శాక్రమెంటో లో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో మాటా మంతి

1358

అమెరికా లో ఉన్న శాక్రమెంటో నగరం  చుట్టుపక్కలనున్న తెలుగు సాహిత్యాభిమానులకి ఇనాక్ గారి రచనలు పరిచయం కోసం ఒక వేదికని అందించడానికి “టాగ్స్”  ముందుకు వచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) నిర్వహించిన “పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో మాటా మంతి” కార్యక్రమం  ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది.  స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న రుచి రెస్టారెంట్ లో ఆదివారం  జూన్ 11 వ తేది 2017  సాయంత్రం 6 గం కు  మొదలైన “పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో మాటా మంతి” కార్యక్రమం  రాత్రి 10 గం వరకు కొనసాగింది.

ఇనాక్ గారు తమ భాషా రుచులను, సంస్కృతీ మధురిమలను స్థానిక  సాహిత్య ప్రియులు, కళాపిపాసులు తో  ఆత్మీయ విందు లో కలిసి పంచుకున్న సందర్భం కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో లో ఆవిష్కృతమయ్యింది. ముందుగా గత వారం పరమపదించిన ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత డా సి. నారాయణరెడ్డి కి అంజలి ఘటించడంతో కార్యక్రమం ఆరంభం అయ్యింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలను, ఆయనతో తనకు ఉన్న సాహిత్య  అన్నదమ్ముల  అనుబంధాన్ని ఇనాక్ గారు సోదాహరణంగా  వివరించారు. పిదప మాధవి బైరా “ఇనాక్ గారి మీద కవిత” తో స్వాగత వచనాలు  పలికి  అందరినీ అలరించారు.  తదుపరి ఇనాక్ గారు  తన తెలుగు నవలలు, కవితలు, నాటకాలని స్థానిక  సాహిత్య ప్రియులకు  పరిచయం చేశారు. కన్నీటి గొంతు, అనంత జీవనం,  ముని వాహనుడు నాటకం తో పాటు ఇనాక్ గారి పలు రచనల మీద చర్చ, సందేహ నివృత్తి జరిగాయి. ఈ సందర్భంగా ఇనాక్ గారు మాట్లాడుతూ మాతృభాషా గొప్పదనాన్ని సభికులకు వివరించారు. తెలుగు కవి వేమన పై తనకున్న ప్రేమను, అభిరుచిని అత్యంత ఆకర్షణీయ మైన శైలిలో ఆయన అభివ్యక్తీకరించారు.  తెలుగు భాషను తరువాతి తరాలకు అందించే కార్యక్రమాన్ని ముందు ఇంటినుండి ఆరంభించడం ద్వారా శాక్రమెంటో   స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని ఆయన  నొక్కి చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి “తెలుగు సాహితీ పుత్ర” బిరుదును వారికి ప్రదానం చేశారు.
 
టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం మాట్లాడుతూ, 60 ఏండ్ల కు పైగా తెలుగు సాహిత్యంతో ప్రయాణం చేసిన  పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు రెండవసారి  శాక్రమెంటో పర్యటనకు  రావడం మనమంతా చేసుకున్న అదృష్టమని, ఈ సందర్భంగా  జూన్ 17న “ఇనాక్ గారితో మాటా మంతి” ప్రత్యేక ముఖాముఖి  కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందని చెప్పారు.  ఈ రోజు  సాయంత్రం నాలుగు గంటల పాటు   ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగంతో పాటు, డా సి నారాయణరెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఇనాక్   గారి సాహితీ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆసక్తిగా  తెలుసుకోవడం కోసం  విదేశాలలో ఇంత సమయం పాటు జరిగే కార్యక్రమం అరుదైన విషయమని, అందుకు కారణమైన ఇనాక్ గారికి,  విచ్చేసిన  తెలుగు సాహిత్యాభిమానులకి వారు ప్రత్యేక కృతఙ్ఞతలు  చెప్పారు.

సభ కు హాజరు అయిన ప్రతిఒక్కరూ సి నారాయణరెడ్డి, వేమన, ఇనాక్ గారి రచనలపై  అడిగిన పలు ప్రశ్నలకు తన అనుభవాన్ని రంగరించి ఇనాక్ గారు సమాధానం చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాలుగు  గంటల పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ  మాటా మంతి  ఆనంద సందోహంగా, ఆత్మీయ సంగమంగా, ఇనాక్ గారి సాహితీ  గమనంలో మరుపురాని మైలు రాయిగా మిగిలి పోయిందనడం లో సందేహం లేదు.  టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం సభకు సంధానకర్తగా వ్యవహరించారు. స్థానిక రుచి రెస్టారెంట్ వారు పసందైన విందుభోజనాన్ని అందించారు. టాగ్స్ అధ్యక్షులు మనోహర్ మందడి వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో ఇనాక్ గారితో మాటా మంతి కార్యక్రమం  విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు  టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు. టాగ్స్ కార్యవర్గ సభ్యుడు నాగ్ దొండపాటి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు.