పద్మ విభూషణ్ బాల సుబ్రహ్మణ్యం గారితో నా అనుభవాలు

1504

ఆయనని చూడటం సంతోషం, ఒక ఫోటో తీసుకోవటం భాగ్యం, మాట్లాడటం అదృష్టం, మరి వారం రోజుల పాటు ఆయనతో ప్రయాణం? ఏమని చెప్పను, ఒక్క మాటలో అది నా మహాభాగ్యం .

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారి పేరు వినని వారు గానీ , అయన పాట వినని తెలుగువారు గానీ వుండరు. వారితో ఒక వారం రోజులు వుండి సేవలు చేసే మహాభాగ్యం మాకు దక్కింది.

నాతో బాలు గారు పంచుకున్న, నేను తెలుసుకున్న కొన్ని విశేషాలను మర్చిపోకుండా మరియు స్నేహితులతో, ఆప్తులతో పంచుకోవాలని ఇక్కడ వ్రాస్తున్నాను –

1) సమయ పరిపాలన (Time Management) – సమయానికి అయన ఇచ్చే విలువ అనిర్వచనీయం. కార్యక్రమం ఉదయం 11గం , కానీ వారు ఉదయం 9:30 గం లకే వేదిక దగ్గరికి వచ్చి అక్కడే అల్పాహారాన్ని కూడా తీసుకున్నారు. చివరి నిమిషం లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియవు కదా, అందుకే ముందు రావాలి అని చెప్పారు. ఉదాహరణగా చాలా రోజుల క్రింద జరిగిన ఒక సంఘటనని కళ్ళకు కట్టినట్టు చెప్పారు – దీదీ (లతా మంగేష్కర్ గారు) ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమ ముఖ్య నిర్వాహనాధికారి వచ్చి అందరు రావటానికి కొంచెం సమయం అవుతుంది కాబట్టి ఒక 30 నిముషాలు ఆలస్యంగా మొదలుపెడదాం అంటే 5 నిముషాలు ముందే కార్యక్రమం మొదలు పెట్టి, భారతీయులందరికీ సమయ పాలన లేదని ఎవరూ అనుకోకూడదు అని చెప్పారంట.

2) కార్యదక్షత(Dedication) – చేసే పని మీద శ్రద్ద చాలా అవసరం అని తెలుసుకోవటానికి ఆయనతో కొంచంసేపు వుంటే చాలు. ఎంతో పని ఒత్తిడితో ప్రయాణం చేస్తూ కూడా ఆయన తమతో ప్రయాణించే recording studio తెచ్చి సమయం దొరికినప్పుడల్లా ఒక పాట రికార్డు చేస్తున్నారు. ఈ మైక్ కావాలి, ఈ రికార్డింగ్ మిక్సర్ కావాలి అని లేదు, ఏది సమయానికి అందుబాటులో వుంటే దానితో పని చేస్తారు. నేను నేర్చుకున్న విషయం – చెయ్యాలి అనే తపన వుంటే చెయ్యొచ్చు, చెయ్యలేకపోవటానికి కావాలి కారణాలు .
3) జ్ఞాపకశక్తి / విషయ పరిజ్ఞానం (Memory & Knowledge) – ఇది నేను చెప్పనవసరంలేదు, మీ అందరికీ తెలుసు బాలు గారి విషయ పరిజ్ఞానం గురించి, అయన చెప్పే విషయాలను అలా అలా పైపైన చెప్పరు, ఎప్పుడో జరిగినదానిని కూడా నిన్ననే జరిగినట్టు గుర్తుంచుకుని చెప్తారు. నేననుకుంటున్నాను “మంచి విషయాలని అప్పుడప్పుడూ చెప్పుకుంటే, తలచుకుంటూ వుంటే ఎప్పటికీ మరచిపోము” అని.

4) దైనందిక ప్రణాళిక (Day to Day Planning) – ఈరోజు వీరితో మాట్లాడాలి, ఇది చదవాలి, ఎవరినో రమ్మని చెప్పాను, వాళ్ళు ఇన్ని గంటలకు వస్తారు, ఇన్ని గంటలకు ఇక్కడికి వెళ్ళాలి ఎవరితో వెళ్ళాలి – అనే ప్రతి విషయం లోకూడా ఎంతో స్పష్టత. ఎప్పుడో ఎక్కడో చదివాను “ఆ కంపెనీ అధికారి ప్రతిరోజు ఆ రోజు చెయ్యవలసిన పనులను ప్రతి రోజు చూసుకుని ఆ రోజు మొదలుపెడతారు మళ్ళి రేపటి రోజు ఏమి చెయ్యాలి అని చూసుకుని పడుకుంటారు” అని, అది ఇక్కడ ప్రత్యక్షంగా చూసాను.

5) నేర్చుకోవటం (Learning Everyday) – కారులో వెళ్తూ, వస్తూ చక్కగా సందర్భానుసారంగా ఒక పాట పాడి, ఆ పాట వెనుక వున్న సంఘటన, రికార్డు చేసిన నేపధ్యం, ఆ పాట రచయిత దగ్గర నేర్చుకున్న విషయాలు చక్కగా వివరించేవారు. అందరికి అన్ని తెలియవు, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ వుండాలి , తెలియకపోతే తెలిసినవాళ్ళని అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు.

చాగంటి కోటేశ్వర రావు గారి గురించి, సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి, ఇళయరాజా గారు, కమల్ హాసన్ గారు, జంధ్యాల గారు, పి వి నరసింహారావు గారు, జానకమ్మ, సుశీలమ్మ, వాణి జయరాం గారి గురించి, లతా మంగేష్కర్ గారి గురించి, ఇంకా చాలా స్నేహితుల గురించి అయన అనుభవాలను పంచుకున్నారు.

ఒకసారి నడుస్తూ వుంటే (లాస్ ఏంజెల్స్ నగరం లో) ఎదురుగ వచ్చిన వ్యక్తి ‘హలో’ అన్నారు, బాలు గారు కూడా ‘హలో’ చెప్పి – ఇక్కడ చక్కగా పలుకరించుకుంటూ ఉంటారండి అన్నారు. ఇది అయన సునిశిత గ్రహణ శక్తికి నిదర్శనం, ఎదుటివారికి ఇచ్చే విలువలకి నిదర్శనం.

బాలు గారితో మాట్లాడుతూ వుంటే, ‘అయన’ కుటుంబం, పిల్లలు, ఎవరూ గుర్తుకు రారు ఎందుకో తెలుసా ? మాట్లాడినంతసేపు ఆయన మన కుటుంబంలో కలసిపోతారు కనుక. మేఘాలు వస్తూ పోతూ వుంటాయి, మనం వాటిని చూసి ఆనందించగలం అంతేకాని వాటిని పట్టుకుని ఉండలేం, “గంధర్వులు అంటే భూమికి దగ్గరగా తిరిగే దేవతలు అని విన్నాను” కానీ బాలు గారు మనకోసం దిగివచ్చిన, పాటల మేఘాలను భూమికి తెచ్చిన, సంగీతానికీ వన్నె తెచ్చిన
“గాన గంధర్వుడు”

పోదున్నే ఒక విషాదకరమైన వార్త ‘కలాం గారు పైలోకాలకు వెళ్లి పోయారు” అని – బాలు గారు చాలా బాధ పడి, అయన కాకపోతే ఇంకెవరు పైలోకాలలో సంతోషంగా వుంటారు అన్నారు. కలాం గారితో అయన అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.

ఇంకా చెప్తూ పోతే అంతులేదు బాలు గారితో ఒక వారంలో నేర్చుకున్న, తెలుసుకున్న విషయాలు, మరువలేని విశేషాలు ఎన్నెన్నో ……….

telugu community news - SPB