ఆనంద డోలికల్లో ముంచెత్తిన టాంటెక్స్103వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు

1219

ఫిబ్రవరి 21, 2015 డాలస్, టెక్సస్.

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఫిబ్రవరి 21వ తేదీన దేశీప్లాజా స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

బిళ్ళ ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 103వ నెల నెలా తెలుగు వెన్నెల అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు జరుపుకోవడం ఎంతో విశేషం అని చెబుతూ మన మాతృభాష  మనకే కాక ఇతరులకూ విన సొంపైన భాష, సులువైన భాష, రచనలకైనా, భావ వ్యక్తీకరణకైనా సరళమైన భాష, సరసమైన భాష అని కొనియాడుతూ విచ్చేసిన సాహితీ ప్రియులందరికి శుభాభినందనలు తెలియ చేసారు.

TANTEX_NNTV_103_GUEST - Copy TANTEX-NNTV 103_Group1 TANTEX-NNTV_103_CR TANTEX-NNTV_103_JNAPIKA TANTEX-NNTV_103_PRARTHANA

కార్యక్రమంలో ముందుగా పోతన భాగవతా పీఠికలోని ప్రార్ధన పద్యములను చిన్నారులు మాడ సంహిత, మాడ సమన్విత, కర్రి యశస్వి భావయుక్తంగా పాడారు. ఇక దొడ్ల రమణ గారు పోతన పదప్రయోగాల గురించి వివరిస్తూ ఓ సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో బమ్మెర పోతన దిట్ట అని, శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై పట్టే కాకుండా భావంపైన పూర్తి నియoత్రణ సాధించిన మహాకవి అని చెప్పారు. మరికొన్ని పోతన పద్యాలను డా. పుదూరు జగదీశ్వరన్ గారు సభలో రసవత్తరంగా ఆలపించారు.

 

మాసానికో మహనీయుడు శీర్షికన వరిగొండ శ్యాం ‘భారతకోకిల’ శ్రీమతి సరోజినీ నాయుడు గారి ప్రతిభ గురించి మాట్లాడుతూ, ఉదాహరణకి ఆమె వ్రాసిన “Palanquin bearers” ద్వారా భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చెప్పారని కొనియాడారు.

 

ఐఐటి కోచింగ్ లో ప్రసిద్ధులు, ‘ఐఐటి రామయ్య’ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ చుక్కా రామయ్య గారి ప్రతిభ సమత్వం అనే పుస్తకాన్ని మార్తినేని మమత సభకు పరిచయం చేసారు. ప్రాధమిక విద్య మాతృభాషలో వుండాలి అని నమ్మినవారిలొ అయన ఒకరు. ఈ పుస్తకంలో ప్రధానంగా- విద్యను వ్యాపారంగా మార్చకూడదు, విద్యను ఆర్ధిక, వర్ణ, వయో, లింగ భేదాలు లేకుండా అందరికి సమానంగా అందించాలి. సమతుల్యం లోపించినప్పుడు అగాధాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది అని రామయ్య గారు వివరించారు అని తెలియచేసారు.

ఇక, ఇయ్యుని శ్రీనివాస్ గారు పాడిన ‘ఎలా ఈ మధుమాసం’ అనే సినారే గీతం, ఇతర లలితా గీతాలు, ప్రభోధగీతాలు మరియు మంగళ గీతాలు అందరి మనసులను అలరి౦చాయి. వీటికి వాద్య సహకారం మహాభాష్యo సాయి రాజేష్ గారు అందించారు.

 

ముఖ్యఅతిథి శ్రీ మాడ దయాకర్ గారిని సమన్వయ కర్త బిళ్ళ ప్రవీణ్ వేదిక పైకి ఆహ్వానించగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు మరియు పూర్వ సాహిత్య వేదిక సమన్వయ కర్త కన్నెగంటి చంద్ర గారు పుష్ప గుచ్ఛముతో సత్కరించారు. శ్రీ మాడ దయాకర్ గారు కవి కాళిదాసు యొక్క కవితా వైభవము అనితరమని ఆయన కావ్య పరిమళాలు ఖండాంతరాలలో వ్యాపించాయని వివరించారు. కాళికాదేవి మహిమతో సాదారణ కాళిదాసు ఎలా విద్వాంసుడిగా మారారో వివరించి, కాళిదాసు కావ్యాలలోని వాగర్ధ శోభను, అలంకార వైభవాన్ని చాటే శ్లోకాలను, వాటి వెనకున్న అర్ధాలను,కథలను భావయుక్తంగా వినిపించారు. మేఘసందేశపు కథని, కథనాన్ని అందులో నిగూఢమయిన ఎన్నో విశేషాలను వినిపించి మురిపించారు. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నది ఎంతో అర్ధవంత మయినదనీ, అందులోనూ ‘అభిజ్ఞాన శాకుంతలం’ కడు రమణీయమయినదనీ చెబుతూ, కాళిదాసు కవిత్వ సారమంతా ఈ ఒక్క కావ్యం చదివినా అవగతమవుతుందని, అంత సమయం లేకపోతే అందులో నాలుగవ అంకం చదివినా అదీవీలవకపోతే అందులోని నాలుగవ అంకం లోని నాలుగు శ్లోకాలు చదివినా ఆ రమణీయత అర్ధమవుతుందని చెప్పారు. రాగ యుక్తంగా శ్లోకాలను ఆలపించి వాటి అర్ధాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించిన విధానం ఆహుతులని కట్టి పడేయడమే కాకుండా, తాము విన్నది ఒక సంస్కృత కవి గురించి కాక, ఒక సుపరిచిత తెలుగు కవి కవితా పరిమళమేమో అని అబ్బుర పరిచింది.

 

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలలనుండి ఎంతోమంది వీక్షించారు. అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ‘టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు’ ఏప్రిల్ 16న ఇర్వింగ్ హైస్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు.

 

సాహిత్య వేదిక సభ్యులు డా. కలవగుంట సుధ మరియు మార్తినేని మమత ముఖ్య అతిథి శ్రీ మాడ దయాకర్ గారిని గారిని శాలువాతో మరియు సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణవేణి శీలం, కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గ సభ్యులు తోట పద్మశ్రీ, పాలేటి లక్ష్మి, పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, మార్తినేని మమత, దిండుకుర్తి నగేష్, వరిగొండ శ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ న్యూస్, 6టీవీలకు కృతఙ్ఞత తెలియజేసారు.