కోడి రామ్మూర్తి నాయుడు – ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు

కోడి రామ్మూర్తి నాయుడు – ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు

0 1400

ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు కోడి రామ్మూర్తి నాయుడు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.

ఈయన శాకాహారులు. భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించడం వల్లనే ఆయన జగదేక మల్లుడయ్యారు.

ఆయన శక్తి, కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో కొన్ని హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఛాతిపై పెట్టాడు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోసారి రంగూన్లో హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులను చితకబాది, సురక్షితంగా బయటపడ్డారు. మాల్కానగరంలో భారతంలో భీముడి మాదిరిగా విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఒక విందులో విషం కలిపిన పాలు తాగారు. అప్పుడు ఆయన్ని కాపాడింది యోగ విద్యే. విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు.

1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు. మరునాడు సంక్రాంతి.. కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వతనిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది. బాలగంగాధర్ తిలక్ చేతులమీదుగా బ్రతికి ఉన్నప్పుడు కర్పూర హారతులు అందుకున్న కోడిరామ్మూర్తినాయుడు మరణానంతరం కూడా మన నీరాజనాలందుకొనే ఉంటారు.

– వేణు గోపాల్ కంచేటి

kodi-rammoorthi-naidu-mallayodhudu