టాంటెక్స్ ”నెల నెలా తెలుగు వెన్నెల” వేదికపై అద్భుతంగా ముగిసిన ౩౩ వ టెక్సాస్ సాహిత్య సదస్సు

1329

“పగలే వెన్నెల జగమే ఊయల” అనేది ఒక కవి మధుర భావం . ఆ ఊహే నిజమైతే ఎంత బాగుంటుంది అని మనకు కొన్ని సార్లయినా అనిపించక మానదు. ఈ శనివారం  సెప్టెంబర్ ఇరువది తేదిన డల్లాస్ నగరంలో స్థానిక హిల్ టాప్ ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన టెక్సాస్ 33 వ సాహితీ సదస్సు మరియు టాoటెక్స్   86 వ  నెల నెలా తెలుగు వెన్నెల  కార్యక్రమం సరిగ్గా ఆ మాటను నిజం చేసి చూపింది. డల్లాస్ , హ్యూస్టన్ , ఆస్టిన్, టెంపుల్ ,శాన్ ఆంటోనియో  వంటి టెక్సాస్ రాష్ట్ర సాహితీ ప్రియులే కాకుండా  భారతదేశం నుండి విచ్చేసిన పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని అనుక్షణం రక్తి కట్టించడం చెప్పుకోదగ్గ విశేషం.

tantex-86-nela-nela-telugu-vennela 1 tantex-86-nela-nela-telugu-vennela 2 tantex-86-nela-nela-telugu-vennela 3 tantex-86-nela-nela-telugu-vennela 4

సింగిరెడ్డి శారద గారి ప్రార్ధనా గీతం అనంతరం కార్యక్రమ సమన్వయ కర్త   ఆదిభట్ల మహేష్ ఆదిత్య సభను ఉద్దేశించి ఇటీవల స్వర్గస్థులైన ప్రపంచం  గర్వించ దగిన చిత్రకారుడు,గొప్ప తెలుగు  సినీ దర్శకుడు శ్రీ సత్తి రాజు లక్ష్మీ నారాయణ (బాపు) గారి గురించి ప్రస్థావించారు. ఆ తరువాత ఆహ్వానితులందరూ బాపు గారికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, శ్రీమతి చావలి సుధ సత్యం మందపాటి  గారికి బాపు రమణల తో ఉన్న అనుభవాలను  “బాపు రమణ గార్లతో నా తీపి గుర్తులు” అన్న పుస్తక విశేషాలు పంచుకున్నారు.   తరువాత మందపాటి సత్యం గారు మాట్లాడుతూ “మొట్ట మొదటి టెక్సాస్ సాహితీ సదస్సు 1998 వ సంవత్సరం లో ఆస్టిన్ నగరంలో నిర్వహించా”మని గుర్తు చేసుకొన్నారు. అది మొదలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెక్సాస్ నగరాలలో నిర్వహించడం,  ఈ సారి 33 వ సాహితీ సదస్సు ఈరోజు డల్లాస్ లో నిర్వహించడం, ఇలా నిర్విరామంగా మన సాహితీ తోటలో పువ్వులు విరబూయడం మన తెలుగు జాతి గొప్పదనం, ఇది ఎంతో గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు . టాoటెక్స్ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి నిర్వహించిన ప్రశ్నా వినోద కార్యక్రమం అత్యంత ఆసక్తి గా జరిగింది.   తరువాత శ్రీమతి పోకల  సుమ ఆడవాళ్ళు సమాజంలో ఎంతో పరిణితి సాధించారు, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందారు, వారు మరెంతో గౌరవించబడవలసిన అవసరం ఉంది అని ఎంతో చక్కటి ఉపన్యాసం చేసారు.  బసాబత్తిన శ్రీనివాసులు “బొమ్మా- బొరుసా ” అనే పుస్తకం గురించి ముచ్చటించారు. సి. యన్ . సత్యదేవ్ ‘గిరీశం లెక్చర్ ‘ బుచ్చమ్మ అష్టావధానం హాస్య కథానికతో ఎంతో నవ్వించారు.  మల్లవరపు అనంత్   “కవిపండితులు వ్రాసిన లేఖలు ” అన్న అంశంలో లేఖ  చదివి వినిపించి ఆద్యంతం ఆకట్టు కొన్నారు.

 

కార్యక్రమ పోషక దాత డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సహాయంతో ఏర్పాటు చేసిన, పసందైన విందు భోజనం అనంతరం తిరిగి ప్రారంభ మైన కార్యక్రమం లో డా. గుడివాడ  ప్రభావతి ‘బాల సాహితీ ప్రపంచం ‘ అన్న అంశంలో శ్రీనాధుని కవిత్వం గురించి ప్రస్థావించారు.  పున్నం సతీష్  కవి జొన్నవిత్తుల రచించిన “బతుకమ్మ శతకం” నుండి పద్యాలు చదివి వినిపించారు.  కన్నెగంటి చంద్రశేఖర్ జానపద కథల లక్షణాలు , విశేషాలు అత్యంత సరళంగా, వినోదాత్మకంగా వివరించారు.  మద్దుకూరి చంద్రహాస్ ‘మృత్యుంజయ శతకం’ ఒక పరిచయం లో కొన్ని ఆణి ముత్యాల లాంటి పద్యాలు వినిపించారు.  కాజ సురేష్ ‘ఆంధ్రనగరి’ అనే పుస్తకంఆంధ్రుల గురించి ఎంత సమగ్ర సమాచారం ఉందో చక్కగా వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో జరిగిన బాపు గారి మీద ప్రశ్నా వినోదం కార్యక్రమం స్క్రీన్ మీద బాపు గారి కార్టూన్ చూపించి వాటికి బాపు గారు ఏ వ్యాఖ్య రాసుంటారో ఊహించ మన్నారు. డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమాలలో దిగజారుతున్న సాహిత్య విలువలు గురించి ఆయన చేసిన ప్రసంగం ఎన్నో నవ్వులు పూయిస్తూ , మరెంతో ఆలోచించేలా చేసింది. డా. జువ్వాడి రమణ, పాల్కురికి సోమయాజులు గారి పండితారాధ్య చరిత్ర గురించి , డాక్టర్ శ్రీ భట్రాజు గారు తన పుత్రుడు ఆంగ్లం లో రచించిన పుస్తకం గురించి పరిచయం చేసారు.

 

సంస్థ అధ్యక్షులు కాకర్ల విజయ్ మోహన్ మాట్లాడుతూ టెక్సాస్ తెలుగు వారందరు ఈ కార్యక్రమలో కలవడం ఎంతో ఆనంద దాయక మైన విషయం అని, సాహిత్య సౌరభాలు వెదజల్లు ఈ సాహితీ సదస్సు , “నెల నెలా తెలుగు వెన్నెల”కార్యక్రమాలు ఇంత గొప్ప రీతిలో ఆదరిస్తున్నందుకు అందరకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య వందన సమర్పణ చేస్తూ సదస్సు చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ , కార్యక్రమ పోషక దాత డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, విచ్చేసిన టాంటెక్స్ కార్య నిర్వహక , పాలక మండలి బృందం సభ్యులకు,తెలుగు సాహిత్య వేదిక సభ్యులకు, సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక హిల్ టాప్ రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మధ్యమాలైన టీవీ 9, 6 టీవీ, టీవీ 5 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.