తెలుగు సాహిత్యంలో హాస్యం – టాంటెక్స్ “నెల నెలా తెలుగు వెన్నెల” లో నవ్వుల జల్లులు

1672

డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల”92 వ కార్యక్రమం ఈ నెల ఆదివారం మార్చి 15, డల్లాస్ లో ఇర్వింగ్ నగరంలో దేశి ప్లాజా స్టూడియో లో సాహిత్య వేదిక సమన్వయ కర్త దండ వెంకట్ గారి అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. హాస్యం మనసుకు ఉల్లాసం మాత్రమే కాదు శరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది అనే ఇతివృతం లో బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ప్రధాన వక్తగా సాగించిన ప్రసంగం, ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించింది. కార్యక్రమంలో మొదటిగా ప్రముఖ కవి, సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన రాళ్లబండి కవితా ప్రసాద్ గారి అకాల మరణానికి సంతాపంగా సభలో రెండు నిముషాల మౌనం వహించారు. శ్రీమతి కలవగుంట సుధ తమ చిన్నారులు నర్తన, కీర్తన తో కలిసి చక్కని ప్రార్ధనా గీతంతో తదుపరి కార్యక్రమం ప్రారంభించారు. ఎంతో మంది చిన్నారుల చేరిక ఈ కార్యక్రమానికి మరింత సొబగులు చేకూర్చింది. చిన్నారి కలవగుంట కీర్తన కార్యక్రమానికి విచ్చేసిన మరికొంతమంది చిన్నారులను వేదిక మీదకు పిలిచి ఎంతో చక్కగా మర్యాద రామన్న కథను వినిపించింది. ఆ దృశ్యం అలనాటి ఆకాశవాణి రేడియో లో ప్రసారమయ్యే చిన్న పిల్లల కార్యక్రమాన్ని గుర్తుకు తెచ్చింది. మాడ దయాకర్ గారు మరియు జువ్వాడి రమణ గారు, దివంగత రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారి “ఒంటరి పూలబుట్ట” కవితా సంపుటి గురించి, నవ్య భావ శోభిత మైన ఆయన కవితా రచన ఎంత చక్కగా సాగుతుందో ఆసక్తి కరంగా వివరించారు. టాంటెక్స్ వారు చిన్నారులకు విశేష స్థానం కల్పించడం ఈ కార్యక్రమ ప్రత్యేక ఆకర్షణ. కస్తూరి ప్రణవ్, కస్తూరి అమృతలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం కమ్మగా గానం చేయడమే కాకుండా , తెలుగు రాకపోతే వచ్చే ఇబ్బందులు గురించి “విచిత్ర వంటకం” అనే హాస్య నాటిక ప్రదర్శించి ఎంతో రంజింప చేసారు. అన్న- చెల్లెలు ఇంత చక్కగా తెలుగు మాట్లాడడం, హాస్య నాటిక వేయడం అందరిని ఆకట్టుకుంది. దొడ్లా రమణ పోతన భాగవతం లో పద్యాలు కడు రమ్యంగా చదివి తన ధారణా శక్తి తో అచ్చెరువొందించారు. డా. రాఘవేంద్ర ప్రసాద్ గారు భావం, భాష, ఛందస్సు పరంగా కవిత్వం యొక్క రూపాలను, తన స్వీయ రచనలు ఆహూతులకు పరిచయం చేసారు.

ముఖ్య అతిధి బ్రహ్మశ్రీ డా. మైలవరపు శ్రీనివాస రావు గారు “సాహిత్యంలో హాస్యం” అనే అంశంపైన నవ్వుల జల్లులు కురిపించారు. బ్రహ్మ దేవుడు సంవత్సరాలలో మొదటిది అయిన ప్రభవనామ సంవత్సరాన, ఆయనములలో మొదటిది అయిన ఉత్తరాయణంలో, ఋతువులలో మొదటిది అయిన వసంతఋతువులో, నెలలలో మొదటిది అయిన చైత్రమాసంలో, మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి శుక్లపక్షంనాడు, పగటిపూట ఈ జగత్తును సృష్టించడం ద్వారా సృష్టి ప్రారంభం అయినది అని ఉగాది విశిష్టతను వివరించారు. భోజరాజు ఆస్థానములో కాళిదాసు మహాకవిని ఇబ్బంది పెడదామని కొంతమంది పండితులు “టంటంటటంటటంటంట” అనే పద్యపాదాన్ని ఇచ్చి పద్యాన్నిపూర్తిచేయమంటే ఆయన తన అసాధారణ కవితాశక్తితో ఇలా పూరించారని వివరించారు . భోజరాజుకు పరిచారికలు మంగళస్నానం చేయిస్తుంటే ఒక పరిచారిక చేతిలో బంగారపు చెంబు మెట్ల మీద నుండి “టంటంట…” అనే శబ్దం చేస్తూ జారిపడే సన్నివేశాన్ని హృద్యంగా పద్యంలో వర్ణించారు. తను చదువుకొనే కళాశాలలో ఒక మాస్టారు జపాను దేశం వెళ్లి వచ్చి ఇక మాట్లాడబోయే ప్రతి సందర్భం లోను “జపానులో అయితేనా … “అంటూ మొదలు పెట్టడం, ఇక ఆయన ఏమి చెప్ప బోతున్నారో అందరికి కంఠతా వచ్చేయడం లాంటి హాస్యసన్నివేశాలు చెప్పి ఎంతో నవ్వించారు. ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అంతర్జాలం ద్వారా ఎంతో మంది వీక్షించారు.

_MG_5247-M 92NNTV-2 92NNTV-4 92NNTV-5 92NNTV-7 92NNTV-8 92NNTV-9

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఉరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సమన్వయకర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం అందరూ కలిసి ముఖ్య అతిధి బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిని మంగళ వాయిద్యాల నడుమ శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులు ఉరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ “తెలుగు భాష-సంస్కృతికి టాంటెక్స్ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని, 92 నెలలుగా ఈ ‘నెల నెల తెలుగు వెన్నెల’ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, వచ్చేనెల ఉగాది సందర్భంగా 93వ నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం లో “కవి సమ్మేళనం” జరుపుకోబోతున్నాము తప్పక విచ్చేయమని” ఆహ్వానించారు . ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసారమాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. కాకర్ల విజయమోహన్, ఉప్పలపాటి కృష్ణారెడ్డి , ఆదిభట్ల మహేష్ ఆదిత్య, వీర్నపు చినసత్యం, శీలం కృష్ణవేణి, పావులూరి వేణుమాధవ్, సింగిరెడ్డి శారద, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

PHTOS: http://tantex.smugmug.com/Other-1/Sahitya-Vedika/92nd-Nela-Nela-Telugu-Vennela/47814672_4KgCSD#!i=3909690648&k=4wB5L7v