పుడు చెప్పుకొన్న మాట గురించి చెప్పారు.  తెలుగు గొప్పదనం ఎంత చెప్పుకొన్నా తరగదు అని ఆహుతులు అందరూ తెలుగు భాషకు వందనాలు అర్పించారు.

కార్యక్రమ ద్వితీయ విభాగంలో   శ్రీ తిరునగరి లక్ష్మణ స్వామి గారు “సాహిత్యంలో భవిష్యత్ ధృక్పదం ” అనే అంశం పై ప్రసంగించారు. తెలుగు వ్యాకరణం, సంస్కృత, హిందీ బాషలు , ఆరోగ్య సూత్రాలు, యోగ శాస్త్రం, నీతి సూక్తులు, ఇలా విభిన్న అంశాలపై ప్రసంగించారు. వేదరచన నుంచి,  ధాతువులతో శరీర అవయవ నిర్మాణం వరకు  ఎన్నో విషయాలు ప్రస్తావించారు.   ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు కాకర్ల విజయ్ మోహన్ మరియు ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సంయుక్తంగా ముఖ్య అతిథిని దుశ్శాలువతో సత్కరించారు. ఆ తరువాత తెలుగు సాహిత్య వేదిక సభ్యులు శ్రీ తిరునగరి లక్ష్మణ స్వామి గారికి జ్ఞాపికను బహూకరించారు.

కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగినందుకు తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ మహేష్ ఆదిభట్ల గారు వందన సమర్పణ చేస్తూ సదస్సు చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన టాంటెక్స్ కార్య నిర్వహక సభ్యులకు, తెలుగు సాహిత్య వేదిక సభ్యులకు, సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక నందిని  రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మధ్యమాలైన 6 టీవీ, టీవీ 5, టీవీ 9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

ఈ కార్యక్రమం విశేషాలను చిత్రాల ద్వారా, ఈ క్రింది లంకె లో చూడండి.