నిధుల సేకరణలో తానా రికార్డు…ఒక్కరోజులో 16 లక్షల డాలర్ల విరాళాలు

1323

డిట్రాయిట్ మహానగరంలో 2015 జూలై 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న తానా మహాసభలను పురస్కరించుకుని డిట్రాయిట్ లో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ సమావేశానికి అద్భుత స్పందన వచ్చింది. దాదాపు 1.6 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. ఇంతకుముందెన్నడూ అమెరికాలో ఏ తెలుగు సంస్థ ఒక్కరోజులో ఇంత విరాళాలను సేకరించలేదు. స్థానిక సెయింట్ తోమా హాలులో జరిగిన ఈ సమావేశానికి 600 మందికిపైగా తానా అభిమానులు, తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీమతి గద్దె పద్మజ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. 

తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ఉపాధ్యక్షుడు జంపాల చౌదరి, బోర్డ్ చైర్మన్ నరేన్ కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి, మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, యడ్ల హేమ ప్రసాద్, ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు గోగినేని, కోశాధికారులు మధుతాతా, సాగర్ మలిసెట్టితోపాటు ఇతర నాయకులు సుబ్బారావు కొల్లా, అంజయ్య చౌదరి లావు, యుగంధర్ యడ్లపాటి, నిరంజన్ శృంగవరపు, హరీష్ కోయ, శ్రీనివాస్ జరుగుల, పూర్ణ వీరపనేని, వాసు దేవరెడ్డి చిన్న, హేమ కానూరు, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రవి పొట్లూరి, గౌతమ్ గుర్రం, రాజేష్ అడుసుమిల్లి, రావు యలమంచిలి తదితరులను తానా కార్యదర్శి సతీష్ వేమన అందరికీ పరిచయం చేశారు.tana-has-made-an-historic-record-within-one-day-fundraising-$1-6-million-us-dollars

అధ్యక్షుడు మోహన్ నన్నపనేని మాట్లాడుతూ, డిట్రాయిట్ ప్రజలతో తానాకు మంచి సంబంధం ఉందని గుర్తు చేస్తూ, తానా 20వ మహాసభలకు మరోసారి ఆతిధ్యమిస్తున్న డిట్రాయిట్ ప్రజలకు, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ తదితర సంస్థలకు ధన్యవాదాలు చెప్పారు. తానా సంస్థ ఫౌండేషన్, టీమ్ స్క్వేర్ ద్వారా తెలుగు ప్రజలకు నిరంతరం చేస్తున్న సేవలను సభికుల హర్షధ్వానాల మధ్య వివరించారు. సభకు అతిధులుగా సీనియర్ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర, సిపిఐ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. తానా తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ప్రత్యేకించి హుదూద్ తుపాన్ బాధితులకు చేసిన భారీ సహాయాన్ని ధూళిపాల నరేంద్ర ప్రశంసించారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా తానా సేవలను గుర్తు చేస్తూ సమావేశాలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉదయ్ కుమార్ చాపలమడుగు తనదైన శైలిలో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగి, సుమారు గంటన్నర వ్యవధిలో ఎన్నడూ ఊహించని రీతిలో 1.60 మిలియన్ డాలర్లకుపైగా నిధులను సేకరించింది. ముఖ్య దాతలు కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ 100,000, పూర్వపు డిట్రాయిట్ పూర్వవాస్తవ్యులు వరప్రసాద్ పొట్లూరి 100,000 డాలర్లు, దుర్గా ప్రసాద్ గద్దె 51,116 డాలర్లు, ఇతర ప్రముఖులు ఎన్.టి. చౌదరి 50,000 డాలర్లు, శ్రీనివాసన్ గోనుగుంట్ల 25,000 డాలర్లు, నవీన్ ఎర్నేని 25,000 డాలర్లు, వినోద్ కుకునూర్ 25,000 డాలర్లతోపాటు అనేకమంది పెద్దమొత్తాలలో విరాళాలు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తానా నాయకలు కూడా అక్కడికక్కడే 470,000 డాలర్ల విరాళాన్ని ప్రకటించి తమ సహకారాన్ని, విధేయతను చాటారు. ఇంత స్వల్ప వ్యవధిలో రికార్డు స్థాయిలో నిధులను సమీకరించినందుకు కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ గంగాధర్ నాదెళ్ళను తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అభినందించారు. డిట్రాయిట్ సంస్థకు నిధులిచ్చిన దాతలకు తన కృతఙతలు తెలిపారు. కెనడా నుంచి కాలిఫోర్నియా వరకు ఉత్తర అమెరికా అన్నీ మూలల నుంచి వచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తానా నాయకులకు, సభ్యులకు మోహన్ నన్నపనేని ధన్యవాదాలు తెలియజేశారు.

గంగాధర్ నాదెళ్ళ మాట్లాడుతూ, మహాసభల నిర్వహణకు ఉదారంగా స్పందించి విరాళాలు అందజేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. చక్కని చిరస్మరణీన తానా కాన్ఫరెన్స్ నిర్వహణకోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్ల సహకారంతో మహాసభలను విజయవంతం చేస్తామన్నారు. నిధుల సేకరణ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేష్ పుట్టగుంట, నవీన్ ఎర్నేని దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాన్ఫరెన్స్ కార్యదర్శి శ్రీనివాసరావు గోగినేని అనేక ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలను లెక్కచేయకుండా వచ్చిన తానా నాయకులకు, సమావేశానికి వచ్చిన వారందరికీ కృతఙతలు చెప్పారు. 

సమావేశం ప్రాంగణాన్ని అందంగా అలంకరించిన శ్రీవాణి కోనేరు, జ్యోతి మారుపూడి, ఆడియో సమకూర్చిన శ్రీనివాసరాజు, ఫోటోగ్రఫీకి సహకరించిన సునీల్ కోనేరు, కోటి, కల్చరల్ కమిటీ మనోరమ గొంది, ఆహార కమిటీ నరహరి కొడాలి, శివాజీలతో పాటు చట్నీస్, నమస్తే, ఫ్లేవర్స్ రెస్టారెంట్లు ఈ సమావేశం విజయవంతానికి తమ వంతుగా సహకారాన్ని అందజేశాయి. యువ గాయనీగాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ మధుర గీతాలతో ఆకట్టుకోగా, మిమిక్రీ రమేష్ తన హాస్యచతురతతో అందరినీ నవ్వించారు. అంతకుముందు బాంక్వెట్ హాల్ లో జరిగిన తానా నాయకులు, కాన్ఫరెన్స్ కమిటీ నాయకుల పరస్పర పరిచయ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. కో ఆర్డినేటర్ గంగాధర్ నాదెళ్ళ, అనుభవశాలులైన నాయకులను ఒక్కొక్కరినీ పరిచయం చేయగా, ప్రస్తుత కమిటీ నాయకులు ఆసక్తితో వారి సలహా, సూచనలను విన్నారు. ముఖ్యంగా జంపాల చౌదరి, చిలుకూరి సతీష్, జయరాం కోమటి, హనుమయ్య బండ్ల, మురళీ వెన్నం, చలపతి కొండ్రకుంట, జయశేఖర్ తాళ్ళూరి, నరేన్ కొడాలి, సతీష్ వేమన తదితరులు కాన్ఫరెన్స్ నిర్వహణపై చర్చించారు.

తానా ప్రాంతీయ ప్రతినిధి జోగేశ్వరరావు పెద్దిబోయిన, డిటిఎ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేణు సూరపరాజు, గోనుగుంట్ల శ్రీనివాసన్, ద్వారకా ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. వీరందరికీ కాన్ఫరెన్స్ కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపి, సమష్టిగా పరస్పర సహకారంతో పనిచేసి సభలను జయప్రదం చేస్తామన్నారు. తరువాత అందరూ కలిసి మహాసభలు జరిగే డిట్రాయిట్ నగరంలోని కోబో హాల్, క్రౌన్ ప్లాజా, మారియట్ హోటల్స్ ను చూసి సమావేశాల ఏర్పాట్లపై చర్చంచారు. ఈ సమావేశాల తరువాత సభలు విజయవంతమవుతాయన్న నమ్మకం కలిగిందని మోహన్ నన్నపనేని, గంగాధర్ నాదెళ్ళ సంతోషంగా చెప్పారు.