ఫేస్ బుక్ లో హల్ చల్ సృష్టించిన టాంటెక్స్ మైత్రి సభ్యులు

1056

నవంబర్ 8, 2015, డాలస్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో “సోషల్ నెట్వర్కింగ్ లో ఓనమాలు” శిక్షణా శిబిరం ఆదివారం, నవంబర్ 8వ తేదీన రెక్స్ ప్రోగ్రామింగ్ వారి ట్రైనింగ్ సెంటర్ లో మైత్రి సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

 

ప్రవాసంలో నివసిస్తున్న మరియు భారత దేశం నుండి తమ పిల్లలతో గడపడానికి విచ్చేసిన తల్లిదండ్రుల కోసం టాంటెక్స్ ఏర్పాటు చేసిన వేదిక ఈ మైత్రి. ఈ వేదికలో గతం లో జరిగిన కార్యక్రమాలకు భిన్నంగా, నేటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, “సోషల్ నెట్వర్కింగ్ లో ఓనమాలు” శీర్షిక లో మొదటిగా ఫేస్ బుక్ అంటే ఏమిటి, వాడటం ఎలా, గమనించవలసిన విషయాలు, జాగ్రత్తలు మొదలైన అన్ని అంశాలను తెలియచేసారు.

 

మూడు గంటలపాటు సాగిన శిక్షణా శిబిరం, కాలేజి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ, కాఫీ సమోసాలతో, సరదా సంభాషణలతో, నేర్చుకున్న విషయాలను అప్పటికప్పుడు స్వయంగా చేస్తూ అంతా ఉత్సాహం గా నేర్చుకున్నారు.

TANTEX Maitri picture 2 TANTEX Maitri Picture 4

మైత్రి కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులు తమ ఆనందాన్ని ఇలా తెలియచేసారు. టాంటెక్స్ మాకోసం ఈనాటి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషం గా ఉందని, తమ పిల్లలు మనవళ్ళు మనవరాండ్లతో సరదాగా పోటీ పడుతూ ఇప్పటి తరానికి నచ్చేలా దగ్గరవడానికి ఇదొక మార్గం అవగలదు అనే ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. సాయంత్రం వేళల్లో పార్క్ లో సాధారణం గా ఈ విషయం పై చర్చ జరుగుతూ ఉంటుందని, ఇప్పుడు తాము కూడా ఈ విషయమై మిత్రులతో చర్చించగలం అంటే ఎంటో ఉత్సాహంగా ఉందని, మళ్ళీ మీరు ఏర్పాటు చేసే కార్యక్రమానికి మిత్రులందరితో కలిసి వస్తాం అని ఆనందాన్ని తెలియచేసారు.

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం,పాలకమండలి సభ్యులు రొడ్డా రామకృష్ణ, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   రెక్స్ ప్రోగ్రామింగ్ అధినేత్రి శ్రీమతి పడాల సంధ్య మాట్లాడుతూ, టాంటెక్స్ మైత్రి కార్యక్రమం లో తమను భాగస్వామ్యులను చేసినందుకు సంతోషం గా ఉందన్నరు. కుమారి జొన్నలగడ్డ సాయి ప్రణవి చక్కగా అందరికి అర్ధమయేలా నేర్పించారు. సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మైత్రి సభ్యులు కోరిన విధంగా త్వరలో ఆరోగ్య పరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకొని కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియచేసారు. ఎంతో ఉత్సాహంతో పాల్గొని కొత్తగా చేసిన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, హమారా, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.