టాంటెక్స్ 97వ ‘నెలనెలా తెలుగు వెన్నెల’ లో అన్నమయ్య భాషా వైభవం

1749

ఆగష్టు 16, 2015, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఆగస్ట్16వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 97 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

నేమాని పార్థసారధి గారి శిష్య బృందం ఆలపించిన ‘గరుడ గణనాయక రారా’ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. జొన్నవిత్తుల గారు రచించిన ‘బొంగరాల సుడిగల’ అనే తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పే గీతాన్ని చిన్నారులు నువ్వుల అభిరాం, బ్రహ్మదేవర ఫ్రణవ్, మర్నేని స్నేహ, మర్నేని స్నిగ్ధ, కోరాడ రిషిక, కోట ఆకాష్ ఎంతో మనోహరంగా ఆలపించారు. దొడ్ల రమణ గారి ఆధ్వర్యంలో పోతన భాగవతంలోని పద్యాలను చిన్నారులు పటించటమే కాకుండా, పద్యాల్లోని పదాలకు అర్థాన్ని కూడా విశదీకరిస్తూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారు. చిన్నారులు దొడ్ల నిర్జర, మాడ సంహిత, మాడ సమన్విత, కస్తూరి అమృత, మందిరం వర్షిణి, మందిరం హర్షిణి, నేమాని కార్తిక్ లు తెలుగు భాష పై చూపుతున్న ఆసక్తి, ప్రావీణ్యం అందరిని ముగ్దులను చేసింది. చేవూరి చంద్రశేఖర్ రెడ్డి గారు స్వీయ రచన ఆకట్టుకుంది. కథలు, కవితలు, యాత్రా రచనలు, సాహిత్య వ్యాసాలు, రూపకాలు, రేడియో ప్రసంగాల ద్వారా సుపరిచితులయిన దాసరి అమరేంద్ర గారు ‘సామాన్యుని సాహితీయానం’ పై తమ స్వీయ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు. వృత్తిరీత్యా ఇంజినీరు అయినప్పటికీ, ప్రవృత్తిరిత్యా పాఠకుడు, యాత్రికుడు, మరియు నిరంతర అన్వేషి అయిన అమరేంద్ర గారు, జీవితం-సాహిత్యం వేరు కావని, అవి పరస్పర ఆధారితాలు అనీ, పుస్తకాలు చదివితే వాటి యొక్క ప్రభావం మన నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చాలా చక్కగా వివరించారు. సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ గారి ప్రశ్నావినోదం (క్విజ్) అందరిని ఆకట్టుకుంది. మర్చిపోతున్న విషయాలను మరొక్కసారి గుర్తుకుతెచ్చుకునే అవకాశాన్ని ఈ క్విజ్ కార్యక్రమం కలిగిస్తుంది.

 

ముఖ్య అతిధి ఆచార్య రవ్వ శ్రీహరి గారు ‘అన్నమయ్య భాషా వైభవం’ పై చేసిన ప్రసంగం అందరిని తెలుగు భాష మరియు భక్తి రసంలో ముంచెత్తింది. రచనా ప్రక్రియలో తెలుగు రచనలకు పెద్ద పీట వేసి, సుమారు 50 గ్రంధాలను, 25 సంస్కృత గ్రంధాలను రచించి, పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాలమీద తమదైన ముద్ర వేసారు. శ్రీహరి గారు ద్రావిడ విశ్వవిద్యాలయానికి మాజీ ఉపకులపతిగా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దాదాపు పదిహేడు సంవత్సరాలు బోధన చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ గా పని చేసి తెలుగు భాషపై అనర్గళమైన పరిఙ్ఞానాన్ని ఆపాదించుకుని ధన్యులయ్యారు. వీరు సంస్కృత విశ్వవిద్యాలయంచే మహామహోపాధ్యాయ బిరుదు, సి.పి.బ్రౌన్ పురస్కారాలు అందుకున్న ఘనత వీరికే దక్కింది. ఈనాడు మన తెలుగు భాష ప్రయోగంలో చాలా వరకు సంస్కృత పదాలను ఉపయోగించటం జరుగుతోందని, అన్నమయ్య మాండలిక భాషను ప్రయోగించిన తీరును తెలియజేస్తూ, మనకు తెలియని చాలా తెలుగు పదాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర వ్యవధిలో జరిగినప్పటికీ అప్పుడే అయిపొయిందా? అనిపించింది.

Sahitya Vedika 97th Guest Jnapika Sahitya Vedika 97th Guest Shaluva Sanmanam Sahitya Vedika 97th Padyalu Sahitya Vedika 97th Prarthana geetham Sahitya Vedika 97th Pushpaguchham Sahtithaya Vedika 97th Group Picture

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రం ఈ. టీవి. వారి “స్వరాభిషేకం” ఆగష్టు 29న ఆలెన్ ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు “100వ నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, పాలకమండలి ఉపాధిపతి చాగార్లమూడి సుగన్, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు, పాలకమండలి సభ్యులు బావిరెడ్డి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, కలవగుంట సుధ ముఖ్య అతిథి ఆచార్య రవ్వ శ్రీహరి గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. పోషకదాతలు జువ్వాడి రమణ గారిని మరియు డా. పెనుకొండ ఇస్మాయిల్ గారిని జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తగా వ్యవహరించిన అట్లూరి స్వర్ణ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.