అట్లాంటా మహా నగరములో సిలికానాంధ్ర మనబడి మొట్టమొదటి మనబడి సాంస్కృతికోత్సవాన్ని గత ఆదివారం, మే 11వ తేదీన అట్లాంటా ఈవెంట్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రాంతీయ తెలుగు సంఘం “తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)” వారు అందించిన సహకారం చాలా ప్రశంసించతగినది. అతిధులుగా సిలికానాంధ్ర నుండి స్నేహ వేదుల గారు మరియు శరత్ వేట గారు పాల్గొన్నారు. వారు తెలుగు భాషను ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా చేయాల్సిన అవసరాన్ని మరియు దాన్ని భావి తరాల వారికి అందజేయాల్సిన కర్తవ్యాన్ని వివరించారు.Atlanta MCF 2014(1) Atlanta MCF 2014

ఈ కార్యక్రమానికి విశేషంగా పిల్లలు, తల్లిదండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, వాలంటీర్లు, పెద్దలు, వృద్దులు మరియు శ్రేయోభిలాషులు అట్లాంటా మరియు చుట్టుపక్కల పట్టణాలు అయిన కమ్మింగ్, జాన్స్ క్రీక్, ఆల్ఫరెట్ట, దన్వుడి, డులూత్ మరియు ఇతర ప్రాంతాల నుండి విచ్చేసి ఆసాంతం కార్యక్రమం విజయవంత మయ్యేలా చూసారు. ముందుగా ఈ కార్యక్రమం అట్లాంటా సిలికానాంధ్ర సమన్వయ కర్త విజయ్ రావిళ్ల గారి స్వాగతోపన్యాసం తో ప్రారంభమయి తరువాత శోభాయాత్ర, వేదప్రవచనం, భాషాజ్యోతి కార్యక్రమాలతో ఎంతో కన్నుల పండుగగా జరిగాయి.

తామా బోర్డు డైరెక్టర్ నగేష్ దొడ్డాక మాట్లాడుతూ మనబడి తరగతులను అట్లాంటా ప్రాంతంలోని మిగతా ప్రదేశాల్లో కూడా ప్రారంభించాలని సూచించారు. తదనంతరం మనబడి విద్యార్థులచే ప్రదర్సించబడిన బాలగానామృతం, పద్యపటనం, నాటికలు, నృత్య రూపకాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అబ్బురపరిచాయి. పసందైన విందు భోజనాన్ని అందరు ఎంతో ఇష్టముతో ఆరగించారు.

అలాగే దాతలయినటువంటి “నాటా” కార్యవర్గ సభ్యులను, తామా కార్యనిర్వాహక బృందాన్ని మరియు స్వచ్చంద సేవకుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన నగేష్ దొడ్డాక, వినయ్ మద్దినేని, వెంకట్ మీసాల, దేవానంద్ కొండూర్, శ్రీధర్ వాకిటి, ప్రవీణ్ బొప్పన, సుష్మ కొసరాజు, నాగిని మాగంటి, హర్ష యెర్నేని, భరత్ మద్దినేని వారందరికీ తామా విద్యా కోశాధికారి రాజు మందపాటి కృతజ్ఞతలు తెలియజేశారు.