శనివారం, జనవరి 17 న లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి మేళ విజయ వంతగా నిర్వహించడం జరిగింది. ఈ మేళాకు సుమారు 1900 మంది లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాల నుంచి లాంగ్ బీచ్ జోర్డాన్ హై స్కూల్ కు వచ్చి ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. వరుసగా రెండో సంవత్సరం లాటా ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు చాలా వినోదభరితంగా జరిగాయి. ఈ సారి పలు జానపదరీతులు ప్రేక్షకులను అలరించాయి. మహిళలు మరియు ఇతర లాటా సభ్యులచే ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోయిన ఏడాది లాగానే ఈసారి నిర్వహించిన తిరునాళ్ళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆద్యంతమూ పండుగ వాతావరణం, అడుగడుగునా తెలుగుతనం ఉట్టిపడేలా జరిగిన ఈ మేళా అందరిని ఒక్కసారి వూర్లల్లో జరుపుకునే పండుగ జ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేసింది. తిరునాళ్ళ లో చిన్న పెద్ద తేడాలు మరిచి అందరు చాలా ఉత్సాహంగా వివిధ ఆట లలో పాల్గొన్నారు. ఈ తిరునాళ్ళలో పిల్లలకు ఫేస్ పైంటింగ్, గోరింటాకు అలంకరణ మరియు వివిధరకాల ఆటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ తిరునాళ్ళను చెరుకు గడలు, అరటి చెట్లు , ముగ్గులు మరియు బంతి పూలతో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. శ్రీహరి అట్లూరి గారి నేతృత్వంలో సంక్రాంతి మేళాలో ఇరవై మంది కి పైగా తెలుగు బాల బాలికలు తిరునాళ్ళ లో 10 స్టాల్స్ ని స్వచ్చందంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ కోచర్లకోట సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, లాటా వారి వివిధ కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. మేళాకు విచ్చేసిన అతిథులకు, దోసా ప్లేస్ వారు అరిశలు, పూతరేకులు మరియు పది రకాల వంటల పండుగ విందు భోజనాన్ని అందించారు.
ఆ తరువాత సాయంత్రం 6:00 నుంచి మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో లాస్ ఏంజల్స్ మరియు దక్షిణ కాలిఫోర్నియాలోని ప్రాంతీయ కళా కారులతో వివిధ కార్యక్రమాలను నిర్వ హించారు. తెలుగుతోట పిల్లలు ప్రదర్శించిన జడకోలాటం చూపరలను విశేషంగా ఆకర్షించింది. ఈ సాంస్కృతిక కార్య క్రమంలో 150 మంది కి పైగా ప్రాంతీయ కళాకారులు వివిధ ప్రదర్శనల తో ఆహ్వానితులను ఉర్రూతలూగించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకాంత్ కోచర్లకోట మరియు సమీర్ భవానిభట్ల గార్లు వాఖ్యాతలుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారిక జ్ఞాపికలను మరియు విజేతలకు స్పేస్ విషన్ వారు అందించిన ఉప్పాడ పట్టు చీరలను జాయింట్ సెక్రటరీ లక్ష్మి చిమట గారు బహూకరించారు. లాటా అధ్యక్షులు రమేష్ కోటముర్తి, ఉపాధ్యక్షులు రవి తిరువాయిపాటి అఖిల కేతిరెడ్డి మరియు అద్వైత్ కార్తిక్ లను Young Achievement Award లతో సత్కరించారు. తరువాత PMP ప్రోగ్రాంకు సహాయపడిన వారిని అలాగే ఉత్తీర్ణులైన వారిని ప్రశంసా పత్రములతో సత్కరించారు. చివరగా నవీన్ కాంత్ భాయి మరియు కృష్ణ సామంతుల గార్ల టీంలు చేసిన నృత్యాలు సభను ఉర్రూతలూ గించాయి. ఈ సందర్భంగా లాటా అధ్యక్షులు రమేష్ కోటమూర్తి లాటాకి ముగ్గురు నూతన బోర్డు సభ్యులు శ్రీహరి అట్లూరి , సురేష్ అయినంపూడి, విజయ భాస్కర్ నెక్కంటి లను సభకు పరిచయం చేసారు.
కార్యక్రమం చివరగా లాటా అధ్యక్షులు రమేష్ కోటముర్తి, ఉపాధ్యక్షులు రవి తిరువాయిపాటి , కోశాధికారి హరి మాదాల, ఉప కోశాధికారి శ్రీనివాస్ కొమిరిసెట్టి, కార్యదర్శి తిలక్ కడియాల, ఉప కార్యదర్శి లక్ష్మి చిమట గార్లు ఆహ్వానితులు మరియు ప్రేక్షకులకు తమ ధన్య వాదాలను తెలియ చేసారు. ఈ సందర్భంగా రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేటందుకు రాత్రింబగళ్ళు కష్ట పడిన వాలంటీర్స్ సేవలను కొనియాడారు. చివరగా కార్యక్రమాన్ని భారతీయ మరియు అమెరికన్ జాతీయ గీతాలతో ముగించారు.