పండుగ వాతావరణంలోచక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతిధ్వనించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు ​

2044

అక్టోబర్ 25,2014, డాల్లస్ ఫోర్ట్వర్త్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), స్థానిక ఇర్వింగ్ హై స్కూల్లో పండుగ వాతావరణం సంతరించుకుని అత్యంత వైభవంగా నిర్వహించిన దీపావళి వేడుకలు ఆనందపు అంచుల మీద నుండి సంబరాల వాకిళ్ళలోకి దూకినట్లు అనిపించాయి. ఎటుచూసినా ఉత్సాహం , ఎనలేని సంతోషం , పెద్దలు చిన్న పిల్లలుగా , చిన్న వాళ్ళు చిచ్చర పిడుగులుగా మారి చేసిన అల్లరి డల్లాస్ నగరం అంతా ప్రతిధ్వనించింది అంటే అతిశయోక్తి కాదు.  మనసుకు నచ్చిన  విందు భోజనం చేసిన తర్వత , చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చూసే ఆ ఆనందమే వేరు. అందుకే ఎంతో ఇష్టంగా, ప్రేమ అనురాగాలతో  స్థానిక బావర్చి ఇండియన్ రెస్టారెంట్ వారి సహకారంతో, పసందైన విందు భోజన వడ్డన చేసి,  ఆహుతులను గౌరవించడంలో టాంటెక్స్ వారి తెలుగు సంప్రదాయాన్ని కొనసాగించారు.

 

సంస్థ అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల మరియు కార్యక్రమ సమన్వయ కర్త చిట్టిమల్ల రఘు ఆధ్వర్యంలో, స్వప్న రాగలీన వ్యాఖ్యాతగా వ్యవహరించాగా, సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి కార్యక్రమాలని నిర్వహించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన సుమారు 1000 మంది సమక్షంలో 200 మంది బాల బాలికలు, స్థానిక కళాకారులు మరియు భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన కళాకారులు ఉత్సాహంగా పాల్గొని వైవిధ్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.

Deepavali Vedukalu 2014_TANTEX Team TANTEX Deepavali Vedukalu 2014_Classical Dance TANTEX Deepavali Vedukalu 2014_Classical Dance2

విందు అనంతరం , సాంస్కృతిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద గారి ప్రారంభ ఉపన్యాసం తో ప్రారంభం అయిన దీపావళి వేడుకలు మొదట కాకరపువొత్తుల లాగ మొదలై , మతాబుల లాగ వెలిగి , చిచ్చు బుడ్డి లాగ మారి చివరకు రాకెట్లు గా అంబరాన్ని చేరుకొన్నాయి.

 

శిరీష ధర్మవరం ఆధ్వర్యంలో చిన్న పిల్లల “దీప పూజనం” , ఉప్పలపాటి కృష్ణ ఏర్పాటు చేసిన “గణేశ వందనం” , “చక్కని సినిమా పాటల”తో కార్యక్రమాలు మొదలయ్యాయి. రేఖ ఓరుగంటి చక్కని “డాన్సు మెడ్లీ” ప్రదర్శించారు.  సుమ జాన్సన్ “సప్తస్వరాలు” తమ నృత్యంలో ప్రదర్శించి అబ్బుర పరిచారు. ఆవుల కళ్యాణి కమ్మని అన్నమాచర్య కీర్తన – “ భావములోన” గానం చేయగా , శ్రీలత సూరి నేతృత్వములో  “శ్రీరంగ లహరి అనే పార్వతి దేవి స్తుతి” ప్రదర్శించారు. కృష్ణవేణి పుత్రేవు ఆధ్వర్యంలో “శ్రీరామ రాజ్యం” జానపద నృత్యం, గుడిమెల్ల స్వప్న “త్రిదేవి స్త్రోత్రం” తో కార్యక్రమానికి చక్కని రూపు తీసుకొచ్చారు. తరువాత  భారతదేశం నుండి విచ్చేసిన గాయకులు, నటులతో సందడి మరింత పెరిగింది . వర్ధమాన గాయకి  కుమారి మధు ప్రియ చక్కని జానపద గీతాలు పాడి  తెలుగు మట్టిలో మాధుర్యాన్ని , ఆ పల్లె గాలుల్లో పరిమళాన్ని పంచారు.  సినీ నటి , ఎన్నో సినిమాలలో నటించిన  పింకీ గారు,   జలసూత్రం చంద్రశేఖర్ తో ,  రవితేజ తో , నరేష్ , మాధురి లతో చేసిన కామెడీ స్కిట్స్ ఎంత గానో ఆకట్టు కొన్నాయి, ఆగడు చిత్రం నుండి భేల్ పురి పాటకు చేసిన నాట్యం కూడా ఎంతో ఆకట్టు కొంది. సినీ గాయకుడు దీపు మరియు నాగ సాహితి  చక్కని శాస్త్రీయ గీతాలతో , సినిమా పాటలతో అలరించారు. తదుపరి బంద రూప ధింతాన అనే నృత్యం ప్రదర్శించారు.

 

అధ్యక్షులు విజయ్ మోహన్ కాకర్ల గారు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. తన 2014 ముఖ్య సందేశాన్ని “కలుపుకుని పోవడం, కలిసి పని చేయడం, సంతోషంగా సాగటం’ మరొకసారి ఆహ్వానితులకు గుర్తు చేస్తూ, అనుకుని విజయవంతంగా గత మూడు నెలలలో చేసిన కార్యక్రమాల గురించి తెలుపుతూ మరియు తరువాత చేయబోయే కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుపుతఅందరి సహాయ సహకారాలు అందించమని విజ్ఞప్తి చేసారు. హుదూద్ తుఫాను  ప్రభావం పై విచారం వ్యక్తం చేసారు. ఎబోలా వైరస్ పై అవగాహన కలిగి ఉండాలని హెచ్చరించారు. తెలుగు జాతి విలువలు కాపాడేలా టాంటెక్స్ వారు ఎల్లప్పుడూ కృషి చేస్తారని , దీనిలో భాగం గానే ఈ సంవత్సరంలో 5 మంది ఉత్తమ తెలుగు విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు ప్రకటించడం జరిగినది. కళాశాల మొదటి సంవత్సరంలో ప్రవేసించబోవు టాంటెక్స్ యువతలో విద్యా సంబంధిత మరియు సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో అనుభవం, అనుబంధం తదితర అంశాలలో ప్రావీణ్యత ప్రామాణికంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ విజేతలైన లేఖా చిలకమర్రి, రమ్య చాగర్లమూడి, నీహారిక ములుకుట్ల, విశాల్ ఉసిరికల, శివతేజ పొన్నూరు లకు ఐదు వందల డాలర్ల నగదు మరియు ప్రశంసా పత్రాలను టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల చేతుల మీదగా అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ అందించారు.

 

టాంటెక్స్ వారు ఎప్పటిలాగానే తమ స్పాన్సర్ లను ఉచిత రీతిలో సత్కరించు కొన్నారు. ప్రతి ఒక్క స్పాన్సర్ లను పేరు పేరునా స్టేజి మీదకు పిలిచి, మెమేంటో లతో , పుష్ప గుచ్చాలతో సత్కరించారు. ఎప్పటిలాగే సప్తవర్ణాలతో అందంగా రూపు దిద్దుకున్న టాంటెక్స్ సంస్థ త్రైమాసిక పత్రిక “తెలుగు వెలుగు” దీపావళి సంచికను ముఖ్య సంపాదకుడు చామకూర బాల్కి మరియు పోషక దాతల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

 

తదనంతరం తిరిగి మొదలైన సాంస్కృతిక కార్యక్రమంలో రవితేజ , నూతి శాంతి నిర్వహించిన ఈస్ట్ – వెస్ట్  ఫాషన్ షో లో చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్దలందరూ పాల్గొని, మన భారతీయ మరియు పాశ్చాత్య సంస్కృతులను మేళవించి కన్నుల పండుగగా ప్రదర్శించారు. అలాగే రవితేజ జాలరి నృత్యం ప్రేక్షకులను రంజింప చేసింది. తదనంతరం ఘంటసాల గారే దిగివచ్చి పాడారా అనిపించేలా భారత దేశం నుంచి విచ్చేసిన గాయకుడు శరత్ చంద్ర గారు తమ గాత్రంతో  మధురమైన ఘంటసాల “శివ శంకరి” పాటలతో ఆకట్టు కొన్నారు.

 

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయ కర్త చిట్టిమల్ల రఘు, ప్రత్యేక పోషక దాతలు డా. ఎం.ఎస్.రెడ్డి కుటుంబం, డా. హరినాథ్ పొలిచెర్ల కుటుంబం, టెక్ స్టార్ మరియు దీపావళి కార్యక్రమ పోషక దాతలు డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్, స్టాండర్డ్ పసిఫిక్ హొమ్స్, జనరిక్ సొల్యూషన్స్, సథరన్ ఎందోక్రినాలజీ & డయాబెటిక్ అసోసియేట్స్, రెక్స్ ప్రోగ్రామింగ్, విక్రం జంగం కుటుంబం, గుర్రం శ్రీనివాస రెడ్డి & డా. శ్రీలత రెడ్డి వారికి కృతఙ్ఞతలు తెలియచేసారు.

 

“గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” 1220 AM లో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేసిప్లాజా, రేడియో కుషి లకు మరియు ప్రసారమాధ్యమాలైన tv9, tv5, టోరి,    ఏక్ నజర్, 6tv లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

 

TANTEX Deepavali Vedukalu 2014_Deepa Poojanam TANTEX Deepavali Vedukalu 2014_Group Photo 2jpg TANTEX Deepavali Vedukalu 2014_Group Photo 3

అమావాస్య చీకట్లలో సంతోషపు దీపాలు, అందరి మనస్సులో ఆనందపు దివ్వెలు , హాయిగా హుషారుగా సాగిపోయాయి టాంటెక్స్ 2014 దీపావళి వేడుకలు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం అందరు ఆలపించడంతో , విచ్చేసిన వారందరికీ ఎంతో ఆహ్లాద పరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.