బాపూ రమణార్యశ్చ..

1508

తెలుగుదనం అంటే ఇదర్రా, సొగసు అనేమాటకి అర్ధం ఇదర్రా, లావణ్యం అంటే ఇదర్రా, తెలుగమ్మాయంటే ఇలా వుంటుందర్రా, బుడుగావతారము, పరివారమూ ఇల్లా వుంటార్రా, వాడి గల్రుఫెండు ఇల్లా వుంటుందిరా అని రాసి చూపించారు రమణ. చదివే ఓపిక, అదృష్టం వున్నవాళ్ళు చదివారు, అనందించారు, కాలరెగరేసారు. వీళ్ళెందుకు కాలరెగరేస్తున్నారో తెలియక కనవా జనం కంగారు పడిపోయారు. వాళ్ళని గీతాచార్యుడు కాపాడాడు. తూగోజి రాతకి పాగోజీ గీత తోడైంది. నా సామిరంగా, పెతీ వోడిలోనూ కలాపోసన మొదలైపోయింది. అమ్మాయిలంతా బొమ్మాయిలై చెట్టెక్కేసారు. వేలాడే జడ కుచ్చులందుకోడం కోసం గోపాళాలు, బాబాయిగాళ్ళూ స్టాండేసిన హెర్క్యులస్ సైకిలెక్కేసారు. నిచ్చ కల్యాణం పచ్చతోరణమైపోయింది తెలుగు ప్రాంతమంతాను.

telugu community news mana-bapu-ramana

“రామ రాజ్యంలో ఇల్లాగే వుండేదోయ్” అన్నారు బాపు. “రామ రాజ్యమనగా నేమి?” అన్నారు కళాపోసకులు. “హన్నా, తప్పుకదూ. సంపూర్ణరామాయణం చూళ్ళేదూ? సీతా కల్యాణానికి వెళ్ళలేదూ?” అన్నారు రవణ. “చూసాం కానీ, చాలా రోజులైంది దొరా” అన్నారు కలాపోసకులు. అంచేత వీళ్ళకి బుర్రకెక్కేట్టు మళ్ళీ తీసారు. “అబ్బో సూపరు, ఇలా చెబితే ఎందుకు తెలీదూ? రామ రాజ్యవంటే మా “సంగీతమ్మ” ఇల్లు, కుటుంబమే గందా” అనోసారి, సీతారాములంటే మన రాజేంద్రప్రసాదూ, దివ్యవాణి అని ఒకసారి, విష్ణుమూర్తి, లచ్చింతల్లి అంటే మళ్ళీ రాజేంద్రప్రసాదూ, ఆమనీ అనిన్నీ అనేసుకున్నారు జనం. అలా జనాలకి రామకథ చెప్పి, మెప్పించి, ఒప్పించిన జంట మాయవైపోయింది. ముందు ఓ పక్షిని కొట్టేసింది విధి. జంట కోసం పరితపించి ప్రాణాలు విడిచేసింది మిగిలిపోయిన పక్షి. రామాయణానికి ఇదే మొదలు. బాపూరమణీయానికిదే ఆఖరు.

బాపు వెళ్ళిపోయారు. అతిసామాన్యుడిగా జీవితం గడిపిన అసామాన్యుడు వెళ్ళిపోయాడు. మూస శృంఖలాలను తెంచి తెలుగు సినిమాకు స్వాతంత్ర్యం తెచ్చిన మరో “బాపు” వెళ్ళిపోయారు. ఆయన సినిమాలు సుమారుగా అన్నీ చూసేసాను. అయితే ఆయన్ని ప్రత్యక్షంగా చూడ్డం 1996 లోనే. అంతకుముందెపుడో వంశం వృక్షం సినీమా వర్కింగ్ స్టిల్ లో అనిల్ కపూర్ తో చూసిన ఫొటో ఒకటి గేపకం వుంది. అలాగే వుంటారులే అనుకున్నా. అట్లాంటాలో మేము చేసే “సాహితీ సదస్సు” కు వచ్చారు. మా పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అధ్యక్షులు. అన్నా, నేను మిగితా రాంబంట్లంతా “వాలం”టీర్లం. ఆయనతో బోలెడంతమంది పెద్దవాళ్ళు వస్తారు, చాలా వీజీగా గుర్తుపట్టచ్చని గుమ్మందగ్గరే కాపుకాసాం. ఎంతకీ రాలేదాయన. కార్యక్రమం మొదలెట్టే సమయం అయిపోయింది. మాకు టెన్షను మొదలైపోయింది. ఇంతలో ఎవరో వచ్చి చెప్పారు. “పెద్దాయన కోప్పడతారు సభ మొదలెట్టండి” అని. మాకు అర్థంకాలేదు. “ఆయన రావాలి కదండీ” అన్నాం ఆందోళనగా. “ఆయనొచ్చి అరగంటయింది, ఆఖరి వరసలో నాలుగో కుర్చీ” అని చెవిలో చెప్పేసి వెళ్ళిపోయారాయన.

అందరం నాలిక్కరుచుకుని లోపలికి పరిగెత్తాం. ఆయన్ని వేదికమీదకి రమ్మని ఆహ్వానించాం. ఆయన ఉన్నచోటే లేచి ఓ మాటు నించుని అందరికీ నమస్కారం చేసారు. చేతిలో చిన్న సంచీ, సాధారణమైన వస్త్ర ధారణ, చిన్నపిల్లాడి నవ్వూను. బాపు గారంటే ఈయనా? మరి అనిల్ కపూర్ పక్కన కేమేరాలోకి చూస్తూ నిలుచున్నాయన వేరేలా వున్నారే, అనుకుని, సంభాళించుకుని ఆయన్ని వేదికమీదకి రమ్మన్నాం. “నాకిక్కడే బావుంది” అన్నారు. అల్లా మారాం చేసిన మా రాములోరిని బతిమాలి బామాలి వేదిక ఎక్కించాం. “ఇప్పుడు బాపు గారు మాట్లాడతారు” అన్నాడు మా రాంబంటొకడు. ఆయన చిన్న నవ్వుతో, మైకు తీకుని, పక్కనేవున్న మా పెమ్మరాజువారిని చూపిస్తూ, “ఈయన బాగా మాట్లాడతారు” అనేసి మైకు ఆయన ముందుకు తోసారు. “మీరు మాట్లాడాలి” అని అందరం పట్టుబడితే, “ఆఖర్న మాట్లాడతాను” అన్నారు. సరే, ఇంక సాహితీ కార్యక్రమం జరిపించాము. బస్సులో కనపడ్డ బాబాయిగారికి, వెనక సీట్లో బుడుగు ఒకటినించి వంద దాకా అంకెలన్నీ చెప్పేసినట్లు, మా రచనలతో ఆయన్ని బాదేసాం. అన్నీ విని ఆయన ఓ నవ్వు నవ్వారు. చివర్లో మాట్లాడారు. ఆయన ఇచ్చిన “ఏక పద/వాక్య ముఖాముఖీ” ఆయన ప్రతిభకి తార్కాణం.

“మీకిష్టవైన దేవుడెవరండి?”
“రాముడు”
ఇలా మొదలై, ఎన్నో ప్రశ్నల అనంతరం, జనాలు విసుగొచ్చే మూస ప్రశ్నలు మొదలెట్టారు. వాటికి తిరుగులేని సెటైర్లతో సమాధానం చెప్పారు బాపుగారు. మచ్చుకి ఒకటి..
ఒకాయన సుమారు ఓ పావుగంట మాట్లాడి, ఆనక ప్రశ్న అడిగాడు.
“ఏవండీ, మీరు ఈ మజ్జెన తీస్తున్న భాగవతానికి స్క్రిప్టెవర్రాసారండీ?” అని.
“పోతన గారండీ” !!
సమాధానం విని హాలంతా గొల్లుమంది.
ఇలా అందరినీ నవ్వించి సెలవుతీసుకున్నారు. రాత్రి ఆయనతో డిన్నరుకి మమ్మల్ని ఎవరన్నా పిలిస్తే బావుణ్ణనిపించిందిగానీ, మన్నెవరు పట్టించుకుంటారు? అదీ ఆయనతో తొలి పరిచయం. ఆనక ఓ ఐదేళ్ళుపోయాకా, మా వూళ్ళో కొన్ని సినిమా డైరెక్షన్ కోర్సులు చేసి, అయనకి ఉత్తరం రాసాను, సినిమాలు తియ్యాలని వుంది, ఆశీర్వదించండి అని. నెల రోజుల తరవాత ఆయన చేతి వ్రాతతో ఉత్తరం వచ్చింది. డొక్కా సీతమ్మగారిని గుర్తుచేసుకుని, ఆవిడ గురించి రాసి, ఆనక అడిగారు మీకు వారేమవుతారు అని. అలాగే, ఈ మధ్యన వచ్చే చిన్ని కెమేరాలతో చిన్న చిన్న చిత్రాలు మొదట ప్రయత్నించమనీ, ఆనక పెద్ద సినిమాలు తియ్యచ్చనీ రాసి, ఆశీర్వదించారు. ఆ వుత్తరం గుండెల్లో దాచేసుకున్నాను.

ఆనక నా పల్లకీ పుస్తకానికి బొమ్మలు వేస్తారా అని అడిగాను. “భాగవతం” లో సూపరు బిజీగా వున్నారాయన, అందుకే కుదరదన్నారు. రవణ గారితో అన్నాను. “బాపుగారీమధ్యన చాలా బిజీగా వున్నారు నాన్నా.” అన్నారు రవణ గారు. మన ప్రాప్తం ఇంతే అని సరిపెట్టేసుకున్నాను.

అయితే, ఐదేళ్ళక్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఒక్కరోజుకోసం మద్రాసు వెళ్ళి మా రవణగారిని కలిసాను. నా అదృష్టం ఏవిటంటే, ఆరోజు హైదరాబాదులో షూటింగ్ కేన్సిల్ అవడం మూలాని, బాపుగారు కూడా ఇంట్లోనే వున్నారు. రవణగారు కేకేసారు. బాపుగారు వచ్చేసారు. ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడి, దాటేసే బాపుగారు ఆరోజు ఎంతో హాయిగా, సరదాగా మాట్లాడారు. బోల్డు జోకులు చెప్పి నవ్వింఛారు. ఆయన తన మీద ఇంటర్నెట్లో వచ్చిన ఒక జోకు చెప్పారు. శ్రీరామరాజ్యం షూటింగు జోకుట. బాపుగారు నయనతారతో అంటున్నారట ” అమ్మా, నువ్వు శ్రీరామ చంద్ర ప్రభూ” అంటే చాలమ్మా, “శ్రీరామచంద్ర ప్రభు దేవా” అనక్కర్లేదు..అని. అలాగే అమెరికాలో తెలుగు జెండా పట్టుకున్న వారిమీద బోల్డు సెటైర్లు, చురకలు వేసారు. డొక్కా సీతమ్మగారి గురించి మాట్లాడారు. ఇటు రవణ గారు, అటు బాపు గారు, నా జన్మ ధన్యవైపోయింది. మూడుగంటలు వేరేలోకంలో విహరించి వచ్చాను. వచ్చేముందు ఇద్దరికీ కాళ్ళకి దండంపెడితే “ఇందాకా చేసారు కదా..” అని ఇబ్బంది పడిపోయారు. అదే మొదలు, అదే ఆఖరు ఇద్దర్నీ జంటగా చూడడం. ఆనక రవణగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు బాపుగారూ ఫాలో అయిపోయారు.

ఎప్పటికైనా ఓ చిన్న సినిమా అయినా తీస్తే, వారికి చూపించాలని అనుకునేవాణ్ణి. ఇప్పుడేంచేద్దాం? సీత లేకపోతే స్వర్ణ సీతని చేసుకున్నాడుగా రాముడు. మన బాపు రమణలనే బంగారు తండ్రుల్ని, బంగారు బొమ్మలుగా చేసి, నా గుండె గుడిలో రాములోరి పాదాల దగ్గర, పావని పక్కనే పెట్టి అర్చన చేసుకుంటాను. పలికెడిది అయాంబాబుగారైనా, పలికించేది, నడిపించేదీ ఎప్పుడూ వారే.

బాపూ రమణార్యశ్చ స్వర్గాదపి గరీయసి !!