ఘనంగా నృత్య మాధవి 6వ వార్షికోత్సవ వేడుకలు *** అమెరికాలో తొలిసారిగా లలితా పరమేశ్వరీ నృత్యరూపకం

1195

భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేస్తున్న నృత్యమాధవి గ్రూప్ ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.. న్యూజెర్సీలోని నార్త్ బ్రూన్స్ విక్ హైస్కూల్ లో ఆడిటోరియంలో జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో భారతీయ సంప్రదాయం ఉట్టిపడింది. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ పాడుకోవటమే కాకుండా.. తల్లి భారతి నేర్పిన సంస్కృతికి అద్దం పడుతూ ఈ వార్షికోత్సవంలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. నృత్యమాధవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో  కూచిపూడి నృత్యాన్ని అమెరికాలో చిన్నారులకు నృత్యమాధవి గ్రూపు నేర్పిస్తోంది. వీటితో పాటు విజువల్ ఆర్ట్స్, యోగా, వైదిక బోధనలు, భారతీయనృత్యం ఇవన్నీ లలిత కళా తోరణం అనే గొడుగుకిందకు తెచ్చి చిన్నారులకు నేర్పిస్తూ.. వారికి చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతిపై మక్కువ పెంచుకునేలా చేస్తోంది. కళ అనేది మనోవికాసానికి తోడ్పడుతుందని.. మనిషిలోని సృజనాత్మకతను వెలికితీస్తుందని ఎన్.ఎం.జీ మేనేజింగ్ డైరక్టర్ వేణు ఏలూరి ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసంలో అన్నారు.. నృత్యమాధవి గ్రూపు ద్వారా చిన్నారులు తమకిష్టమైన కళను నేర్చుకుంటున్నారని ఇది వారి మనోవికాసానికి, భారతీయ సంస్కృతి పరిరక్షణకు దోహద పడుతుందని ఆయన తెలిపారు. నృత్యమాధవి వార్షికోత్సవ సంబరాల్లో ఇతర పాఠశాలల విద్యార్ధులు కూడా పాలుపంచుకున్నారు. భరత నాట్యం స్కూల్ ఆఫ్ డ్యాన్స్ నుంచి కద్మ ఇందులో తన నాట్యాన్ని ప్రదర్శించారు. గెర్రీ ఫియానో,  ఉజ్వల్ వ్యాస్ గజల్స్ తో పాటు కొత్తగా నృత్యమాధవి స్కూల్ లో చిన్నారులు తమ ప్రతిభపాటవాలను ఈ వేదికపై చూపారు.
kuchipudi-dance-drama-lalitha-parameshwari-1 kuchipudi-dance-drama-lalitha-parameshwari-2 kuchipudi-dance-drama-lalitha-parameshwari-3 kuchipudi-dance-drama-lalitha-parameshwari-4
గురు దేవో భవ అంటూ ఈ వార్షికోత్సవం 50 మంది చిన్నారులతో  ఆది శంకర్యచార్యుని గురు అష్టాకంతో ప్రారంభమైంది.. నృత్య మాధవి స్కూల్  డైరక్టర్ నృత్య సేవా మణి శ్రీమతి దివ్యా ఏలూరి నేతృత్వంలో చిన్నారులు గురు అష్టాకానికి చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. దీంతో పాటు వీడలేరా వయ్యారాలు గీతానికి చేసిన నృత్యం అందరి మనసులను కట్టిపడేసింది.

అమెరికాల తొలిసారిగా లలితా పరమేశ్వరీ నృత్యరూపకాన్ని ఈ వార్షికోత్సవ వేదికగా ప్రదర్శించారు. కళా రత్న శ్రీమతి  ఎ.బి. బాల కొండలరావు నృత్య దర్శకత్వంలో  దాదాపు 60 మంది విద్యార్ధులు ఈ నృత్య రూపకంలో నృత్యం చేశారు. వీరితో  పాటు లలితా దేవిగా శ్రీమతి దివ్య ఏలూరి చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మొత్తం ఈ వార్షికోత్సవంలోనే  లలితాపరమేశ్వరీ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. కన్నులపండువగా జరిగింది.

లలితా సహస్ర నామ భాష్యంలోని వివిధరూపాలను  ఈ నృత్యరూపకం ద్వారా చూపారు. రాక్షసులకురాజైనా బండాసురుడినా శక్తిరూపంలో పార్వతీ ప్రతిరూపం లలితా పరమేశ్వరీ వధించడాన్ని ఇందులో చక్కగా ప్రదర్శించారు. ముఖ్యంగా శివ శక్తి ఐక్య రూపిణి లలితా దేవీ వచ్చే ఘట్టం.. అద్భుతంగా ఉంది. అజ్నానాన్ని జయించి విజ్నానం వైపు మనల్ని మళ్లీంచే అంతరార్ధం ఈ నృత్యరూపకం ద్వారా పరోక్షంగా చెప్పారు.

శ్రీమతి బాల కుమారుడైన ఆదిత్య అనుకుల రాక్షసరాజు బండాసురుడిగా అద్భుతంగా నటించారు. మన్మధుడిగా అక్షయ్ ఏలూరి, మాయ మోహినిగా అంజనా గోటేటి, చిన్న పార్వతీగా ఆషా ఏలూరి, కామేశ్వరీ దేవిగా శైలజా మేడిచెర్ల చేసిన ప్రదర్శనలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నృత్యరూపంలో ప్రతి ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. లలిత పరమేశ్వరీగా  దివ్య ఏలూరి చేసిన ప్రదర్శన వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు లేచి చపట్లతో అభినందించారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబొట్ల,న్యూజెర్సీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, మన టీవీ సీఈఓ శ్రీధర్ చిల్లర, హరి ఇప్పనపల్లి, రఘు శంకరమంచి, డాక్టర్  సిరికొండ తదితర ప్రముఖులు ఈ వార్షికోత్సవాలకు అతిధులుగా హజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి గ్రామంలో సంజీవని ఆసుపత్రికోసం లలిత కళా తోరణం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎన్.ఎం.జి డైరక్టర్ దివ్య ఏలూరి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల డాలర్లు సేకరించనున్నట్టు తెలిపారు. జయహో కూచిపూడి కార్యక్రమానికి విలువైన సేవలను అందిస్తున్న దివ్య ఏలూరికి సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబొట్ల అభినందించారు.