Tags Posts tagged with "NNTV"

NNTV

0 1081

జులై 8th 2017 డాలస్, టెక్సస్

31 సంవత్సరాల ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు వైభవం  మరియు  ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమం  “నెల నెలా తెలుగు వెన్నెల” తెలుగు సాహిత్య వేదిక 10వ వార్షికోత్సవం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ   ప్రత్యేక సదస్సు “తెలుగు వైభవం”  విశిష్ట అతిధుల సమక్షంలో అశేష అభిమానుల మధ్య  స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ ఆడిటోరియం లో,  అధిక సంఖ్యలో పాల్గొన్న డాలస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానుల ఆదరాభిమానాలు చూరగొంటూ, అత్యంత వైభవంగా జరిగాయి.  ప్రవాసంలో నిరాటంకంగా 120 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. మధ్యాహ్నం ప్రారంభమైన సాహిత్య వేదిక వార్షికోత్సవం ఉప్పలపాటి కృష్ణా రెడ్డి అధ్యక్షతన మరియు సమన్వయకర్త సింగిరెడ్డి శారద ఆధ్వర్యంలో నిర్వహించబడినది. భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథులు, డాలస్ లోని తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది

కార్యక్రమంలో ముందుగా సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద 2017 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి మాట్లాడారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ  ఉపకులపతి ప్రొఫెసర్ వి.దుర్గాభవాని గారు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడారు. విమర్శకుడు, కథ, యాత్రా రచయిత దాసరి అమరేంద్ర గారు “తెలుగు యాత్రా సాహిత్యం” అంశం మీద చక్కగా ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా. కాత్యాయని విద్మహే గారు “తెలుగు సాహిత్య విమర్శ” అంశం మీద ప్రధాన ప్రసంగం గావించారు. సంపాదకులు,విమర్శకులు వాసిరెడ్డి నవీన్ గారు “తెలుగు కథ – మారుతున్న స్వరం” అంశం మీద ప్రసంగించారు. నాటక రచయిత డా. కందిమళ్ళ సాంబశివరావు గారు “తెలుగు నాటకం – సామాజిక చైతన్యం” అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ కధా రచయిత గొర్తి బ్రహ్మానందం గారు తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష సాహితీవేత్తల నడుమ చర్చ నిర్వహించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చర్చించి,  విచ్చేసిన వారందరినీ ఆనందపరిచారు. విచ్చేసిన సాహితీ ప్రముఖులందరిని సంస్థ కార్యవర్గ మరియు సాహిత్య వేదిక బృందం పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటో కవితల పోటీకి ఆశేష ఆదరణ లభించింది. ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారు ఫోటో కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డాలస్ కి చెందిన నశీం షేక్ రాసిన “పునాదులు-సమాధులు” కవితకి మొదటి బహుమతి లభించగా. రావెల పురుషోత్తమరావు గారి “ఆదరాబాదరాగా” కవితకి రెండవ బహుమతి లభించింది. చిలుకూరి  వెంకటశాస్త్రి గారి “జయహో” కవితకి మూడవ బహుమతి లభించింది.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని కూచిపూడి కళకే అంకితం చేసి, దేశ విదేశాల్లో వందలాది నృత్య ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ వాటికి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించిన  నాట్యాచార్యులు, చలన చిత్ర నృత్య దర్శకులు శ్రీ కేవీ సత్యనారాయణ గారు డాలస్ కి చెందిన నాట్య కళాకారులతో కలిసి “జయహో శ్రీ కృష్ణదేవరాయ” కూచిపూడి నృత్య రూపకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఎంతో ఆసక్తితో అష్ట దిగ్గజాలుగా పాల్గొన్న స్థానిక భాషాబిమానుల వేష ధారణ మరియు వారి ఆసక్తి ఈ నృత్య రూపకానికి నూతన శోభ, ఉత్సాహం తెచ్చిపెట్టాయి.

భోజనానంతర విరామం తరువాత, ఈ ప్రత్యేక సదస్సు సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆహ్వాన పలుకులతో, సాయంకాల వినోద కార్యక్రమాల వివరాలు అందిస్తూ,  ప్రేక్షకులకు పునస్వాగతం తెలిపారు.  ఈ సందర్భంగా , ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి తమ సందేశంలో “31 సంవత్సరాల టాంటెక్స్ తెలుగు వైభవం మనమందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న సంస్థ గామొదలైన టాంటెక్స్  ఈ నాడు అమెరికా లో ఉన్న జాతీయ తెలుగు సంస్థలతో ధీటుగా ఇటు అమెరికాలో అటు ఇండియా లో కూడా గుర్తింపుతెచ్చుకుంది అన్నారు డల్లాస్ నగరంలో లభించే ఆదరాభిమానాల గురించి అమెరికాలోనే కాకుండా , మన భారతదేశంలోను మనకు అభినందనలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి”  అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.  

భారతదేశం నుంచి అమెరికాలో పర్యటన చేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన  కోడంగల్ ఎం.ఎల్.ఎ. శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ,  సంస్థ కార్యవర్గ, పాలక మండలి బృందం సన్మానం చేశారు. అటు తరువాత , కార్యక్రమానికి తనవంతు ఆర్ధిక సహాయం చేస్తూ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస భారతీయుల ఐ.టి. ప్రత్యేక ప్రతినిధి మనోహర్ రెడ్డి గారిని టాంటెక్స్ కార్యవర్గ బృందం సన్మానం చేయడం జరిగినది.  అటు పిమ్మట, ప్రెసిడెన్సియల్   స్పాన్సర్ : NATS సంస్థను,  లోన్ స్టార్ స్పాన్సర్స్: డా. పైల మళ్ళా రెడ్డి, డా. ప్రేమ్ రెడ్డి లను , NATA, TPAD సంస్థలను , ప్రీమియర్ స్పాన్సర్స్ : TANA సంస్థను , క్వాంట్ సిస్టమ్స్ ను, గోల్డ్ స్పాన్సర్: రాం కోనార, సౌత్ ఫోర్క్ డెంటల్ లను సభా వేదిక మీద సన్మానించారు.

సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ , విచ్చేసిన గాయక బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయగా , ప్రత్యేక కార్యక్రమం మొదలు పెడుతూ తమ మృదుమైన పలుకులతో వ్యాఖ్యాతగ వ్యవహరిస్తూ , మధురమైన , అందరికి ఇష్టమైన పాటలతో ప్రముఖ గాయని సునీత గారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో  , సంగీత దర్శకుడు , గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయకులు భార్గవి పిళ్ళై, దినకర్, యాసిన్ నజీర్ , సమీర భరద్వాజ్ లు, ఈ ప్రత్యేక సదస్సుకు విచ్చేసి కదలకుండా వింటున్న  వారందరినీ ఆద్యంతం ఆకట్టుకుని సంగీత ప్రవాహంలో  ముంచెత్తారు. ప్రేక్షకుల కోరికపై ఎన్నో ఉత్సాహ పరిచే పాటలు వినిపించారు.

1986, సంస్థ ప్రారంభింప బడిన సంవత్సరం నుంచి 2017 వరకు , ఆయా సంవత్సరాలలో అత్యుతమ పాటలుగా గుర్తింపబడిన  పాటల సమాహారాన్ని , తమ నృత్య నైపుణ్యాన్ని జోడించి “టాంటెక్స్-చిత్రలహరి” అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని, శాంతి నూతి మరియు  రవి తేజ ఆధ్వర్యంలో మొదటి భాగాన్ని, కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన టాలీవుడ్ నటి స్నేహ నామనంది మరియు గోమతి సుందరబాబు ఆధ్వర్యంలో రెండవ భాగాన్ని, స్థానిక కళాకారులు  ప్రదర్శించారు.  ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారుల నృత్య నైపుణ్యo, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది.

అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం మరియు కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

ఏ కార్యక్రమానికైనా మనల్ని ప్రోత్సహించిచేయూతనిచ్చే పోషక దాతలు లేకుంటే కార్యక్రమం చేయడం సాధ్యపడదు. ప్రత్యేక అతిథులు,  పోషకదాతల గౌరవార్ధం ముందు రోజు  టాంటెక్స్ వారు ఏర్పాటు చేసిన విందులో పోషకదాతలు ప్రతి ఒక్కరిని పేరు పేరునా గుర్తించి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయo ఉప కులపతి డా. వి. దుర్గా భవాని , సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా. కాత్యాయని విద్మహే గార్ల, ఇతర తెలుగు సాహిత్య ప్రముఖులు మరియు  ప్రముఖ గాయని సునీత మరియు వారి గాయక బృందం ఙ్ఞాపికలు అందచేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమ పోషకుల వదాన్యతను అభినందించారు.  

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన యువ రేడియో, టీవీ5, టి.ఎన్.ఐ,  టీవీ9 లకు  కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

పైన వివరించిన కార్యక్రమాల ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/Sahitya-Vedika10h-Anniversary-120th-NNTV-July-8th2017/

https://tantex.smugmug.com/2017-Events/Telugu-Vaibhavam-Musical-Extravaganza-July-8th-2017/

0 591

మార్చి 19, 2017, డాలస్, టెక్సస్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “116వ  నెలనెలా తెలుగు వెన్నెల” మరియు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు శనివారం మార్చి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 116 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ నుండే కాకుండా హ్యూస్టన్, ఆస్టిన్, సాన్ ఆంటోనియో నుండి భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.

 
సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు, పసందైన విందు భోజనం తరువాత శ్రీమతి ఆడూరి సృజన “సంగీత సాహిత్య సమలంకృతే”, “స్వరములు ఏడైనా రాగాలెన్నో” పాటలను పాడి సభను ప్రారంభించారు. సాన్ ఆంటోనియో నుండి వచ్చిన శ్రీ సూరంపూడి శరత్, శ్రీ కరణం రామ్మోహన్ స్వీయకవితలని చదివి వినిపించారు. ఆస్టిన్ నుండి వచ్చిన శ్రీ మందపాటి సత్యం తన నవల “నిజమే కల అయితే” కి ప్రేరణ ఎలా కలిగిందో తెలియజేసారు. శ్రీ డొక్కా రాం ఆత్మానందం-ఆత్మారామం శీర్షికన తన స్వీయ కవితలని వినిపించారు. హ్యూస్టన్ నుండి వచ్చిన శ్రీ వంగూరి చిట్టెన్ రాజు పోతన భాగవతాన్ని భావితరానికి ఉపయోగపడేలా చేస్తున్న శ్రీ పుచ్చా మల్లిక్ గురించి చెప్పారు.

38th TX Sahitya Vedika 1 38th TX Sahitya Vedika 2 38th TX Sahitya Vedika 3
డాలస్ కి చెందిన శ్రీ వేముల లెనిన్ బాబు కవితా కుమారి ప్రస్థాన గీతిక శీర్షికన ఊహా సుందరి అయిన కవితా కుమారి జన్మస్థలం, ఆమె ప్రయాణం గురించి వివరిస్తూ మంచి పాటలని పాడారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి “మన తెలుగు సంపద” శీర్షికన కొన్ని పొడుపు కథలను సభతో పంచుకున్నారు. శ్రీ మాడ దయాకర్ నరసింహావతార ఘట్టం – పోతన నాటకీయత గురించి మాట్లాడారు. మెమొరియల్ డే వారాంతం జరగనున్న తానా సభల సూవనీర్ “తెలుగు పలుకు” ప్రధాన సంపాదకులు శ్రీ చేకూరి కేసీ ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలు కవితలు, కథలు, పద్యలు, వ్యాసాలు మొదలైనవి ఏప్రిల్ మొదటివారానికి చేరేలా పంపాలని కోరారు.

 
శ్రీ దొడ్ల రమణ గారు సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీమతి దేవగుప్తాపు పద్మ గారి “పద్మ పద్య వాహిని” పుస్తక పరిచయం చేసారు. పుస్తక పరిచయం తరువాత పుస్తకావిష్కరణ కూడా జరిగింది. శ్రీ విన్నకోట రవిశంకర్ గారి “వేసవి వాన” కవితా సంపుటిని శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు పరిచయం చేస్తూ అందులోని రెండు కవితలు చదివారు. శ్రీ పాపినేని శివశంకర్ గారికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని తెచ్చిన “రజనీగంధ” కవితా సంపుటిని శ్రీ మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేసారు. ఇందులోని ప్రతి కవిత మనకి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తుందన్నారు. శ్రీమతి కూచిభొట్ల లలితామూర్తి తమ తాతగారు రచించిన శ్రీగణేశ్వరీయం పుస్తక పరిచయం చేసి కొన్నిటిని పంచి పెట్టారు.

 
తేనీటి విందు తర్వాత సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీ పోతన సాయికుమార్ రచించి దర్శకత్వం వహించిన “వైద్యో నారాయణ” నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీ పోతన సాయికుమార్, శ్రీ కరణం రామ్మోహన్, శ్రీ మేక సీ.ఎస్.రెడ్డి, శ్రీ సూరంపూడి శరత్, శ్రీ దొడ్డ సత్య, శ్రీ దేవగుప్తాపు బాబు, శ్రీ కోట వేణుగోపాల్, శ్రీమతి ఆదిత్య లక్ష్మి నటించారు. శ్రీ కన్నెగంటి చంద్ర సాహిత్యంలో విషాదం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. డా. కలవగుంట సుధ ఆధ్యాత్మ రామాయణం గురించి మాట్లాడారు. శ్రీ పూదూర్ జగదీశ్వరన్ సరస్వతి దేవి మీద ఒక పద్యం వినిపించారు. దాని తర్వాత ఇడ్లీ దండకం చదివి అందరినీ నవ్వించారు. డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కొన్ని విప్లవగీతాలను, ఒక జానపద గీతం ఆలపించారు. శ్రీ జలసూత్రం చందు స్వీయరచన పాటని పాడారు.

 
116వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సింగిరెడ్డి శారద మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పసందైన విందు భోజనం సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

 
కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/116th-NNTV-38th-TX-Sahitya-Sadassu-Mar18th-2017
టాంటెక్స్ 116 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి బసాబత్తిన శ్రీనివాసులు  సమర్పించిన నివేదిక.

0 671

జనవరి 15, 2017, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం జనవరి 15వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.

బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. సభకు 2017 సంవత్సరానికి సమన్వయకర్తగా శ్రీమతి శారద సింగిరెడ్డి గారిని పరిచయం చేస్తూ వేదిక మీదికి ఆహ్వానించారు. తెలుగు సాహిత్యవేదిక సమన్వయకర్తగా రెండవసారి పదవీబాధ్యతలను స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీమతి సింగిరెడ్డి శారద తెలియజేసారు.  కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు.  తాను భగద్గీత నేర్చుకుంటున్నానని, మొదటి ఎనిమిది అధ్యాయాలలో అధ్యాయం పేరు చెప్పి ఎన్నోపద్యం అడిగినా, పద్యాన్ని అప్పజెప్పగలను అని అడిగిన అన్నీ తడుముకోకుండ చక్కగా చెప్పగలిగాడు.  పూర్తిగా పారాయణం చేయడం వచ్చిన తరువాత అర్ధం కూడా తెలుసుకుని ఆచరించే దిశగా శిక్షణ, స్థానిక హిందూదేవాలయంలో పొందుతున్నట్లుగా చిరంజీవి తండ్రి తెలియజేసారు.  చిన్నారి చెబుతుంటే తనకు ఐదవతరగతిలో పోటీ కోసం నేర్చుకున్న భగవద్గీతలోని శ్లోకం గుర్తుకు వచ్చిందని, సాహిత్యాభిమాని డా. ఇస్మాయిల్ పెనుకొండ లేచి వినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

గతంలో నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ పిస్కా సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమంలో ద్వాపరయుగంలోని శ్రీక్రిష్ణుడిని, కలియుగంలోని శ్రీక్రిష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరిస్తూ మాట్లాడారు.  సాహిత్యవేదిక సభ్యులు డా. కలవగుంట సుధ గారు క్షేత్రయ్య పదసాహిత్యం పై మాట్లాడుతూ అష్టావిధ నాయికల వర్ణన అభినయించారు.  శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు ‘నేనొక ప్రేమ పిపాసిని ‘ అనే సినిమా పాటలో మొదటి రెండు చరణాలు ఎక్కువ ప్రజాదరణ చెంది ప్రాచుర్యంలో ఉన్నప్పటికి, మూడవ చరణంలో ఎంత అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు.  శ్రీ జువ్వాడి రమణ గారు శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి సంబంధించిన వివరాలను వివరించారు.  శ్రీ వేముల లెనిన్ గారు కొన్ని నన్నయ పద్యాలను పంచుకున్నారు.

ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి     శ్రీనివాసులు  మరియు పరిమళ రేడియో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.

tantex_114th-nntv_01152017_2016-and-2017-samanvayakarthalu tantex_114th-nntv_01152017_audience-1 tantex_114th-nntv_01152017_audience-2 tantex_114th-nntv_01152017_gnaapika-pradhanam-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_group-photo tantex_114th-nntv_01152017_mukhya-athithi_dr-alla-srinivasa-reddy tantex_114th-nntv_01152017_pushpa-guchham-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_shaluva-sanmaanam-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_vividha-vakthalu

114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారిని పరిచయం చేస్తూ శ్రీ ఎం. వి. ఎల్. ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా, డా.సి.ఆర్.రావు , కలవల రావు  గార్లు అతిథికి పుష్పగుచ్చం అందచేసారు.
డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు  “జానపదం మరియు భావకవిత్వం” పై ప్రసంగించారు.  దాదాపు తొంభై నిముషాల పాటు సాగిన ప్రసంగంలో “కోడిబాయె లచ్చమ్మ” దగ్గర మొదలై, సందర్భానుసారంగా జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను వివరిస్తూ, ఎన్ని బాణీలు వేర్వేరు కవులు, రచయితల కలాలనుండి వెలువడ్డాయో పాడి వినిపించారు.  ఒకే పాట వయసుతో పాటు మనం పాడే విధానం ఎలా మారుతుందో ఒకటిరెండు ఉదాహరణలు పాడి వినిపించారు.  దేవులపల్లి, దాశరధి, దేవరకొండ బాలగంగాధర తిలక్, నండూరి వారి ఎంకి, దేశభక్తి గేయాలు, పాటలు, కవితలు, పద్యం ఇలా అన్ని రకాల జానపద సాహిత్యాన్నీ స్పృశిస్తూ ముగిసింది.

2016 సంవత్సారానికి  సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన 2016 సాహిత్య వేదిక బృంద సభ్యులను , సమన్వయకర్తను అభినందిస్తూ, క్రొత్త బృందాన్ని ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల చరిత్రగల సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని  తెలుపుతూ, రాబోయే కార్యక్రమాల గురించి తెలిపారు.

ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి  మరియు పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణ రెడ్డి గార్లు శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు  జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు శీలం క్రిష్ణవేణి , ఉపాధ్యక్షులు  వీర్నపు చినసత్యం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త  కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు  కన్నెగంటి చంద్ర, కార్యవర్గ సభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్, లంకా భాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/114th-Nela-Nela-Telugu-Vennela/

 

టాంటెక్స్ 114 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి అట్లూరి స్వర్ణ  సమర్పించిన నివేదిక.

0 760

డిసెంబర్ 18, 2016, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం డిసెంబర్18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 113 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.
సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. నెల నెలా తెలుగు వెన్నెల సింహావలోకనం సందర్భంగా2016 సంవత్సరంలో జరుపుకున్న సాహిత్యవేదిక కార్యక్రమాలను నెమరు వేసుకున్నారు.  ప్రతి నెలలో జరిగిన కార్యక్రమాన్ని, ముఖ్య అతిథి ప్రసంగాన్ని సభికులతో పంచుకున్నారు. తనకు సహకారం అందించిన సాహితీవేదిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి , ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి , కార్యదర్శి వీర్నపు చినసత్యం , కోశాధికారి దండ వెంకట్ , డా.సీ.ఆర్.రావు , డా.సుధ కలవగుంట, కాజా సురేష్, డా.కృష్ణ పుట్టపర్తి, నిమ్మగడ్డ మనోహర్  నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమమాని సంబందించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

tantex_113th-nntv_group-photo_12182016 tantex_113th-nntv_samanvayakartha_billa-praveen_12182016 tantex_113th-nntv_team

ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి గారు మరియు సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ గారు శ్రోతలతో 2016 లో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్య వేదిక బృంద సభ్యులను మరియు  సాహితీ ప్రియులను,  టాంటెక్స్ సంస్థ ముప్పై వసంతాల జ్ఞాపిక తో సత్కరించారు.

సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

టాంటెక్స్ 113 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి బసాబత్తిన శ్రీనివాసులు  సమర్పించిన నివేదిక.

0 897

డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 105వ సాహిత్య సదస్సు మరియు ఉగాది కవిసమ్మేళనం ఆదివారం, ఏప్రిల్ 24వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో, ఎంతో ఆసక్తితో విచ్చేసిన భాషాభిమానులు, సాహితీ ప్రియుల సమక్షంలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది.   కవిసమ్మేళనంతో బాటు “నవల – కథన శిల్పం” అనే అంశంపై డా. సి. మృణాలిని గారు ప్రధానవక్తగా అనుపమానమైన వాగ్ధాటితో సాగించిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సమన్వయకర్త స్వాగతోపన్యాసం, తదుపరి శ్రీమతి స్వాతి ఆలపించిన “శ్రీ గణనాథం” ప్రార్థనా గీతంతో అవిఙ్ఞంగా మొదలైన దుర్ముఖినామ సంవత్సర కవిసమ్మేళనం లో  చిరంజీవి పాలూరి ఇతిహాస్ జొన్నవిత్తుల వ్రాసిన “తెలుగు పద్యముల ప్రసాదం” వినిపించగా, డా. దొడ్ల రమణ “బంధాలు చిరకాలం వుండవు” అనే అంశం మీద తమ స్వీయ రచన పోతన భాగవతం లోని పద్యాలతో పోల్చుతూ వివరించగా, శ్రీ వేముల లెనిన్ శ్రీ శ్రీ “వర్షధార” ని ధారాళంగా పాడగా, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ తనకు ఉగాది పై ఉన్న ఇష్టాన్ని “ఉగాది కవిత మమత” స్వీయ రచన ద్వారా పంచుకున్నారు. శ్రీ కాజ సురేష్  తెలుగు అంగ్లము కలిపి వ్రాసిన సీసపద్యమును, తెలుగు నాటక పద్యాల గొప్పతనము తెలియజేయగ, శ్రీ జువ్వాడి రమణ ప్రతి ఉగాది తను వస్తూ ఏదో తెస్తుంది, ఈ ఏడాది ఏమి తెస్తుందో ఎదురు చూడాలి అంటూ ఆశ – హస్యం రెండూ కలిపి చక్కని స్వీయ రచనను వినిపిస్తే, శ్రీ మాడ దయాకర్  స్వీయరచన లో “ఆరు రుతువులు ఉన్నా  కాని అకాల వాతావరణాలే” అంటూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం చేస్తున్న సాహితీ సేవని కొనియాడారు.

నందివాడ ఉదయ భాస్కర్ “దుర్ముఖి రుద్రాక్ష కిళ్ళీ” కవితలో ఇప్పటి రాజకీయాలని తనదైన శైలిలో వినిపించగా, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ శ్రీనాథుని పద్యాలను వినిపిస్తూ కవిసమ్మేళనం అనగా నీరుకాకులగుంపు అంటూ నవ్విస్తే, పెనుగొండ ఇస్మాయిల్ తాను మధుబాల పై వ్రాసుకున్న స్వీయకవితను తనకు నచ్చిన మరో రెండు కవితలతో పంచగా, శ్రీమతి పాలూరి సుజన ఎన్నికలపై వ్రాసివినిపించిన స్వీయ రచన ముఖ్య అతిథి మన్ననలను పొందగా, డా. కలవగుంట సుధ సిద్దేంద్రయోగి “భామా కలాపము” లోని అష్టవిధ నాయిక అవస్థలను కళ్ళముందుంచారు. శ్రీమతి మార్తినేని మమత  స్వీయరచనలో “సాధించటానికి అత్మవిశ్వాసం ఉంటే చాలు” అన్నారు.  భారతదేశం నుంచి వచ్చిన మరొక ప్రొఫెసర్ కస్తూరి హనుమంతరావు గారు మాట్లాడుతూ తెలుగు బాషకి ప్రవాసులు చేస్తున్న సేవని ప్రశంసించారు. శ్రీ మల్లవరపు అనంత్ “సింగుతా స్వీటుగా కోల్డుగా” అని పేరడీ తోపాటు, స్వీయరచన “యువచేతనమూ, వసంతరాగ రాజితమూ, దుర్ముఖినామ సంవత్సరమూ” అంటూ చక్కగా ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర చిన్ని, శ్రీ నిమ్మగడ్డ రామక్రిష్ణ, శ్రీ సాజి గోపాల్ తదితరులు పాల్గొని, వివిధ అంశాల మిశ్రమంగా సాగిన కవి సమ్మేళనం ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలయికలా శోభాయమానంగా జరిగింది.

TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Audience TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Gnaapika Pradhaanam to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Group Photo TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Mukhya Athithi Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Pushpa Guchham to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Shaluva Sanmaanam  to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 2 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 3 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 4 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam1

డా.సి.మృణాలిని గారు వృత్తిరీత్యా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక అధ్యయన శాఖకు అధ్యాపకురాలు మరియు దర్శకురాలు.  టి.వి., వార్తాపత్రికలు, పుస్తకాలద్వారా చాలామంది తెలుగువారు అభిమానించే వ్యక్తి. విస్తృత అధ్యయనం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాల తులనాత్మక పరిశీలన ఆమెకు  చాల ఇష్టమైన వ్యాపకం. పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ పాత్రలకి యధాతధమైన అక్షరరూపాన్ని ఇవ్వగలిగిన ప్రజ్గ్ఞాని.  వనితా టీవి ద్వారా వినూత్న కార్యక్రమాలను రూపొందించి, తొలినాళ్ళలో జాబులు జవాబులుతో దూరదర్శన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, వరల్డ్ స్పేస్ రేడియో ద్వారా తెలుగు సాహిత్య వైభవాన్ని, సినీ పాటల సంగీత సౌరభాన్ని ప్రపంచంలోని తెలుగు వారందరికీ వినిపించిన ఘనతని,  ప్రపంచ సభలలో తెలుగు సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని చాటిచెప్పే వకృత్వ పటిమ సొంతం చేసుకున్న డా. మృణాలిని అక్షరాలు తేలికగా జీర్ణమయ్యే ఉగ్గుపాలు.

నవలలో ఏం చెబుతున్నారన్నది వస్తువైతే, ఎలా చెబుతున్నారన్నది శిల్పమవుతుంది.  అంటే వస్తువు తప్ప తక్కిన నవలాంగాలన్నీ శిల్పంలో భాగమే.  సాధారణంగా తెలుగు విమర్శకులు శైలి, శిల్పం అని ద్వంద్వసమాసంలా వాడుతుంటారు గానీ, నిజానికి శైలి కూడా ఒక రకంగా శిల్పంలో భాగమే కనుక, నవలాశిల్పం అన్న ప్రయోగం చాలా విస్తృతి కలిగింది.  వైవిధ్యంతో కూడుకున్నది.  విశ్వసాహిత్యంలోని కొన్ని నవలలను రచయితలు కథా వస్తువుని, శైలిని, శిల్పాన్ని మలచిన తీరును ఈ కోణం నుంచి విశ్లేషిస్తూ చక్కని వివరణ ఇచ్చారు. గొపిచంద్, యండమూరి, సులొచన రాణి, రంగనాయకమ్మ, ఓల్గా, అంపశయ్య నవీన్ ఇలా పాత కొత్త అంటూ లేకుండా అన్ని తరాల రచయితలను, నవలా రచనలనూ గుక్కతిప్పుకోకుండా పోల్చుతూ సాగిన ప్రసంగం అందరిని మంత్రముగ్ధులను చేసింది.

సభకు విచ్చేసిన ఆహూతులకు టాంటెక్స్ తెలుగు సాహిత్య వేదిక వారు “ఉప్పు- కారం” తో పచ్చి మామిడి ముక్కలు, దోర జామ కాయలు, చక్కెర పొంగలి, వేడి వేడి గా పునుగులు, పకోడీలు, పులిహోర, పుదీనా రైస్, తేనీరు తో పసందుగా చక్కని అల్పాహారం అందచేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయ కర్త బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్య అతిధి డా.సి.మృణాలిని గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మాట్లాడుతూ డల్లాస్ లో దుర్ముఖినామ సంవత్సరం సందర్భంగా ఇలా కవి సమ్మేళనం జరపడం ఎంతో సంతోషంగా ఉంది అని, అలాగే డా.సి.మృణాలిని గారు చేసిన ప్రసంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐ., టీవీ5, టీవీ9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస రెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి,  ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణ పూర్వాధ్యక్షుడు  డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సాహిత్యవేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ క్రింది లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2016-Events/Sahitya-Vedika/105th-Nela-Nela-Telugu-Vennela/

 

టాంటెక్స్ 105 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి మార్తినేని మమత  సమర్పించిన నివేదిక.

0 889

ఫిబ్రవరి 21, 2015 డాలస్, టెక్సస్.

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఫిబ్రవరి 21వ తేదీన దేశీప్లాజా స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

బిళ్ళ ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 103వ నెల నెలా తెలుగు వెన్నెల అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు జరుపుకోవడం ఎంతో విశేషం అని చెబుతూ మన మాతృభాష  మనకే కాక ఇతరులకూ విన సొంపైన భాష, సులువైన భాష, రచనలకైనా, భావ వ్యక్తీకరణకైనా సరళమైన భాష, సరసమైన భాష అని కొనియాడుతూ విచ్చేసిన సాహితీ ప్రియులందరికి శుభాభినందనలు తెలియ చేసారు.

TANTEX_NNTV_103_GUEST - Copy TANTEX-NNTV 103_Group1 TANTEX-NNTV_103_CR TANTEX-NNTV_103_JNAPIKA TANTEX-NNTV_103_PRARTHANA

కార్యక్రమంలో ముందుగా పోతన భాగవతా పీఠికలోని ప్రార్ధన పద్యములను చిన్నారులు మాడ సంహిత, మాడ సమన్విత, కర్రి యశస్వి భావయుక్తంగా పాడారు. ఇక దొడ్ల రమణ గారు పోతన పదప్రయోగాల గురించి వివరిస్తూ ఓ సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో బమ్మెర పోతన దిట్ట అని, శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై పట్టే కాకుండా భావంపైన పూర్తి నియoత్రణ సాధించిన మహాకవి అని చెప్పారు. మరికొన్ని పోతన పద్యాలను డా. పుదూరు జగదీశ్వరన్ గారు సభలో రసవత్తరంగా ఆలపించారు.

 

మాసానికో మహనీయుడు శీర్షికన వరిగొండ శ్యాం ‘భారతకోకిల’ శ్రీమతి సరోజినీ నాయుడు గారి ప్రతిభ గురించి మాట్లాడుతూ, ఉదాహరణకి ఆమె వ్రాసిన “Palanquin bearers” ద్వారా భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చెప్పారని కొనియాడారు.

 

ఐఐటి కోచింగ్ లో ప్రసిద్ధులు, ‘ఐఐటి రామయ్య’ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ చుక్కా రామయ్య గారి ప్రతిభ సమత్వం అనే పుస్తకాన్ని మార్తినేని మమత సభకు పరిచయం చేసారు. ప్రాధమిక విద్య మాతృభాషలో వుండాలి అని నమ్మినవారిలొ అయన ఒకరు. ఈ పుస్తకంలో ప్రధానంగా- విద్యను వ్యాపారంగా మార్చకూడదు, విద్యను ఆర్ధిక, వర్ణ, వయో, లింగ భేదాలు లేకుండా అందరికి సమానంగా అందించాలి. సమతుల్యం లోపించినప్పుడు అగాధాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది అని రామయ్య గారు వివరించారు అని తెలియచేసారు.

ఇక, ఇయ్యుని శ్రీనివాస్ గారు పాడిన ‘ఎలా ఈ మధుమాసం’ అనే సినారే గీతం, ఇతర లలితా గీతాలు, ప్రభోధగీతాలు మరియు మంగళ గీతాలు అందరి మనసులను అలరి౦చాయి. వీటికి వాద్య సహకారం మహాభాష్యo సాయి రాజేష్ గారు అందించారు.

 

ముఖ్యఅతిథి శ్రీ మాడ దయాకర్ గారిని సమన్వయ కర్త బిళ్ళ ప్రవీణ్ వేదిక పైకి ఆహ్వానించగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు మరియు పూర్వ సాహిత్య వేదిక సమన్వయ కర్త కన్నెగంటి చంద్ర గారు పుష్ప గుచ్ఛముతో సత్కరించారు. శ్రీ మాడ దయాకర్ గారు కవి కాళిదాసు యొక్క కవితా వైభవము అనితరమని ఆయన కావ్య పరిమళాలు ఖండాంతరాలలో వ్యాపించాయని వివరించారు. కాళికాదేవి మహిమతో సాదారణ కాళిదాసు ఎలా విద్వాంసుడిగా మారారో వివరించి, కాళిదాసు కావ్యాలలోని వాగర్ధ శోభను, అలంకార వైభవాన్ని చాటే శ్లోకాలను, వాటి వెనకున్న అర్ధాలను,కథలను భావయుక్తంగా వినిపించారు. మేఘసందేశపు కథని, కథనాన్ని అందులో నిగూఢమయిన ఎన్నో విశేషాలను వినిపించి మురిపించారు. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నది ఎంతో అర్ధవంత మయినదనీ, అందులోనూ ‘అభిజ్ఞాన శాకుంతలం’ కడు రమణీయమయినదనీ చెబుతూ, కాళిదాసు కవిత్వ సారమంతా ఈ ఒక్క కావ్యం చదివినా అవగతమవుతుందని, అంత సమయం లేకపోతే అందులో నాలుగవ అంకం చదివినా అదీవీలవకపోతే అందులోని నాలుగవ అంకం లోని నాలుగు శ్లోకాలు చదివినా ఆ రమణీయత అర్ధమవుతుందని చెప్పారు. రాగ యుక్తంగా శ్లోకాలను ఆలపించి వాటి అర్ధాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించిన విధానం ఆహుతులని కట్టి పడేయడమే కాకుండా, తాము విన్నది ఒక సంస్కృత కవి గురించి కాక, ఒక సుపరిచిత తెలుగు కవి కవితా పరిమళమేమో అని అబ్బుర పరిచింది.

 

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలలనుండి ఎంతోమంది వీక్షించారు. అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ‘టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు’ ఏప్రిల్ 16న ఇర్వింగ్ హైస్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు.

 

సాహిత్య వేదిక సభ్యులు డా. కలవగుంట సుధ మరియు మార్తినేని మమత ముఖ్య అతిథి శ్రీ మాడ దయాకర్ గారిని గారిని శాలువాతో మరియు సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణవేణి శీలం, కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గ సభ్యులు తోట పద్మశ్రీ, పాలేటి లక్ష్మి, పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, మార్తినేని మమత, దిండుకుర్తి నగేష్, వరిగొండ శ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ న్యూస్, 6టీవీలకు కృతఙ్ఞత తెలియజేసారు.

0 962

అక్టోబర్ 18, 2015, డాలస్,టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 99 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

చిన్నారి ఉపాధ్యాయుల స్మృతి రమ్యంగా ఆలపించిన ‘దేవ దేవం భజే’ భక్తి గీతం తో సభ ప్రారంభమయింది. పోతన భాగవతం రెండవ స్కంధం నుండి శుకుడు పరీక్షితునకు బోధించిన ముక్తి మార్గము మరియు ప్రకృతి అంశంబున ఏర్పడిన విరాడ్రూపముల గురించి వివరించే పద్యాలను దొడ్ల రమణ భావయుక్తంగా పాడి, అర్ధాలను కూడా సందర్భోచితంగా వివరించారు. శ్రీమతి బల్లూరి ఉమాదేవి స్వీయ కవిత ఆహూతుల మన్ననలు పొందింది. డా. వాసుదేవ సింగ్ రచించిన ‘కంగుంది కుప్పం వీధి నాటకాలు – శాస్త్రీయ పరిశీలనం’ పుస్తకాన్ని డా. కలవగుంట సుధ సభకు పరిచయం చేసి, పంజాబి అయినప్పటికి తెలుగు లో రచన చేయడం రచయిత కు తెలుగు భాష ఫై పట్టుకు నిదర్శనం అని కొనియాడారు. శ్రీమతి అట్లూరి స్వర్ణ “సరదాగా కాసేపు” క్విజ్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగి, ఆహూతులకు భాష, సాహిత్యం ఫై ఉన్న మక్కువను తెలియచేసింది.

TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (1) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (2) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (3) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (4) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (10) TANTEX_NELA NELA TELUGU  VENNELA_99th_SESSION_NRI_NEWS_DALLAS_TX_V1 (11)

ముఖ్య అతిధి శ్రీమతి స్వాతి శ్రీపాద గారు చిన్నతనంలోనే సాహిత్యాభిరుచి అలవరచుకొని, పువ్వు పుట్టగానే పరిమళించు అనే నానుడిని నిజం చేస్తూ తొమ్మిది సంవత్సరాలకే కథ, కవిత, పాట రచన చేసి, ప్రతి క్షణాన్నీ సాహితీ సేవకే అంకితం చేయాలనే దృఢ సంకల్పంతో తెలుగు సాహిత్య అకాడమీ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆకాశవాణి, వివిధ పత్రికలకు రచనలు అందిస్తూనే కేంద్రీయ విద్యాలయం స్నాతకోత్తర విభాగంలో ఆంగ్ల అధ్యాపకురాలిగా అత్యున్నతమైన సేవలందించారు. నలభై ఐదు సంవత్సరాలుగా “ఇందూరు భారతి” సభ్యురాలిగా, సంయుక్త కార్యదర్శిగా సేవలందించడంతో పాటు, ఆ సంస్థ ప్రార్ధనా గీతాన్ని రచించారు. తెలుగు-ఆంగ్లం మరియు ఆంగ్లం-తెలుగు అనువాదం ద్వారా ఉత్తమమైన రచనలను పాఠకులకు చేరువచేసి, సాహితీ సంపదను భాసిల్లజేసి, తెలుగు విశ్వవిద్యాలయం “ఉత్తమ మహిళా రచయిత్రి” కీర్తి పురస్కారము పొందారు. స్వాతి శ్రీపాద గారు ప్రధాన ప్రసంగం చేస్తూ, కృష్ణశాస్త్రి పంచ భూతాలను ఆయన ప్రాణం గా వ్రాసుకున్నారని, గాలి, నీరు, నిప్పు గురించి వర్ణిచే తీరులో తనదైన శైలిని చూపించారని వివరించారు. సోదహరణగా, గాలి వీచింది అని కాకుండా చల్లగాలి ఊయలూగినట్లు, నీటిని కన్నీరుగానూ, కొలను నీరు ఉలికి పడుతుంది అని, నిప్పు ని కసిరే ఎండగా వర్ణించి, ఆయన సొంత బాణీని అందరి మనసులో ఎల్లకాలం నిలిచేలా చెరగని ముద్రవేసిన తీరును ఆసక్తికరంగా చెప్పారు. కృష్ణశాస్త్రి వాడిన సరళమైన భాష వల్ల, ఒకే హల్లుని మరల మరల వాక్యంలో వాడటం వల్ల, ఆయన కవిత్వంలో లాలిత్యం, లయ మరింతగా ఒదిగిపోయినట్లు అనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదని, ఒక్క “ర” కారం తప్ప సమ్యుక్తాక్షరాలు లేకుండా ద్విత్త్వాక్షరాలతో సరళమైన పదాలతో రచన ఆయనకు భాష పై ఉన్న పట్టుని తెలియజేస్తుందన్నారు. ఆంగ్ల తెలుగు భాషలపై అంత పట్టు ఉంది గనుకనే షెల్లీ, కీట్స్ వంటి కవుల ప్రభావం ఆయనపై ఎంతో ఉన్నప్పటికీ, ఏ ఒక్క రచన కూడా, వారి భావానికి అనువాదం అని చెప్పలేము, కానీ కవిత్వం లో ఆయన పాటించిన మర్యాద, వినయం ఆంగ్ల సాహిత్య ప్రభావమే అని విశదీకరించారు. ఉదాహరణకి, ఆకులో ఆకునై పాటలో నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉంది అని కోరికలా కాకుండా, ఒక విన్నపం లేదా అభ్యర్థన లా “ఎటులైనా ఇచటనే ఆగిపోనా” అనడం లో కనిపిస్తుందని, కృష్ణశాస్త్రి మంచి బాష కవి మాత్రమే కాదు, ఒక సంఘసంస్కర్త కూడా అని తెలియచేసారు.
కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు శ్రీ శ్రీ “భారతదేశపు నిలువుటద్దం బ్రద్దలయ్యింది. వసంతం మళ్ళీ వాడిపోయింది” అని భావోద్వేగాన్ని వ్యక్తీకరించారని గుర్తు చేసారు.

 

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ దీపావళి వేడుకలు నవంబరు 14న ఇర్వింగ్ హై స్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు”100వ నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 21న ఘనంగా జరుపడానికి ప్రణాళిక సిద్ధమయిందని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు. విచ్చేసిన సాహితీ ప్రియులు డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, వేముల లెనిన్ బాబు కృష్ణశాస్త్రి రచించిన “జయ జయహే”, “ఆకులో ఆకునై” మున్నగు గీతాలను శ్రావ్యంగా ఆలపించి అందరి మన్ననలు పొందారు. సాహిత్యవేదిక ప్రారంభానికి ముందు, ఆట్లాంటా నుండి విచ్చేసిన సాహితీవేత్త, రచయిత, కవి, దర్శకుడు డొక్కా ఫణి నిర్మించి, దర్శకత్వం వహించిన “పల్లకి” అను లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మరుగైపోతున్న పల్లకి వంటి సాంప్రదాయల్ని కళ్ళు చెమర్చేలా చూపించారు అని ప్రేక్షకులు కొనియాడారు.

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, పాలకమండలి ఉపాధిపతి చాగర్లమూడి సుగన్, పాలకమండలి సభ్యులు రొడ్డ రామకృష్ణా రెడ్డి, పుట్లూరు రమణారెడ్డి, సమన్వయకర్త దండ వెంకట్, సాహిత్య వేదిక సభ్యులు ముఖ్య అతిథి శ్రీమతి స్వాతి శ్రీపాద గారిని శాలువా మరియు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. దండ వెంకట్ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ,6టీవీలకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

0 1252

ఆగష్టు 16, 2015, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఆగస్ట్16వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 97 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

 

నేమాని పార్థసారధి గారి శిష్య బృందం ఆలపించిన ‘గరుడ గణనాయక రారా’ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. జొన్నవిత్తుల గారు రచించిన ‘బొంగరాల సుడిగల’ అనే తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పే గీతాన్ని చిన్నారులు నువ్వుల అభిరాం, బ్రహ్మదేవర ఫ్రణవ్, మర్నేని స్నేహ, మర్నేని స్నిగ్ధ, కోరాడ రిషిక, కోట ఆకాష్ ఎంతో మనోహరంగా ఆలపించారు. దొడ్ల రమణ గారి ఆధ్వర్యంలో పోతన భాగవతంలోని పద్యాలను చిన్నారులు పటించటమే కాకుండా, పద్యాల్లోని పదాలకు అర్థాన్ని కూడా విశదీకరిస్తూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారు. చిన్నారులు దొడ్ల నిర్జర, మాడ సంహిత, మాడ సమన్విత, కస్తూరి అమృత, మందిరం వర్షిణి, మందిరం హర్షిణి, నేమాని కార్తిక్ లు తెలుగు భాష పై చూపుతున్న ఆసక్తి, ప్రావీణ్యం అందరిని ముగ్దులను చేసింది. చేవూరి చంద్రశేఖర్ రెడ్డి గారు స్వీయ రచన ఆకట్టుకుంది. కథలు, కవితలు, యాత్రా రచనలు, సాహిత్య వ్యాసాలు, రూపకాలు, రేడియో ప్రసంగాల ద్వారా సుపరిచితులయిన దాసరి అమరేంద్ర గారు ‘సామాన్యుని సాహితీయానం’ పై తమ స్వీయ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు. వృత్తిరీత్యా ఇంజినీరు అయినప్పటికీ, ప్రవృత్తిరిత్యా పాఠకుడు, యాత్రికుడు, మరియు నిరంతర అన్వేషి అయిన అమరేంద్ర గారు, జీవితం-సాహిత్యం వేరు కావని, అవి పరస్పర ఆధారితాలు అనీ, పుస్తకాలు చదివితే వాటి యొక్క ప్రభావం మన నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చాలా చక్కగా వివరించారు. సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ గారి ప్రశ్నావినోదం (క్విజ్) అందరిని ఆకట్టుకుంది. మర్చిపోతున్న విషయాలను మరొక్కసారి గుర్తుకుతెచ్చుకునే అవకాశాన్ని ఈ క్విజ్ కార్యక్రమం కలిగిస్తుంది.

 

ముఖ్య అతిధి ఆచార్య రవ్వ శ్రీహరి గారు ‘అన్నమయ్య భాషా వైభవం’ పై చేసిన ప్రసంగం అందరిని తెలుగు భాష మరియు భక్తి రసంలో ముంచెత్తింది. రచనా ప్రక్రియలో తెలుగు రచనలకు పెద్ద పీట వేసి, సుమారు 50 గ్రంధాలను, 25 సంస్కృత గ్రంధాలను రచించి, పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాలమీద తమదైన ముద్ర వేసారు. శ్రీహరి గారు ద్రావిడ విశ్వవిద్యాలయానికి మాజీ ఉపకులపతిగా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దాదాపు పదిహేడు సంవత్సరాలు బోధన చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ గా పని చేసి తెలుగు భాషపై అనర్గళమైన పరిఙ్ఞానాన్ని ఆపాదించుకుని ధన్యులయ్యారు. వీరు సంస్కృత విశ్వవిద్యాలయంచే మహామహోపాధ్యాయ బిరుదు, సి.పి.బ్రౌన్ పురస్కారాలు అందుకున్న ఘనత వీరికే దక్కింది. ఈనాడు మన తెలుగు భాష ప్రయోగంలో చాలా వరకు సంస్కృత పదాలను ఉపయోగించటం జరుగుతోందని, అన్నమయ్య మాండలిక భాషను ప్రయోగించిన తీరును తెలియజేస్తూ, మనకు తెలియని చాలా తెలుగు పదాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర వ్యవధిలో జరిగినప్పటికీ అప్పుడే అయిపొయిందా? అనిపించింది.

Sahitya Vedika 97th Guest Jnapika Sahitya Vedika 97th Guest Shaluva Sanmanam Sahitya Vedika 97th Padyalu Sahitya Vedika 97th Prarthana geetham Sahitya Vedika 97th Pushpaguchham Sahtithaya Vedika 97th Group Picture

ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రం ఈ. టీవి. వారి “స్వరాభిషేకం” ఆగష్టు 29న ఆలెన్ ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు “100వ నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, పాలకమండలి ఉపాధిపతి చాగార్లమూడి సుగన్, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు, పాలకమండలి సభ్యులు బావిరెడ్డి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, కలవగుంట సుధ ముఖ్య అతిథి ఆచార్య రవ్వ శ్రీహరి గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. పోషకదాతలు జువ్వాడి రమణ గారిని మరియు డా. పెనుకొండ ఇస్మాయిల్ గారిని జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తగా వ్యవహరించిన అట్లూరి స్వర్ణ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

0 1037

డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” అష్టమ వార్షికోత్సవం ఈ నెల ఆదివారం జూలై 12 మలంకార చర్చి ఆడిటోరియంలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. తెలుగు భాష, సాహిత్యం, సంస్క్రతి పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో మరో మైలు రాయి ఈ అష్టమ వార్షికోత్సవం. “సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం” గా ప్రతి సంవత్సరం జరుపుకునే మన తెలుగింటి వేడుక. పద్యం, హాస్యం ప్రధాన ఇతివృత్తాలుగా సాగిన ఈ వేడుక పిల్లలు, పెద్దల భాగస్వామ్యంలో ఏంతో సందడిగా, మన ఇంటిలో వేడుకలా ఆద్యంతము ఉల్లాసంగా జరిగింది. ముఖ్య అతిధి శ్రీ తురిమెళ్ళ శంకర నారాయణ గారు, విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి గారు, ప్రత్యేక అతిధి శ్రీమతి అమల్లదిన్నె పద్మజ గారు, టాంటెక్స్ కార్యవర్గం, పాలకమండలి సభ్యులు, సాహిత్య వేదిక సభ్యుల జ్యోతి ప్రజ్వలనతో సభ ఘనంగా ప్రారంభమైంది. చిన్నారి చావలి ఉమ సరస్వతి నమోస్తుతె ప్రార్ధనా గీతం వీనులవిందుగా ఆలపించింది. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ ప్రారంభోపన్యాసం చేస్తూ మన సాహితీ సంపదను కాపాడుకోవడానికి, సాహితీ పండితులను గౌరవించడానికి ప్రయత్నం ఒక ఎత్తయితే, వీటిని భావితరాలకు అందించడం అంతే ముఖ్యమని, ఈ సంవత్సంలో ఇంతవరకు దాదాపు 30 మంది బాల బాలికలు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన తీరును కళ్లకద్దినట్లు వివరించారు. మన భాష, సాహిత్యం విరాజిల్లేందుకు చేయి చేయి కలిపి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

శ్రీమతి చావాలి మంజు హేమమాలిని సమర్పణలో గురు పరంపర డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ బాల బాలికల సంగీత విభావరిలో దరువర్ణం మాతే మలయధ్వజ, బ్రహ్మ మొక్కటే అతి మధురంగా గానం చేసి ఆహుతుల హర్షద్వానాలు అందుకున్నారు. ప్రత్యేక అతిధి శ్రీమతి పద్మజ అమల్లదిన్నె(మల్లాది) గారి పద్య పఠన ప్రాముఖ్యత ప్రసంగం ఒక ప్రవాహంలా సాగి, నన్నయ్య నావాడని, పోతన నావాడని వాదించే ఉదాహరణలో, అచ్చులని హల్లులని ఎలా విడదీయలేమో అలాగే పద్యాలని కూడా ప్రాంతాలవారీగా విడదీయలేమని, పద్యం తెలుగువాడి సొంతమని కొనియాడారు. శ్రీ దొడ్ల రమణ పోతన భావతంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి, సభలోని వారి అందరిచేత ఔరా అనిపించుకున్నారు. అంతే కాకుండా శ్రీ దొడ్ల రమణ గారు, అన్నీ సాధ్యమే అనే రీతిలో, తెలుగు భక్తి సామ్రాజ్యానికి తిరుగులేని రాజైన పోతన విరచిత భాగవతము నుండి మధురమైన కొన్ని పద్యాలను తొమ్మిది మంది బాల బాలికలకు శిక్షణ ఇచ్చి, వారిలో పద్యంఫై అవగాహన పెంపొందించి, అనతి కాలంలోనే పిల్లలలో ప్రతిభను వెలికితీసి, “పోతన పద్య పరిమళము” రూపొందించి, ఏంతో రమ్యంగా ఆలపించేట్లు తీర్చిదిద్దిన రమణ గారిని, పిల్లలను అందరూ కొనియాడారు. ముఖ్యంగా మూడేళ్ళ మాడ సమన్విత, నాలుగేళ్ళ రిషికేష్ సిద్ధార్థ రాగ భావయుక్తముగా చదివిన తీరు ఆహుతులని మంత్రముగ్దులని చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ చిన్నారులు భక్తితో, స్పష్ఠమైన ఉచ్ఛారణతో చేసిన ఈ పద్యపఠనం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, తెలుగు సాహిత్య భక్తి సంపదలు పదిలంగా దాచుకొని పెంపొందిచగల సామర్థ్యం తరువాతి తరానికి ఉందని ఋజువు చేశారు. విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు రాయభారం పద్యాలను శ్రీ కృష్ణుడు వేషములో ఆలపించి అందరిని పద్య నాటకపు రోజులలోకి తీసుకువెళ్ళారు. చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని పద్యాలకు సభ దద్దరిల్లింది. విశిష్ఠ అతిధి డా.కేతు విశ్వనాథరెడ్డి గారు “మన తెలుగు మనం” అంశంపై ప్రసంగిస్తూ సాహిత్యం భాషలో ఒక భాగమే కాని సాహిత్యం మాత్రమే భాష కాదని, శుధ్ధ భాష అంటూ ప్రత్యేకం గా ఉండదని, మాండలికాలు వేరైనా భాష అంతా ఒకటేనని భాషా దురభిమానము తగదని హితవు చెప్పారు. డా. కలవగుంట సుధ సమర్పణలో తెలుగు భాషా, సాహిత్యం, సంగీతం, సంస్కృతి సంప్రదాయాలకు అద్వితీయమైన సేవలందించిన ప్రముఖ తెలుగు వాగ్గేయకారులను స్మరించుకుంటూ తెలుగు సాహిత్య వేదిక సభ్యులు మరియు లాస్యసుధ నృత్య అకాడమీ శిష్య బృందం సమన్వయంగా “తెలుగు వాగ్గేయకారులు” నృత్య రూపకాన్ని కన్నుల పండువగా ప్రదర్శించారు. అన్నమయ్య, త్యాగయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, క్షేత్రయ్య, నారయణ తీర్థులు, రామదాసు వంటి వాగ్గేయకారులు శృంగారం, భక్తి వగైరాలే కాక ఆనాటి సాంఘిక పరిస్థితులను స్పష్టం చేస్తూ పదాలు రచించారు. వారు లోకాన్ని దర్శించిన ప్రఙ్ఞ, సంగీత, సాహిత్యాలను కరతలామలకం చేసుకోగలిగిన నిష్ఠ, దాన్ని ప్రభోదాత్మకంగా, రంజకంగా, నవనవోన్మేషంగా పునః సృష్టి చేసిన తీరును నృత్యరూపకం ద్వారా చక్కగా వివరించారు. ఈ నృత్యరూపకంలో త్యాగయ్యగా ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, సాహిత్య వేదిక సభ్యులు సుబ్బు దామిరెడ్డి గురువుగా, అన్నమయ్యగా నాగ సురేష్ సుగ్గల, మునిపల్లె సుబ్రమణ్య కవిగా వరిగొండ శ్యాం, రాముడి పాత్రలో జలసూత్రం చంద్రశేఖర్, నారాయణ తీర్ధులుగా బసాబత్తిన శ్రీ, సంయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం శ్రీ రామదాసు పాత్రలలో అలరించారు.

అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, సంవత్సర ప్రధమార్ధంలో నిర్దేశించిన “ప్రగతి పధములో పది సూత్రాలు” ఒక్కొక్కటి క్రమంగా కార్యరూపం దాల్చడం, నెరవేర్చడం చాల సంతోషంగా వుందన్నారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రం ఈ. టీవి. వారి స్వరాభిషేకం ఆగష్టు 29న ఆలెన్ ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు “100వ నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

TANTEX 8th Year Anniversary -  guest1 TANTEX 8th Year Anniversary -  Nruthyam group TANTEX 8th Year Anniversary - group1 TANTEX 8th Year Anniversary - guest sanmanam1 TANTEX 8th Year Anniversary - guest sanmanam2 TANTEX 8th Year Anniversary - Nrutyam1 TANTEX 8th Year Anniversary - Nrutyam3 TANTEX 8th Year Anniversary - pruchhakulu

ముఖ్య అతిథి హాస్య బ్రహ్మ శ్రీ శంకర నారాయణ గారి హాస్యావధానంలో తన ప్రతి మాటలో హాస్యాన్ని కురిపిస్తూ సభికులని నవ్వుల్లో ముంచారు. భార్య లాండ్ లైన్, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ అంటూ వారు చెప్పిన పోలికలకు అందరూ కడుపుబ్బా నవ్వారు. స్కూలు తగలపడిపోతోందనీ, కానీ ఉపాధ్యాయులందరూ బయట ఉన్నారని వాపోయిన ఒక పిల్లవాడి గురించి చెప్పినపుడు సభికులు హర్షద్వానాలు చేసారు. కీర్తి శేషులు జంధ్యాల గారు చెప్పిన అప్పగింతలు గురించి మాట్లాడుతూ “అప్పగింతల సమయలో అమ్మాయి ఏడుపు ఆఖరి ఏడుపు అలాగే అబ్బాయి నవ్వు కూడా ఆఖరిదే” అన్నారు. హాస్య ప్రసంగం తదుపరి శ్రీ పూదూర్ జగదీశ్వరన్ సంధాత గా వ్యవహరించగా, డా. ఆళ్ళ శ్రీనివాస్రెడ్డి, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, శ్రీ ప్రభల శ్రీనివాస్, శ్రీ జలసూత్రం చంద్రశేఖర్, శ్రీ రాయవరం భాస్కర్, శ్రీమతి మల్లాది పద్మజ, శ్రీ మాడ దయాకర్ పృచ్చకులుగా హాస్యావధానంలో పాల్గొన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు సుభద్రపై పద్యం చదవమనగా శంకర నారాయణ గారు చక్కగా పద్యాన్ని కూర్చి ఆలపించారు. హనుమంతుని తోక పెద్దదా? లేక ద్రౌపది కోక పెద్దదా అన్న చిలిపి ప్రశ్నకి హనుమంతుని తోకే పెద్దదని సమధానమిచ్చారు. ఈ మధ్యనే విడుదల అయిన బాహుబలి చిత్రంలోని కాలకేయుడి భాష గురించి రాయవరం భాస్కర్ గారు ప్రశ్నించగా సరదాగా జవాబిచ్చారు. మగవారి గొప్పదనం గురించి ఆడవాళ్ళు చెప్పుకుంటారా? అన్న జలసూత్రం చంద్రశేఖర్ గారి ప్రశ్నకు ఇచ్చిన జవాబు సభికులని నవ్వుల్లో ముంచింది. మల్లాది పద్మజ గారు, విశ్వనాధ సత్యనారాయణ గారు ఈరోజుల్లో ఉంటే సెల్ ఫోనులో ఏమి మాట్లాడేవారని అడిగిన ప్రశ్నకు కూడా ఎంతో తెలివిగా సమధానమిచ్చి మళ్ళీ సభికుల్ని కడుపుబ్బా నవ్వించారు. మీ పేరులో శంకరుడున్నాడు, నారాయణుడున్నాడు, వీరిద్దరిలో మీరెవరిని ఎంచుకుంటారు, అని ప్రభల శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. పృచ్చకుల నుండే కాకుండా సభలోని వారు కూడా హాస్యావధాని శంకర్ నారాయణ గారిని అడిగిన ప్రశ్నలకు హాస్యంతో బదులిచ్చి అందరినీ నవ్వించారు.

అట్లూరి స్వర్ణ గారు సభా ప్రాంగణాన్ని అలంకరణ చేసిన తీరు, అన్ని అంశాలను మంచి ఆలోచనతో కూర్పు చేసిన పూర్వ సాహిత్య కార్యక్రమ చాయా చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి క్రష్ణారెడ్డి, కార్యదర్శి మహేష్ ఆదిత్య ఆదిభట్ల, కోశాధికారి శీలం క్రష్ణవేణి, పాలకమండలి సభ్యులు రొడ్డ రామక్రష్ణా రెడ్డి, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం సింగిరెడ్డి శారద, బిళ్ళ ప్రవీణ్, వనం జ్యోతి, గోవాడ అజయ్, పాలేటి లక్ష్మి, వీర్నపు చినసత్యం, పావులూరి వేణు ముఖ్య అతిధి శ్రీ తురిమెళ్ళ శంకర నారాయణ గారిని , విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి గారిని, ప్రత్యేక అతిధి శ్రీమతి అమల్లదిన్నె పద్మజ గారిని, చలనచిత్ర నటులు శ్రీ నందమూరి తారకరత్న గారిని, సంగీత దర్శకులు శ్రీ నేమాని పార్థసారథి గారిని పుష్పగుచ్చ్చం, శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ 96 నెలలు ఒక యజ్ఞంలా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రం నిరాటంకంగా సాగడానికి కారకులైన సభ్యులకు, కార్యకర్తలకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పోశకదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS