***టెక్సాస్ లో ఈటీవీ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే *** నాట్స్, పీపుల్స్ టెక్ మద్దతుతో ఘనంగా నిర్వహణ ***

2091

ఇర్వింగ్, టెక్సాస్: ఆగస్ట్ 8:  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో పీపుల్స్ మీడియా వారి సహకారంతో గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు సమర్పించిన ఈ-టీవీ

‘పాడుతా తీయగా’ కార్యక్రమం 2015 లో భాగంగా తుది పోరు  (ఫైనల్స్ ), అంతిమ పోరు ( గ్రాండ్ ఫినాలే ) ని ఈ శనివారం , ఆదివారం (ఆగస్ట్ 8,9 తేదీలలో) , ఇర్వింగ్,టెక్సాస్ లోని మెక్ ఆర్థర్ హైస్కూల్ లో నిర్వహిస్తున్నారు.

 

చాలా ఏళ్ళుగా భారతదేశంలో విజయవంతంగా నిర్వహిస్తూ, ఎందరో ఔత్సాహికులైన కళాకారులను వెలికి తెచ్చిన ఘనత ఉన్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని,  గత రెండేళ్ళుగా, ఈ టీవీ వారు అమెరికాలో కూడా నిర్వహిస్తూ ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులలో కూడా మేటి వారిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నారు

 

గత కొద్ది నెలలుగా అమెరికా లోని అన్ని పెద్ద నగరాలలో 13 నుండీ 16 ఏళ్ల మధ్య పిల్లలకు జరిగిన పోటీలలో నెగ్గిన బాల బాలికలు శనివారం జరిగిన తుది పోరులో తలపడ్డారు. ఈ  కార్యక్రమం లో న్యాయ నిర్ణేతలుగా బాలు గారితో పాటు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి  పట్నాయక్, ప్రసిద్ధ గాయకుడు మనో వ్యవహరించారు

padutha-teyaga-2015-grand-finale-in-texas

సంప్రదాయ రీతి, మధుర గీతాలు, ఉల్లాస భరిత గీతాలు అనే మూడు విభిన్న అంశాలలో అత్యంత ఆసక్తికరంగా సాగిన పోటీలో అయిదుగురు చిన్నారులు తమ గానలహరి తో ప్రేక్షకులను పరవశింప  చేసారు. న్యాయ నిర్ణేతలు తమ చక్కటి విశ్లేషణతో పిల్లలను ప్రోత్సహిస్తూనే వారికి సాధన ద్వారా తమ గాత్రాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు తగిన సూచనలు చేసారు.

 

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం లో  బాలు గారు, కార్యక్రమ ఉద్దేశ్యాన్ని , పోటీ నియమ నిబంధనలను ప్రేక్షకులకు వివరించారు. తదుపరి బాలు గారు కార్యక్రమ స్పాన్సర్స్ ను పరిచయం చేసి పోటీని ప్రారంభించారు.

మొదటి పోటీ సంప్రదాయ సంగీతం లో   త్యాగయ్య , అన్నమాచార్యులు , ఇతర వాగ్గేయకారుల  గీతాలను పాడి అలరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన రెండవ అంకం లో .పది పదిహేనేళ్ళ క్రితం చిత్రాలలోని మధుర గీతాలను మనోహరంగా ఆలపించారు. న్యాయ నిర్ణేత మనో, సంగీత  దర్శకులు ఆర్ పి  పట్నాయక్ తమ విశ్లేషణ లో అమెరికాలో పెరుగుతూ ఇక్కడ గురువుల వద్ద శిక్షణ పొందుతూ మనోహరంగా గానం చేస్తున్న చిన్నారులను అభినందించారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన మూడవది, చివరి అంకంలో హోరా హోరీ  గా జరిగిన పోటీలో ఫాస్ట్ బీట్ పాటలు పాడి తాము ఎలాంటి పాటలైనా పాడి మెప్పించగలమని నిరూపించారు. రసవత్తరంగా ముగిసిన ఈ తుది ఘట్టం చివర ఎవరు గెలుపొందుతారో అని అందరిలో ఉత్కంఠ  కలిగించారు.

 

కార్యక్రమం మధ్య మధ్య,  బాలు గారు, మనో గారు చేసిన చమత్కార సంభాషణ హాస్య గుళికల వలె ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. మనో గారి హరిశ్చంద్రోపాఖ్యానం ఇతర నాటక పద్యాలు రక్తి కట్టించాయి.

 

రేపు ఆదివారం జరగబోయే అంతిమ పోరు లో  శనివారం నెగ్గిన నలుగురు పిల్లల మధ్య పోరు మరింత హుషారుగా , పోటా పోటీ గా ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు.  డల్లాస్, పరిసర నగరాలలోని తెలుగు ప్రజలు ఆదివారం కార్యక్రమానికి హాజరై ఈ రియాల్టీ షో ని కనులారా తిలకించే సదవకాశాన్ని  వినియోగించుకోవలసిందిగా  ‘నాట్స్’ వారు కోరుతున్నారు.