తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ అయిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA )  2016 మే 27 నుండి 29th వరకు జరిగే   "డల్లాస్ తెలుగు మహాసభలకు" ఏర్పాట్లు కనీ వినీ ఎరుగని  రీతిలో ముమ్మరంగా సాగుతున్నాయి. అశేష ప్రజావాహిని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తెలుగు మహోత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. చేపట్టే ఏ కార్యక్రమం అయినా నూతన ఒరవడి సృష్టించే నాటా వారి కార్యకమాలకు ప్రజాదరణ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  తెలుగు మహాసభలు జరిగే చోటు డల్లాస్ మహా నగరం కావడం,   అమెరికా, కెనడా నుండే కాక, ఇండియా నుండి కూడా విశేష సంఖ్యలో ప్రేక్షకులు తరిలి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి  కావున అందుకు తగ్గ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా వేలాదిగా తరలి వచ్చే ప్రజలకు ఇసుమంతైనా అసౌకర్యం కలగకుండా ఏర్పా ట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ కార్యకర్తలు ఇప్పటినుండే చక్కని ప్రణాళికలతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. telugu community news - nata telugu mahasabalu 2016 డల్లాస్ నగరం నడిబొడ్డున అతిపెద్దదైన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో 10000  మందికి  పైగా  కూర్చొనే సామర్ధ్యం, ప్రమంచంలోనే అతిపెద్ద హెలిపాడ్ సౌకర్యం, 105 మీటింగ్ రూములు,  దానికి ఆనుకొని ఉండే 1000 రూములు గల OMNI హోటల్, ప్రక్కనే Hyatt హోటల్,  ఫైవ్ స్టార్ట్ వసతి సౌకర్యాలు, అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్, చక్కటి పార్కింగ్ సదుపాయం, ఇలా ఒకటేమిటి సమస్త సదుపాయాలు గల డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు మహాసభలకు సర్వ సన్నద్ధముగా ఉంది. ఎన్నో వేలమంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి  సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనలో   ప్రత్యేక శ్రద్ధను డల్లాస్ కన్వెన్షన్ టీం  తీసుకొంటోంది . అత్యుత్తమ కార్యక్రమాల ఎంపిక కోసం  ప్రత్యేక కమిటీలు నియమించారు,  కార్యక్రమాలలో నాణ్యత కు పెద్దపీట వేసి తెలుగు సంస్కృతి సంప్రదాయాలనే ఆత్మలుగా చేసి కార్యక్రమాలు రూపొందించవలసిందిగా ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపడానికి  డల్లాస్ లో అన్ని ప్రముఖ తెలుగు సంస్థల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుగుచున్నాయి.  మరిన్ని విశేషాలు తదుపరి నివేదికలో మీకు తెలియపరచగలము.