లండన్ లో దిగ్విజయంగా ముగిసిన రెండు రోజుల నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో నిన్న ఉదయం 10 గంటలకి (సెప్టెంబర్ 27, 2014) ప్రారంభించబడిన నాలుగవ ప్రపంచ సాహితీ సదస్సు ఈ రెండవ రోజు (సెప్టెంబర్ 28, 2014) సాయంత్రం ఐదు గంటల వరకూ దిగ్విజయంగా జరిగి, ఐరోపా ఖండంలో మొట్ట మొదటి సారిగా అచ్చా తెనుగు అష్టావధాన కార్యక్రమంతో ముగిసి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రగతి పథానికి సరి కొత్త బాట వేసింది. కళ్యాణి గేదెల శ్రావ్యంగా ఆలపించిన దేవులపల్లి గారి “జయ జయ ప్రియ భారత “ దేశభక్తి గీతంతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి ఈ రోజు కూడా ఎంతో ఆసక్తితో 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొన్నారు.

telugu 4th sahithi sadassu (2) telugu 4th sahithi sadassu (1)

ఈ రోజు కూడా ప్రధాన అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ, సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర, అక్కిరాజు సుందర రామకృష్ణ ఉదయం నుంచి సాయంత్రం దాకా సభలో పాల్గొని తమ సహజ సిద్ధమైన సాహిత్య ప్రసంగాలు, కవితాలాపనలతో సభికులని రంజింపజేసారు. డా. జొన్నలగెడ్డ మూర్తి, కేతవరపు రాజ్యశ్రీ మొదలైన వారు స్వీయ కవితా గానం చేశారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి శ్రీశ్రీ, దేవులపల్లి, భానుమతి, రేలంగి, సూర్యాకాంతం, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, బాపు- బాపూజీ మొదలైన అనేక రంగాల లబ్ధప్రతిష్టులైన పైన తను రచించిన వచన కవితలను అద్భుతంగా చదివి సభ మెప్పుదల పొందారు.

ఆచార్య “పద్మశ్రీ” కొలకలూరి ఇనాక్ గారి కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న” కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న” పుస్తకం, కవి వడ్డేపల్లి కృష్ణ రచించి, ఎస్.పి. బాలసుబ్రమణ్యం , తదితర గాయనీగాయకులు ఆలపించిన “తెలుగు రాగాంజలి” సీడీ లని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ మహా సభలకి పరాకాష్ట గా యావత్ ఐరోపా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంస్కృత పదాలు ఎక్కడా వాడకుండా అచ్చ తెనుగు పదాలతో అపురూపమైన అవష్టావధాన కార్యక్రమాన్ని, ధారణతో సహా కేవలం గంటా పదిహేను నిముషాలలో ముగించి చరిత్ర సృష్టించారు. కవి జొన్నవిత్తుల గారి సమర్థవంతమైన సంచాలకుడిగా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిన ఈ అష్టావధానంలో కేతవరపు రాజ్యశ్రీ (దత్త పది), శ్రీ రంగస్వామి (సమస్య), మాదిన రామకృష్ణ (చిత్రాక్షరి), డేనియల్ నేజేర్స్, వడ్డేపల్లి కృష్ణ (నిషిద్ధాక్షరి), అక్కిరాజు సుందర రామకృష్ణ (వర్ణన), “అమెరికా ఆస్థాన అప్రస్తుత ప్రసంగి” గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు అప్రస్తుత ప్రసంగిగా చమత్కారమైన ప్రశ్నలతో పృఛ్చకులుగా వ్యవహరించారు. అవధానం అనంతరం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవధాని పాలపర్తి వారి సత్కార కార్యక్రమం జరిగింది.

telugu 4th sahithi sadassu (3)

ఈ మహా సభలలో “భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉండే భారత దేశం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలుగు వారు విడిపోయిన నేపధ్యంలో, హిందీ భాష అభివృద్ది నమూనాలో తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ది బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వమే చేపట్టి “కేంద్రీయ తెలుగు సంస్థ” ని ఏర్పాటు చేయాలి “ అనే తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని నాలుగవ ప్రపంచ తెలుగు సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా ఈ రోజు ప్రారంభ సభలో వంగూరి చిట్టెన్ రాజు ప్రతిపాదించిన “యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తెలుగు పీఠం” ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగానూ సహకరిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.యి. కృష్ణ మూర్తి, శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.

ఈ రెండవ రోజు సమావేశాలని డా. మాదిన రామకృష్ణ సందర్భానికి తగినట్టు తన స్వీయ కవితలు వివిపిస్తూ సమర్థంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల సమావేశాలని యుక్త అధ్యక్షులు జయకుమార్ గుంటుపల్లి పర్యవేక్షించగా, కిల్లి సత్య ప్రసాద్ & వెంకట పద్మ దంపతులు అన్ని చోట్లా వారే నిర్వహణ బాధ్యతలని చేపట్టి ఎంతో సేవ చేశారు. శ్రవణ లట్టుపల్లి, నరేంద్ర మున్నలూరి నాయకత్వంలో ప్రమోద్ పెండ్యాల, రాజశేఖర్ కుర్బా, అమర్ నాథ్ చింతపల్లి, ప్రసాద్ మద్దసాని, ఉదయ్ కిరాణ్ బోయపల్లి, ఉదయ్ ఆరేటి, కృష్ణ యలమంచిలి, సుదీర్ కొండూరు, బలరామ్ ప్రసాద్ తదితరులు ఎంతో శ్రమ కోర్చి ఈ మహా సభలు విజయవంతం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు.